బీఆర్ఎస్ తో బంతాట ....కేసీఆర్ గవర్నర్ అంట !

ఈ ఏడాదిలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటుని కూడా గెలుచుకోలేక చతికిలపడింది

Update: 2024-08-16 16:31 GMT

బీఆర్ఎస్ గత ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు అయింది. ఈ ఏడాదిలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటుని కూడా గెలుచుకోలేక చతికిలపడింది. మరో నాలుగున్నరేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాలి. గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంది. అలాంటి బీఆర్ఎస్ కి పదవులు ఎలా వస్తాయి అంటే నోట్లో బూరెలు వండితే ఎందుకు రావు అని సెటైర్లు పడుతున్నాయి.

తెలంగాణాను తెచ్చామని తెలంగాణా రాజకీయాలను శాసించామని గట్టిగా ఒకనాడు చెప్పుకున్న బీఆర్ఎస్ కి ఇపుడు ఎంతటి దైన్యం ప్రాప్తించింది అంటే రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ ని బంతాట ఆడుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ. పాతికేళ్ళుగా కొనసాగుతున్న పార్టీ.

అలాంటి పార్టీ శీలాన్ని శంకిస్తూ కాంగ్రెస్ లో విలీనం అవుతోంది త్వరలో అని బీజేపీ నేతలు ప్రచారం చేస్తూంటే లేదు బీజేపీతో విలీనం అంటూ కాంగ్రెస్ నేతలు గట్టిగా సౌండ్ చేస్తున్నారు. విలీనం ఏంటి మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం ఏకంగా యాభై ఏళ్ల పా దాటి బీఆర్ఎస్ తెలంగాణలో రాజకీయంగా తన ఉనికిని బలంగా చాటుకుంటుందని కేటీయార్ ఒక పక్కన ఢంకా భజాయిస్తున్నారు. అయినా సరే ఈ విలీనం ప్రచారం ఆగడం లేదు.

అది ఇపుడు ఎంతదాకా వెళ్ళింది అంటే బీఆర్ఎస్ విలీనం అయితే ఏ పదవులు ఆ పార్టీ నేతలకు దక్కుతాయో లిస్ట్ చదివి మరీ వినిపిస్తున్నారు. రెండు జాతీయ పార్టీల నేతలు. ఢిల్లీ టూర్ లో ఉన్న తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజెపీతో విలీనం ఖాయమని ఒక బాంబు లాంటి వార్తనే పేల్చారు.

అంతే కాదు ఈ విలీనం తరువాత కేసీఅర్ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతారని కేటీఆర్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, తెలంగాణా అసెంబ్లీలో విపక్ష నేతగా హరీష్ రావుని నియమిస్తారని కవితలు నలుగు రాజ్యసభ ఎంపీలతో సమానంగా బెయిల్ ఇచ్చి బిగ్ రిలీఫ్ అందిస్తారరని తన మాటలను బీఆర్ఎస్ నేతలు ఖండించినా ఇదే నిజం అని గట్టిగా చెప్పారు.

దానికి బీజేపీ నుంచి కూడా గట్టి కౌంటర్ పడింది. కంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ని ఖండిస్తూ బీజేపీతో కానే కాదు కాంగ్రెస్ తోనే బీఆర్ఎస్ విలీనం అవుతుందని తన జోస్యం వినిపించారు. అలా విలీనం అయితే కేసీఅర్ కి కాంగ్రెస్ లో ఏఐసీసీ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని, అలాగే కేటీఆర్ కి పీసీసీ చీఫ్ పదవి ఇస్తారని హరీష్ రావుకు రాష్ట్ర మంత్రి పదవి ఇస్తారని, కవితకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని బండి సంజయ్ అంటున్నారు.

కాంగ్రెస్ బీఆర్ఎస్ గతంలో పొత్తులు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఉందని అందుకే ఆ పార్టీల మధ్యనే విలీనం ఉంటుంది తప్ప తమకు ఏమిటి సంబంధమని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరో వైపు చూస్తే బీఆర్ఎస్ కి విలీనం తప్ప మరో దారి లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకు బీఆర్ఎస్ ని ముందు పెట్టి రెండు జాతీయ పార్టీలు రాజకీయ చెడుగుడు ఆడుతున్నారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

బీఆర్ఎస్ కి భవిష్యత్తు లేదని ఇతర పార్టీలు తేల్చడం ఎంతవరకూ సబబో అర్ధం కావడంలేదు అని అంటున్నారు. అయితే తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు ఉండాలని మధ్యలో బీఆర్ఎస్ ని లేకుండా చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఇలా ప్రచారం చేస్తున్నారు అని గులాబీ పార్టీ నేతలు మండిపడుతున్నారు. మరి ఇంతకీ బీఆర్ఎస్ విషయంలో విలీనం అని పదే పదే చెబుతున్న మాటలే నిజం అవుతాయా లేక 2028 లో ఆ పార్టీ జూలు విదిలిస్తుందా అంటే వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News