నామినేషన్లకు భారీగా జనాలు వస్తే గెలిచినట్లేనా ?

కాదేదీ రాజకీయాలకు అతీతం అన్నట్లుగా ప్రస్తుతం సాగుతోంది. పైగా మైండ్ గేమ్ పాలిటిక్స్ నే ప్రస్తుతం అంతా చేస్తున్నారు

Update: 2024-04-24 16:31 GMT

కాదేదీ రాజకీయాలకు అతీతం అన్నట్లుగా ప్రస్తుతం సాగుతోంది. పైగా మైండ్ గేమ్ పాలిటిక్స్ నే ప్రస్తుతం అంతా చేస్తున్నారు. అవతల వ్యక్తికి మాటలు రాకుండా చమటలు పట్టించడం ద్వారా ఓటమి భయం కలిగించడం తద్వారా డీ మోరలైజ్ చేస్తూ కాగల కార్యాన్ని నెరవేర్చుకోవడం.

అదే విధంగా తమకే ఎంత మద్దతు ఉందో అని జనాలకు చెబుతూ తామే గెలుపు గుర్రాలు అని భ్రమలు కలిగించడమే ఇందులో మరో రహస్యం. అందుకే జనాలు భారీ ఎత్తున వచ్చినా ఇపుడు ఎవరూ దానిని కొలమానంగా చూడడం లేదు.

అయినా సరే జనాల మద్దతు ఎపుడూ రాజకీయంగా అగ్ర తాంబూలాన్ని ఇచ్చే వ్యూహంగానే ఉంది. ఏపీలో ప్రస్తుతం నామినేషన్ల పర్వం సాగుతోంది. దాంతో ప్రచారం ఒక ఎత్తు అయితే అభ్యర్ధులు నామినేషన్ల రోజున చేసే హడావుడి అంతకు పదింతలు ఉంటోంది.

ఏపీలో ఈ ట్రెండ్ గత మూడు నాలుగు ఎన్నికల నుంచి మొదలైంది. భారీగా జనాలను తీసుకుని రావడం అపుడే గెలిచేసినట్లుగా విజయోత్సవ ర్యాలీలుగా వాటిని మార్చుకుంటూ పోతున్నారు. నిజానికి ఎన్నికల నిబంధనలు ర్యాలీలను పెద్దగా అనుమతించవు. అదే విధంగా ఎన్నికల ఖర్చులు అసలు ఈ పోకడలకు వీలు కల్పించవు. కానీ తూతూ మంత్రంగా లెక్కలు చెబుతూ తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్నారు.

వారూ వీరూ కాదు అన్ని పార్టీలదీ ఒక్కటే దారి. ఇదిలా ఉంటే నామినేషన్లకు వచ్చే జనాలకు కూడా అన్నీ సమకూర్చాలి. వాహనాల నుంచి వారికి పెట్టే భోజనాలు మందూ తో పాటు మనీ ఇవన్నీ ఇవ్వాలి. లేకపోతే వారు గంటల తరబడి జై కొడుతూ ఎందుకు ఎండలలో వెంట వస్తారు.

పైగా ఆ వచ్చిన వారు ఎక్కడి ఓటర్లో ఎవరికీ తెలియదు. వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అనుచరులూ కావచ్చు. అభిమానులూ కావచ్చు. నా నామినేషన్ కి ఇంత జనం వచ్చారు అని చెప్పుకుంటే అసలైన ఎన్నికల గండం గట్టెక్కి సినట్లా అంటే కాదు అనే చెప్పాలి.

నిజానికి ప్రచారం అంతా ఒక ఎత్తు అయితే పోలింగ్ రోజు ఎలక్షనీరింగ్ ఒక ఎత్తు. ఆ రోజున పోల్ మేనేజ్మెంట్ ఎవరు బాగా చేసుకుంటే వారికే విజయం దక్కుతుంది. ఎన్ని మాటలు అన్నా ఎన్ని చెప్పుకున్నా ఎన్ని భారీ ప్రకటనలు చేసినా ఈవీఎం లో ఓటు వేయించుకున్న వారే బహు మొనగాడు. వారినే విజయం వరిస్తుంది.

ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. 2004 ఎన్నికల వేళ రాజమండ్రి లోక్ సభ ఎన్నికలకు ఒక ప్రధాన పార్టీ అభ్యర్ధి ఆర్భాటంగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి ఎవరూ అని అంతా చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేయడానికి వచ్చిన ఆయన ఎవరో కూడా పెద్దగా జర్నలిస్టులకే తెలియదు. ఆయనే ఉండవల్లి అరుణ్ కుమార్. ఒక చిన్న స్కూటర్ అది కూడా ఫ్రెండ్ తొక్కుతూంటే వెనకాల ఎక్కి వచ్చిన ఉండవల్లి చడీ చప్పుడూ లేకుండా నామినేషన్ వేసి వెళ్ళిపోయారు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే అక్కడ మంచి మెజారిటీతో ఆయనే గెలిచారు.

అంటే నామినేషన్లకు జనాలు హంగామా హడావుడీ అక్కడ జనాలను చూసి మురిసిపోతే దెబ్బ పడుతుంది అని చెప్పడానికే ఇదంతా వాపుని చూసి బలం అనుకుని పోతే చివరికి సైలెంట్ గా స్కెచ్ గీసిన వారే సక్సెస్ కొట్టేస్తారు. అయినా ఇపుడు జనాలకు కూడా ఈ మైండ్ గేములూ జనాల తరలింపులూ అన్నీ అర్ధం అయ్యాక ఈ హడావుడిని ఎంత తగ్గిస్తే అంత మంచిదేమో.

Tags:    

Similar News