పవన్ ప్రేమిస్తూనే పశ్చిమ సీటు కోసం...!

పవన్ కళ్యాణ్ ని ప్రేమిస్తాం, అలాగే విజయవాడ పశ్చిమలో జనసేన జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ కీలక నేత పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2024-03-23 15:30 GMT

పవన్ కళ్యాణ్ ని ప్రేమిస్తాం, అలాగే విజయవాడ పశ్చిమలో జనసేన జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ కీలక నేత పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నుంచి తాను పోటీ చేసేందుకు నూరు శాతం అర్హుడిని అని చెప్పారు. తాను అయిదేళ్ళుగా పార్టీ కోసం ప్రజల కోసం పోరాడాను అని ఆయన చెప్పారు. మొత్తం 1650 రోజుల పాటు జనంలోనే తాను ఉన్నాను అని గుర్తు చేశారు.

విజయవాడ రాజధాని ప్రాంతం అని ఇక్కడ బలమైన వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఎవరూ ముందుకు రాకపోతే మొదట తానే వచ్చాను అన్నారు. అనేక సమస్యలు తీర్చామని చెప్పారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఏకంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టామని అన్నారు.

విజయవాడలో మూడేళ్ళ క్రితం కార్పోరేషన్ ఎన్నికలు వస్తే మొత్తం 11 డివిజన్లలో అతి తక్కువ తేడాతో జనసేన ఓడి వైసీపీకి ధీటైన పోటీ ఇచ్చిందని ఆయన చెప్పారు. ఇదంతా జనసేన గ్రౌండ్ లెవెల్ వరకూ చేసిన పోరాటాల వల్లనే సాధ్యపడింది అన్నారు.

విజయవాడ నగర అధ్యక్షుడిగా తాను పార్టీని వార్డు లెవెల్ దాకా కమిటీలు వేసి బలోపేతం చేశానని ఆయన అన్నారు. పార్టీ కోసం కష్టపడిన తాను ధర్మంగానే టికెట్ కోరుతున్నాను అని ఆయన చెప్పారు. ఇతర నాయకుల మాదిరిగా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన నేతను కాను అని అన్నారు.

తనకు సీటు ఇస్తారని ఈ రోజుకు నమ్మకం ఉందని అన్నారు. తమ నాయకుడిని తాను అడిగేది ఒక్కటే అని విజయవాడ పశ్చిమ సీటు ఇస్తే గెలిపించుకుని వస్తామని అన్నారు. తన పోరాట పటిమకు మంత్రిగా పనిచేసినవెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నుంచి వేరే చోటకు షిఫ్ట్ అయిపోయారు అని ఆయన చెప్పారు. ఓడిపోతామన్న భయంతోనే ఆయనను వైసీపీ మార్చిందని అన్నారు.

పొత్తులు త్యాగాలు గురించి తెలుసు అని అదే సమయంలో బలమైన సీట్లు వదులుకోలేమని ఆయన చెప్పేశారు. మొత్తానికి పవన్ ని కలసి తనకు సీటు ఇవ్వాలని పోతిన మహేష్ అడిగినట్లుగా ప్రచారం సాగింది. అయితే ఈ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి పోతోంది. దాంతో ఏమీ చేయలేమని పవన్ అన్నట్లుగా తెలుస్తోంది. అయినా సరే ఇక్కడ నుంచి పోటీ చేయడానికి పోతిన మహేష్ ఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు.

ఒకవేళ సీటు బీజేపీకి వెళ్ళినా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అని అంటున్నారు. పవన్ ని ప్రేమిస్తూనే తాము పశ్చిమలో నిలబడతామని చెప్పడం వెనక పవన్ జెండాతో జనసేన అజెండాతో పోతిన మహేష్ పోటీకి దిగుతున్నారు అని అంటున్నారు. మరి ఈ విషయంలో జనసేన అధినాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News