భారత్ లో పేదలు 3.4 కోట్లే..
మొత్తంమీద ఐక్యరాజ్య సమితి లెక్కలను కోట్లలో చూస్తే.. 15 ఏళ్లలో 41.50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి గట్టెక్కారు.
దాదాపు 40 ఏళ్లుగా చెబుతున్నది ఒకటే మాట.. "భారత్ డెవలపింగ్ కంట్రీ". ఈ వ్యవధిలోనే ఎన్నో జరిగాయి.. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు వెల్లువెత్తాయి.. సాఫ్ట్ వేర్ బూమ్ చుట్టేసింది.. ఫార్మా రంగం పెరిగిపోయింది.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెరుగుపడింది.. కానీ, ఇప్పటికీ భారత్ 'డెవలపింగ్ కంట్రీనే'. చాలామంది ఆర్థిక నిపుణుల అభిప్రాయం మాత్రం దేశంలో పేదరికం పోలేదని.. దానిని విమర్శగానే స్వీకరించినా, ఆత్మ పరిశీలన చేసుకుంటే మాత్రం కొన్నేళ్లలో పేదరికంలో మార్పు వచ్చింది. అదెలాగంటే..?
మారిన ప్రమాణాలు..
ధరల పెరుగుదుల, జీవన వ్యయంలో మార్పులు.. తదితర అంశాలను బేరీజు వేసుకుంటే దేశంలో ఒకనాడు మధ్య తరగతి నేడు పేదలుగా మిగిలిపోయారు అనే వాదన ఉంది. ఇదే సమయంలో ధనిక వర్గాలు మరింత డబ్బు సంపాదించాయని.. సంపన్నులు మరింత సంపన్నులు అయ్యారనే విమర్శలున్నాయి. కాగా, 15 ఏళ్లలో భారత్ లో 415 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఇది విశేషమైన పురోగతి అని ఐక్యరాజ్య సమితి ఆరు నెలల కిందట ప్రకటించింది. 2005-06 నుంచి 2019-21 వరకు ఈ లెక్కలను తీసింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం సాధించిన "అద్భుత విజయం"గా దీన్ని అభివర్ణించింది. భారత్ సహా 25 దేశాలు ఇలాంటి ప్రగతిని సాధించాయని పేర్కొంది. 2005-06లో భారతదేశంలో దాదాపు 645 మిలియన్ల మంది బహుమితీయ పేదరికంలో ఉన్నారు. వీరి సంఖ్య 2015-16లో దాదాపు 370 మిలియన్లకు తగ్గింది. 2019-21 నాటికి 230 మిలియన్లకు పడిపోయింది.
41.50 కోట్ల మంది..
మొత్తంమీద ఐక్యరాజ్య సమితి లెక్కలను కోట్లలో చూస్తే.. 15 ఏళ్లలో 41.50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి గట్టెక్కారు. భారత దేశ జనాభా ప్రస్తుతం 140 కోట్లకు పైనే అనుకుందాం. వాస్తవానికి 150 కోట్ల వరకు చేరి ఉంటుందనేది అంచనా. అధికారిక లెక్కలు లేవు కాబట్టి 140 కోట్లుగా సరిపెట్టుకుంటే.. దేశంలో పేదరికం ప్రస్తుతం 3 శాతంలోపే అంటోంది వరల్డ్ పావర్టీ క్లాక్. ఈ లెక్కన భారత్ లో పేదరికం దాదాపు పోయినట్లేనని చెబుతోంది. కొనుగోలు శక్తిని దీనికి ప్రామాణికంగా తీసుకుంది. కొనుగోలు శక్తి రోజుకు 1.9 అమెరికన్ డాలర్ (రూ.158) కంటే తక్కువగా ఉన్నవారు భారత్ లో 3 శాతం మాత్రమే ఉన్నారని పేర్కొంది. "3.4 కోట్ల మంది తీవ్ర దారిద్ర్యంలో ఉన్నారు. అయితే, ఈ సంఖ్య కొన్నేళ్లుగా తగ్గుతోంది. 2023లో 4 కోట్లు, 2022లో 4.6 కోట్లు అయితే.. ఇప్పుడు 3.4 కోట్లు మాత్రమే. వీరిలో 94 శాతం గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నారు" అని పావర్టీ క్లాక్ వెల్లడించింది. దేశంలో పేదలు 5 శాతంలోపే అని ఇటీవల నీతీ ఆయోగ్ పేర్కొంది.