ఉండేది ఓ చోట.. పోటీ మరో చోట
తమ నియోజకవర్గం రిజర్వుడు సీటు కావడం, ఇప్పటికే అక్కడ తమ పార్టీకే చెందిన మరో నాయకుడు బలంగా ఉండటం, ఇతర నియోజకవర్గాల్లో పార్టీకి మెరుగైన పరిస్థితులు ఉండటం తదితర కారణాలున్నాయి.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు శాయాశక్తులా కష్టపడుతున్నారు. ఇప్పటికే టికెట్లు దక్కిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక టికెట్లు కచ్చితంగా వస్తాయనే ఆశతో ఉన్న లీడర్లు కూడా సమరానికి సై అంటున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో కొంతమంది లీడర్లు ఉన్న చోటును వదిలేసి మరో చోటు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. అందుకు చాలా కారణాలున్నాయనే చెప్పాలి. తమ నియోజకవర్గం రిజర్వుడు సీటు కావడం, ఇప్పటికే అక్కడ తమ పార్టీకే చెందిన మరో నాయకుడు బలంగా ఉండటం, ఇతర నియోజకవర్గాల్లో పార్టీకి మెరుగైన పరిస్థితులు ఉండటం తదితర కారణాలున్నాయి.
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ సారి గజ్వేల్ లోనూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ కేసీఆర్ కు చెక్ పెట్టాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గానికి చెందిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బరిలో దిగుతున్నారు. ఇక్కడ 2014 ఎన్నికల్లో కోనేరు కోనప్ప బీఎస్పీ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో బీఎస్పీకి సానుకూల ఫలితం వచ్చే అవకాశం ఉందని ప్రవీణ్ కుమార్ ఇక్కడికి వచ్చారు. తాజాగా కాంగ్రెస్ లో చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల టికెట్ కోరుతున్నారు. గతంలో గెలిచిన నర్సంపేట నుంచి మాధవరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో ప్రకాశ్ రెడ్డి మకాం మారుస్తున్నారు.
అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన జడ్పీ ఛైర్ పర్సన్ సరిత గద్వాల టికెట్ దక్కించుకున్నారు. ఆమె సొంత నియోజకవర్గం అలంపూర్ రిజర్వుడు స్థానం కావడమే అందుకు కారణం. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్.. నిజామాబాద్ అర్బన్ టికెట్ పై ఆశతో ఉన్నారు. బాల్కొండ నుంచి సునీల్ కుమార్ కు టికెట్ రావడంతో అనిల్ మారాల్సి వచ్చింది. సత్తుపల్లి రిజర్వుడు స్థానం కావడంతో పొంగులేటి పాలేరు నుంచి సై అంటున్నారు. తుమ్మల ఖమ్మానికి వెళ్లాల్సి వచ్చిందనే చెప్పాలి. తుంగతుర్తికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి 2009 నుంచి హుజూర్ నగర్లోనే మకాం వేశారు. నిజామాబాద్ నేత మధుయాష్కీ ఎల్బీ నగర్ టికెట్ ఆశిస్తున్నారు. ఇలా వివిధ పార్టీల్లోని నాయకులు తమ సొంత నియోజకవర్గాలను వదిలి ఇతర చోట్ల నుంచి పోటీకి దిగుతున్నారు.