అహం బ్రహ్మాస్మి...రాజకీయం హతోస్మి !
అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మ అని చెప్పుకోవడం. అహంతో ఇహం మరచిపోవడం.
అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మ అని చెప్పుకోవడం. అహంతో ఇహం మరచిపోవడం. సర్వం సహా తానే అనుకోవడం. అహంకారం అలంకారంగా మార్చుకోవడం. సాధారణంగా అహం ఎవరికి ఉండదు, ఎవరి స్థాయిని బట్టి అందరికీ ఉంటుంది. దానికే అందంగా ఇంగ్లీష్ లో ఇగో అని పేరు పెట్టుకున్నా అచ్చ తెలుగులో అహం అనుకున్నా తేడా ఏమీ లేదు.
అహం వల్ల ఒరిగిందేమిటి అంటే లాభాలు కంటే నష్టాలు ఎక్కువే అని అంటారు. రాజకీయాల్లో అహం పనికి వస్తుందా అంటే దానికి జవాబు అందరికీ తెలిసిందే. లేదు అనే చెబుతారు. నిజానికి ఏ రంగంలో అయినా అహం పనికి రాదు ఆ మాటకు వస్తే దైనందిన జీవితంలో ఎవరికి అయినా అహం అన్నది వారి అభివృద్ధికి అడ్డుకట్టగానే ఉంటుంది.
అహం చూపిస్తే చాలానే కోల్పోవాల్సి ఉంటుంది. అయితే తాను స్వయంగా కోల్పోవడం వేరు. బాధ్యత పెంచుకుని పెద్ద హోదాలలో ఉన్నపుడు అహాన్ని చంపుకోకుండా ఉంటే తనతో పాటు నమ్ముకున్న వారు కూడా మొత్తానికి మొత్తం చెడిపోతారు.
అందుకే అహం పనికిరాదు అనే అంటారు. కానీ రాజకీయాల్లో ఉన్న వారు అహాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం ప్రజల కోణంలో పనిచేయాల్సి ఉంటుంది. కానీ చూడబోతే రాజకీయాల్లో అహాలు భేషజాలు కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. అహంతోనే అన్నీ అనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.
రాజకీయాల్లో అహంకారం ఉంటే నమ్ముకున్న వారికి కూడా తీరని అపకారం జరుగుతుంది. ఒక నాయకుడు తీసుకునే నిర్ణయం మూలంగా మొత్తం దెబ్బ తినిపోతారు. రాజకీయాల్లో వ్యూహాలు ఉండాలి. అంతే తప్ప ఎదుటి వారిని ప్రత్యర్థులుగా చూడకుండా శత్రువులుగా భావించడం వల్ల అది ఎక్కడికో పోతుంది అని అంటున్నారు.
ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం కలసి పనిచేయాలి. అలా చేస్తెనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యపడుతుంది. ఏపీకి ప్రత్యేక హొదా ఈ రోజుకీ రాకపోవడానికి రాజకీయ పార్టీల మధ్య ఇగోలే కారణం అంటే నమ్మే వారు అధికంగానే ఉంటారని అంటున్నారు. ఏ ఒక్క విషయం మీద కూడా అధికార విపక్షాలు కలసి ఢిల్లీలో కేంద్రం మీద ఒత్తిడి పెట్టిన సందర్భాలు గత పదేళ్లలో లేవనే అంటారు
మరో వైపు చూస్తే తమిళనాడులో పాలిటిక్స్ ఇలాగే ఉప్పు నిప్పుగా ఉండేది. కానీ చివరికి చూస్తే వారు ఇపుడు బాగానే ఉన్నారు. ఏపీలో మాత్రం రాజకీయం చాలా గట్టిగా సాగుతోంది. ఆఖరుకు ఒకరు అధికారంలో ఉంటే రెండవ వారు సభకు కూడా వెళ్ళలేని పరిస్థితి గా మారుతోంది.
ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ అసెంబ్లీని బహిష్కరించారు. జగన్ సీఎం గా ఉంటే చంద్రబాబు బహిష్కరించారు. అయితే ఈ ఇద్దరూ తొలి మూడేళ్ళూ సభకు వచ్చారు. ఇపుడు చూస్తే మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యారు కానీ జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదు. దానికి కారణం సభలో విపక్షాన్ని టార్గెట్ చేస్తారు అన్నది అని అంటున్నారు. మరి దానిని ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు కొనసాగించారు అన్నది చర్చలకు పోనవసరం లేదు. కానీ ఈ తరహా సంప్రదాయం మంచిది కాదు అనే అంటున్నారు.
జగన్ సీఎం గా ఉండగా చంద్రబాబు మీద కేసులు పడ్డాయి. ఆయనను ఏకంగా జైలులో పెట్టారు. యాభై రెండు రోజుల పాటు చంద్రబాబు జైలులో ఉన్నారు. ఇక జగన్ ఇపుడు విపక్షంలో ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేస్తోంది అని ఫ్యాన్ పార్టీ నేతలు అంటున్నారు. ఇంతకు ఇంత మేము వస్తే చెల్లిస్తామని అంటున్నారు.
రెడ్ బుక్ అంటూ టీడీపీ అంటే గుడ్ బుక్ అని వైసీపీ అంటోంది. ఇలా రాజకీయ ప్రత్యర్ధులు అన్నది మరచి అధికారంలోకి వస్తే ఎదుటి పార్టీల నేతలను టార్గెట్ చేస్తామని అనుకునే సీన్ దాకా వచ్చేసింది. ఎక్కడా హుందా రాజకీయం కనిపించడం లేదు. ఆఖరుకు ఎట్ హోం పేరుతో రాజ్ భవన్ లో గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు సైతం అధికార విపక్షాలు ముఖాలు చూసుకునేందుకు రావడం లేదు అని అంటున్నారు.
తెలంగాణాలో చూస్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు నాడు రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టారు ఆయన జైలుకు వెళ్ళి వచ్చారు. ఆఖరుకు అనుమతి తీసుకుని కుమార్తె పెళ్ళికి హాజరు అయ్యారు అంటే కక్ష పూరిత రాజకీయాలు అని నాడు అన్నారు.
ఇపుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు. అరెస్ట్ చేసుకోనీయండని గులాబీ పార్టీ కూడా సవాల్ చేస్తోంది. తెలంగాణా అసెంబ్లీకి కేసీఆర్ రావడం లేదు. రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారని ఆయన రావడం లేదని కాంగ్రెస్ అంటోంది.
ఈ విధంగా చూస్తూంటే రాజకీయాల్లో పరస్పరం గౌరవించుకోవడం ప్రజా కోణంలో కలసి పనిచేయడం అన్నది మరచిపోతున్నారా అన్న చర్చ వస్తోంది. ఎవరైనా ప్రజా సేవకులే. ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి వచ్చిన వారు ఆ ప్రజల కోసం ఆలోచించకుండా అహం బ్రహ్మాస్మి అనుకోవడమేంటి అన్న చర్చ వస్తోంది. అహంకారం తో చేసేది ఏది అయినా పనికి రాదు అన్నది చరిత్ర చెబుతోంది. మరి ఆ సత్యాన్ని ఒంటబట్టించుకుంటారా లేక ఇలాగే ముందుకు సాగుతారా అన్నది చూడాల్సి ఉంది.