పవన్ ఆవేశం...వైసీపీ వ్యూహం...టీడీపీ చోద్యం

ఏపీ రాజకీయాలలో ఒక చిత్రం జరుగుతోంది. ట్రెండీ పాలిటిక్స్ కి తెరలేచి చాలా కాలం అవుతోంది.

Update: 2023-07-16 07:33 GMT

ఏపీ రాజకీయాలలో ఒక చిత్రం జరుగుతోంది. ట్రెండీ పాలిటిక్స్ కి తెరలేచి చాలా కాలం అవుతోంది. అదే టైం లో ట్రెడిషనల్ పాలిటిక్స్ కి దాదాపుగా కాలం చెల్లినట్లుగానే ఉంది. చంద్రబాబు ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తారు. జగన్ ఓల్డ్ ట్రెడిషన్స్ ని ఫాలో కారు. ఆయన రాజకీయ దారి వేరు.

ఇపుడు సినీనటుడు కం పొలిటీషియన్ అయిన పవన్ కళ్యాణ్ రాజకీయం న్యూ ట్రెండ్ గా ఉంది. ఆయన సభలు కానీ ఆయన మీడియా మీటింగులు కానీ సమావేశాలు కానీ ఆయన పద్ధతిలోనే సాగుతాయి. పవన్ ది ఆవేశపూరిత రాజకీయం.

ఆయన స్వతహగా ఆవేశపరుడు అని అంటారు. ఆయన దాన్ని రాజకీయాల్లోకి తెచ్చి వాడుతున్నారు. పవన్ ఆవేశ రాజకీయాలకు యూత్ బిగ్ ఫ్యాన్స్ గా ఉన్నారు. ఆయన ఊగిపోతూ మాట్లాడే మాటలను డైలాగులను ఎంజాయ్ చేసే అతి పెద్ద సెక్షన్ యూత్. మిగిలిన వర్గాల సంగతి ఎలా ఉన్నా పవన్ అంటే యూత్ ఐకాన్. ఆయన వారితోనే ఉంటారు. వారిని చూసే ఆయన ప్రసంగాలు చేస్తారు అని అంటారు.

ఇక పవన్ రాజకెయాలలో వ్యూహాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. కానీ ఏపీలో మరో వైపున వైసీపీ టీడీపీ రెండు పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు అధికారాన్ని అందుకున్నాయి. పవన్ ఆవేశాన్ని క్యాష్ చేసుకోవడానికి రెండు పార్టీలూ చూస్తున్నవే. టీడీపీ పవన్ తో ఫ్రెండ్లీగా ఉంటోంది. వైసీపీ ఫుల్ యాంటీగా ఉంటోంది. ఈ నేపధ్యంలో పవన్ ఆవేశాన్ని వాడుకుంటూ వైసీపీని గద్దె దించాలన్నది టీడీపీ ఆలోచన.

అయితే అదే ఆవేశాన్ని తమకు అనుకూలంగా మలచుకుని టీడీపీకి భారీ దెబ్బేయాలన్నది వైసీపీ మాస్టర్ ప్లాన్. అందుకే పవన్ని కోరి మరీ వైసీపీ రెచ్చగొడుతోంది. పవన్ కళ్యాణ్ ఒకటి అంటే దానికి పది జోడించి వైసీపీ మంత్రులు, ఇతర నేతలు దారుణంగా కామెంట్స్ చేయడం వెనక ఉన్న ఉద్దేశ్యం అదే.

పవన్ కళ్యాణ్ జగన్ని ఏకవచనంతో సంబోదిస్తాను అని ఏకంగా ఒక బోల్డ్ స్టేట్మెంటే పాస్ చేశారు. అది వేలాది మంది జనాలు ఉన్న చోట, వేదిక మీద నుంచి. అయితే దాన్నే రివర్స్ లో వాడుతోంది, పవన్ కే తిప్పికొడుతోంది వైసీపీ. లేటెస్ట్ గా వైసీపీ మంత్రి రోజా పవన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సింగులర్ గా జగన్ని సంబోదిస్తాను అని చెప్పడం కాదు, సత్తా ఉంటే సింగిల్ గా 175 సీట్లలో పోటీ చేస్తాను అని చెప్పాలి పవన్ అంటూ తనదైన శైలిలో సవాల్ విసిరారు.

పవన్ కళ్యాణ్ మాటలకు చేతలకు పొంతన లేదని, ఆయన ఆవేశం తమ మీద కాదు తన జనసేన మీద రాజకీయం మీద చూపించాలని వైసీపీ అంటోంది. దాని అర్ధం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీకి దిగాలన్నదే. పవన్ కళ్యాణ్ కాపులను కట్టకట్టి మరీ తీసుకెళ్ళి చంద్రబాబుకు తాకట్టు పెడతారు. బాబు ప్రయోజనాలు కాపాడడమే పవన్ రాజకీయం అంటూ వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ ఉద్దేశ్యం కూడా స్పష్టం.

పవన్ ఎక్కడో అక్కడ ఆవేశపడి బహిరంగ సభల్లో తాను ఒంటరి పోరుకే రెడీ అని చెబుతారు అన్నదే వైసీపీ మార్క్ వ్యూహం. అయితే ఎంతటి ఆవేశం ప్రదర్శిస్తున్నా కూడా సింగిల్ గా పోటీ అని మాత్రం అనడంలేదు. ఆయన తన విపరీత కోపంతో మాటలు కొన్ని జారుతున్నా పొత్తుల విషయంలో మాత్రం జాగ్రత్తగానే ఉంటున్నారు.

అదే సమయంలో ఆయన వాలంటీర్ల విషయంలో చాలా మాట్లాడి కొంత నష్టం తనకూ తనతో పొత్తు కుదుర్చుకునే పార్టీలకూ చేకూర్చారు అని అంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు పవన్ ఇద్దరూ వద్దనుకుంటారని, వారు అధికారంలోకి వస్తే రద్దు చేస్తారు అని కూడా ఇపుడు వైసీపీ ప్రచారం చేస్తోంది. ఈ విధంగా పవన్ ఆవేశం కొంత టీడీపీకి చికాకు పెట్టేలా రెండవ విడత వారాహీ యాత్రలో సాగింది అని అంటున్నారు.

ఏది ఏమైనా ఎంతలా ఆవేశం ప్రదర్శించినా పవన్ కీలక విషయాల్లో మాత్రం ఎక్కడా తడబాటు పడడంలేదు. వైసీపీ మాత్రం పవన్ నుంచి కోరుకుంటున్న ప్రకటనలు అయితే రావడం లేదు. అయితే పవన్ స్పీచుల విషయంలో టీడీపీ కూడా ఆసక్తిగా ఒకింత ఆందోళనగా కూడా ఉంటూ గమనిస్తోంది. అయితే పవన్ స్పీచులలో ఆవేశం ఎక్కువ ఉన్నా వైసీపీకి రాజకీయంగా మేలు చేసే ప్రకటనలు పెద్దగా లేవని ఊపిరిపీల్చుకుంటోంది.

అయితే వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ కామెంట్స్ మాత్రం వైసీపీకి ఖుషీని ఇవ్వగా టీడీపీకి ట్రబుల్స్ ని తెచ్చాయని అంటున్నారు. రానున్న రోజుల్లో పవన్ వారాహీ యాత్రలో మరిన్ని మాటల తూటాలు పేల్చే చాన్స్ ఉంది. అపుడు కూడా ఆయన ఆవేశాన్ని ముందు పెట్టి పందెం కట్టడానికి వైసీపీ టీడీపీ రెడీగానే ఉంటాయని అనుకోవాలి. మరి పవన్ ఆవేశం ఎవరికి మేలు చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News