పీకే ప్లస్ పీకే : రాజకీయ బాహుబలి జగనేనా....!?

మీకు ఒక పీకే ఉంటే మాకు ఒక పీకే ఉన్నారు అని గతంలో వైసీపీ క్యాడర్ సరదాగా టీడీపీ మీద సెటైర్లు వేసేవారు.

Update: 2023-12-23 13:13 GMT

పీకే అంటే ప్రశాంత్ కిశోర్. మళ్లీ పీకే అంటే పవన్ కళ్యాణ్. ఈ పీకే స్క్వేర్ ని టీడీపీ తమ శిబిరంలోకి తెచ్చుకుంటోంది. 2019 ఎన్నికల్లో ఒక పీకే టీడీపీకి దూరంగా ఉండి ఒంటరిగా పోటీ చేశారు. ఆయనే పవన్ కళ్యాణ్. మరో పీకే వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా మారి టీడీపీ పునాదులను కదిల్చేశారు.

అయితే గతం అలా ఉంటే ఫ్యూచర్ చూస్తే వెరీ ఇంటరెస్టింగ్. ఎవరూ ఊహించి ఉండరేమో. పీకే ప్లస్ పీకే ఇలా టీడీపీ క్యాంప్ లో కనిపిస్తారు అని. మీకు ఒక పీకే ఉంటే మాకు ఒక పీకే ఉన్నారు అని గతంలో వైసీపీ క్యాడర్ సరదాగా టీడీపీ మీద సెటైర్లు వేసేవారు. అయితే ఇపుడు ఇద్దరు పీకేలూ టీడీపీతోనే ఉండబోతున్నారు అన్నది కన్ ఫర్మ్ అవుతోంది.

ఇలా పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కిశోర్ చంద్రబాబుకు కుడి ఎడమలుగా నిలబడితే ఈ ఇద్దరినీ పెట్టుకుని ఏపీలో జరిగే రాజకీయ కురుక్షేత్రంలో చంద్రబాబు జగన్ ని ఎదుర్కోవాలని చూస్తున్నారు. ఈ పీకేలలో పవన్ గ్లామర్. ప్రశాంత్ కిశోర్ గ్రామర్. ఎన్నికల్లో విజయానికి రెండూ అవసరమే. గ్లామర్ కి జనాలు వస్తారు. అవి ఓట్లుగా మారాలంటే గ్రామర్ అంటే వ్యూహాలు కచ్చితంగా ఉండాలి.

చంద్రబాబుకు వ్యూహాలు లేవు అని కాదు, అయితే ఆయన ఎర్లీ సెవెంటీస్ నాటి పాలిటిక్స్ ఎక్కువగా చేస్తారు అని విమర్శలు ఉన్నాయి. ఈ తరానికి ఈనాటి స్మార్ట్ వరల్డ్ కి సోషల్ మీడియా శకానికి తగినట్లుగా వ్యూహాలు చేయాలీ అంటే పీకే లాంటి వారి అవసరం ఎంతైనా ఉంది. అందుకే 2019 ఎన్నికల్లో ఓటమి చెందాక చంద్రబాబు పీకే టీం నుంచి రాబిన్ శర్మను తెచ్చారు.

ఇపుడు ఏకంగా గురువు ప్రశాంత్ కిశోర్ నే తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ పొలిటికల్ గా అంత బలవంతుడా అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది. జగన్ ఓటు బ్యాంక్ ఎంత అన్నది కూడ ఎవరి ఊహలకూ అందకుండా ఉంది అని అంటున్నారు. వై నాట్ 175 అన్న వైసీపీ స్లోగన్ ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తోంది అని అంటున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ ఒక్కోటీ పేర్చుకుంటూ తమ బలాన్ని అమాంతం పెంచుకుటోంది. పవన్ కళ్యాణ్ ని అలా పొత్తు పేరుతో జత చేర్చుకుంది. ఇపుడు పీకే వంటి నంబర్ వన్ వ్యూహకర్తను దగ్గరకు తీస్తోంది. అయితే మోడీ లేకపోతే ఇండియా కూటమి అంటూ జాతీయ రాజకీయ కూటమితోనూ కలసి సాగేందుకు సైతం టీడీపీ చూస్తోంది.

ఇల ఒక వైపు పొత్తులు మరో వైపు ఎత్తులు ఇంకో వైపు నేషనల్ పార్టీస్ అండతో టీడీపీ వైసీపీ మీద జగన్ మీద యుద్ధానికి సిద్ధం అంటోంది. దీంతో వైసీపీ నేతలు మా జగన్ రాజకీయ బాహుబలి. అందుకే ఎంతో మందిని టీడీపీ సాయం తెచ్చుకుంటోంది అని అంటున్నారు. సోలోగా ఫైట్ చేస్తూ జగన్ ముందుకు పోతున్నారు. జగన్ కి ఏ వ్యూహాలూ లేవు, ఆయనకూ ఎలాంటి పొత్తులు అంతకంటే లేవు. ఆయనకు జనంతోనే పొత్తు, జనమే ఆయన అసలైన వ్యూహం అని అంటున్నారు.

ఈ రాజకీయ యుద్ధం మాత్రం గతం ఎన్నడూ చూడనిది. ఇక రాజకీయాల్లో ఏ చిన్న అవకాశాన్ని ఎవరూ వదులుకోరు. అలా టీడీపీ జాగ్రత్త పడుతోంది అని ఆ పార్టీ వారు అంటున్నారు. మరి టీడీపీ వచ్చే ఎన్నికల విషయంలో ఇంతలా సకల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తాను బలంగా ఉన్నానని చెబుతోందా లేక జగన్ బలంగా ఉన్నారని ఎక్స్ పోజ్ చేస్తోందా అన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. చూడాలి మరి

Tags:    

Similar News