కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా ఎమ్మెల్యేకు వార్నింగ్!
దీని వెనుక బీఆర్ఎస్ అగ్రనేతల నుంచి వచ్చిన వార్నింగ్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఒక్క రోజులోనే మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరడం లేదంటూ యూటర్న్ తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఈ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే.. హస్తం గూటికి చేరడమే తరువాయి అనిపించింది. కానీ ఇప్పుడు ఆయన వెనకడుగు వేశారు. దీని వెనుక బీఆర్ఎస్ అగ్రనేతల నుంచి వచ్చిన వార్నింగ్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్న బీఆర్ఎస్‌కు.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ముందు పార్టీ జంపింగ్‌లు తలనొప్పిగా మారాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతున్నారు. దీంతో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందేమోనన్న పరిస్థితి కలుగుతోందని టాక్ ఉంది. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సాగుతోన్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ నుంచి చేరికలను జోరుగా ప్రోత్సహిస్తోంది.
ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన ప్రకాశ్‌గౌడ్ కూడా పార్టీ మారేలా కనిపించారు. సీఎం రేవంత్‌తో సమావేశం కూడా అయ్యారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడం లేదని ప్రకటించారు. పార్టీ కార్యకర్తలతో చర్చించిన తర్వాత బీఆర్ఎస్‌లోనే కొనసాగాలనే నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. కానీ ఈ నిర్ణయం వెనుక మరో కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశ్ పార్టీ మారనున్నారని తెలియగానే బీఆర్ఎస్ అగ్రనేతలు రంగంలోకి దిగారని సమాచారం. పార్టీ నుంచి వెళ్లొద్దని ఆయనకు చెప్పారని తెలిసింది. ఒకవేళ వెళ్తే మాత్రం ఎమ్మెల్యేగా అనర్హుడిగా వేటు పడేంత వరకూ వదలమని వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. అందుకే ఇప్పుడు ఒక్కడినే వెళ్లి చేరడం కంటే కూడా.. ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎవరైనా వచ్చినప్పుడు కాంగ్రెస్‌లో చేరదామని ప్రకాశ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలిసింది.