పిఠాపురం మరుగుతోంది... పవన్ ఇలాకాలో ఏమిటిది ?
ఎపుడైతే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీకి దిగారో అప్పటి నుంచి అది వీవీఐపీ నియోజకవర్గం అయిపోయింది.;

పిఠాపురం రాజకీయంగా ఎపుడూ హాట్ లైన్ లో లేదు. అక్కడ ఎమ్మెల్యే ఎవరు అన్నది వారికి తప్ప ఎవరికీ తెలిసేది కాదు. పిఠాపురం రాజకీయాలు కూడా లోకల్ గానే సాగిపోతూ వచ్చేవి. ఎపుడైతే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీకి దిగారో అప్పటి నుంచి అది వీవీఐపీ నియోజకవర్గం అయిపోయింది.
అక్కడ చీమ చిటుక్కుమన్నా కూడా హీటెక్కించే న్యూస్ గా మారుతోంది. ఇక పిఠాపురంలో జనసేన గెలిచింది. కానీ టీడీపీ కూడా బలంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడ స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నారు. నిజానికి ఒక నియోజకవర్గంలో వివాదాలు ఏమైనా రాజకీయంగా ఉంటే ప్రత్యర్ధి పార్టీల మధ్య ఉంటాయి.
కానీ పిఠాపురంలో మాత్రం సీన్ రివర్స్. అక్కడ మిత్రులుగా ఒకే కూటమిలో ఉన్న జనసేన టీడీపీల మధ్య రచ్చ రాజుకుంటోంది. అది కాస్తా కీలక నేతల నుంచి అగ్ర నేతల దాకా పాకుతోంది. దాంతో అక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా జనసేన టీడీపీ క్యాడర్ మధ్య ఆధిపత్య పోరుగా మారుతోంది.
లేటెస్ట్ గా చూసుకుంటే కనుక పిఠాపురం నియోజకవ వర్గంలోని గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో ఆర్ ఓ ప్లాంట్ ప్రారంభోత్సవం లో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడ ఆర్ ఓ ప్లాంట్ ను ప్రారంభించేందుకు వెళ్లిన పిఠాపురం ఇంచార్జ్ ను మర్రెడ్డి శ్రీనివాస్ పై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొంత సేపు రచ్చ సాగింది.
ఆర్వో ప్లాంట్ ప్రారంభానికి టీడీపీ నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న ఎసీఎస్ ఎన్ వర్మను ఎందుకు పిలవలేదు అంటూ టిడిపి కార్యకర్తలు ప్రశ్నించడంతో గొడవ స్టార్ట్ అయింది. అయితే పిఠాపురంలో ఉన్న రాజకీయ వాతావరణం వల్ల జనసేన టీడీపీ నేతలు విడివిడిగానే అన్నీ చేసుకుంటున్నారు. ఇక వర్మ అయితే కార్యకర్తే అధినేత అంటూ జనంలోకి వెళ్తున్నారు.
ఆయన తనదైన శైలిలో జనాలను కలసి హామీలు ఇస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వారికి భరోసా ఇస్తున్నారు ఇలా ఎవరికి వారివిగా రాజకీయాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇపుడు ఏ చిన్న కార్యక్రమం అయినా రెండు పార్టీల మధ్య అది ఘర్షణ గా మారుతోంది.
నిజం చెప్పాలంటే పై స్థాయిలో కూటమి పెద్దల మధ్య ఉన్న సామరస్యం గ్రౌండ్ లెవెల్ లో లేదు. దానికి తోడు అన్నట్లుగా ఆధిపత్య పోరు కూడా సాగుతోంది. దీనికి చెక్ పెట్టకపోతే మాత్రం ఏపీలో రాజకీయంగా పిఠాపురమే ముందు వరసలో ఉంటుందని అంటున్నారు. అయితే జనసేన టీడీపీ నేతల మధ్య దిగువ స్థాయిలోనే వివాదాలు పెరిగిపోవడంతో సామరస్యం అన్నది అంత ఈజీగా కనిపించడం లేదు అని అంటున్నారు.