బీఆర్ ఎస్‌లో పొలిటిక‌ల్ భ‌గ‌భ‌గ‌లు.. పార్టీ నుంచి జంపింగులు!

కోడాడ‌లో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, బీఆర్ఎస్ మాజీ ఇంచార్జ్ శశిధర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావులు పార్టీ మారేందుకు రెడీ అయ్యారు.

Update: 2023-10-17 11:30 GMT

తెలంగాణ అధికార పార్టీకి కీల‌క ఎన్నిక‌ల ముందు భారీ షాకులు త‌గులుతున్నాయ‌ని అంటున్నారు పొలిటిక‌ల్ ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌ని పార్టీ గ‌ట్టిగా నిర్ణ‌యించుకుని గెలుపు గుర్రాల‌కే టికెట్లు ప్ర‌క‌టించినట్టు సీఎం కేసీఆర్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. టికెట్లు రాని వారు.. బాధ ప‌డొద్ద‌ని.. పార్టీని అధికారంలోకి తీసుకువ‌స్తే.. ప‌ద‌వులు.. పీఠాలు వేరేవి కూడా వ‌స్తాయ‌ని అనున‌యించారు. కానీ.. నాయ‌కులు మాత్రం కేసీఆర్ మాట‌ను ల‌క్ష్య పెట్టిన‌ట్టు క‌నిపించ‌డం లేదు.

తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి జంపింగులు పెరిగాయి. పలు నియోజకవర్గాల్లో అస‌మ్మ‌తి భగ్గుమంది. దీంతో కీల‌క నాయ‌కులు పార్టీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో వారికి కాంగ్రెస్ ఆహ్వాన ప‌త్రిక‌లు పంపి.. రెడ్ కార్పెట్ ప‌రుస్తామ‌ని స్వాగ‌తిస్తోంది. కోడాడ‌లో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, బీఆర్ఎస్ మాజీ ఇంచార్జ్ శశిధర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావులు పార్టీ మారేందుకు రెడీ అయ్యారు.

ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం మధ్యాహ్నం కోదాడలో మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్‌రెడ్డితో వీరు భేటీ కానున్నట్టు తెలిసింది. మ‌రోవైపు కీల‌క నియోజ‌క‌వ‌ర్గం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అస‌మ్మ‌తి భగ్గుమంది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నట్టు గుర్రంపోడ్ జెడ్పిటీసీ గాలి రవి కుమార్ స‌హా 10 మంది సర్పంచ్ లు, 12మంది మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు. ఎమ్మెల్యే భర‌త్ ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు చెప్పారు.

అదేవిధంగా నల్గొండ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ ప‌రిస్థితి ఇబ్బందిగా మారింది. త‌మ‌కు ఎలాంటి గౌర‌వం లేకుండా పోయింద‌ని ఆరోపిస్తూ.. మున్సిపల్ వైస్ చైర్మన్ సహా ఐదుగురు అధికార బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీ వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. వీరంతా ఎంపీ కోమటిరెడ్డికి టచ్ లోకి వెళ్లినట్టు తెలిసింది.

ఇదిలావుంటే, బోధ్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. రేవంత్ రెడ్డి నివాసానికి బోధ్ ఎమ్మెల్యే బాపురావు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాపురావును బీఆర్ఎస్ అధిష్టానం పక్కనబెట్టేసి ఆ స్థానాన్ని అనిల్ జాదవ్‌కి కేటాయించింది. దీంతో ఆయన కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతున్నారు. మ‌రి దీనిపై కేసీఆర్ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారో చూడాలి.

Tags:    

Similar News