ప్రశాంతగా ఆర్ధిక నీతులు చెబుతున్న పీకే...!

ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఏపీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-10-30 15:00 GMT

నీతులు ఎందుకు అంటే వినే వారి కోసం అని వెనకటికి ఒక సామెత ఉంది. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా అవతారం ఎత్తిన ప్రశాంత్ కిశోర్ ఉరఫ్ పీకే వ్యూహాల నుంచి పొలిటికల్ అవతార్ గా మారిన నేపధ్యం లో నీతులు బాగానే చెబుతున్నారు అని సెటైర్లు పడుతున్నారు.

ఆయన బీహారీ బాబు. అక్కడ ఆయన జన సురాజ్ పాదయాత్రని చేపట్టి ఏడాది అయింది. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఏపీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక విలేకరి ఏపీలో సంక్షేమ పధకాల గురించి ప్రశ్నించినపుడు పీకే దానికి బదులిస్తూ చేసిన కామెంట్స్ ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ పీకే అన్నదేంటి అంటే సంక్షేమ పధకాలను అమలు చేయాలి. సమాజంలో అసమానతలను తొలగించడానికి అవి చాలా ముఖ్యం. అదే టైం లో సంపద సృష్టించాలి అని. సంపద సృష్టించే అవకాశాన్ని ప్రభుత్వాలు సమాజానికి ఇవ్వాలి. అలాంటి పరిస్థితులు వారు కల్పించాలి.

అలా సంపద సృష్టి జరిగితే వాటిని పేదలకు సంక్షేమ పధకాలనుగా ఇవ్వడంలో తప్పు లేదని అన్నారు. లేకపోతే అప్పులు చేసి ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఒక విధంగా ఇది వైసీపీ మీద యాంటీ కామెంట్ గా అంతా చూస్తున్నారు. అయితే ఏపీలో అప్పుల కుంపటిని పెట్టిన ఘనత పీకేకి భాగం లేదా అని అంటున్న వారూ ఉన్నారు.

వ్యూహకర్తకు ఆర్ధిక నీతులు నాడు ఎందుకు పట్టలేదని అడుగుతున్న వారూ ఉన్నారు. 2019 ఎన్నికల నాటికే ఏపీ దాదాపుగా మూడు లక్షల కోట్ల అప్పుతో ఉంది. అలాంటి స్టేట్ లో కొత్తగా ఉచిత పధకాలను పీకే తాను కన్సల్టెంట్ గా ఉన్న వైసీపీకి సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వైసీపీ ఆ పధకాలను అమలు చేస్తోంది.

అయితే గడచిన నాలుగేళ్ళలో అప్పులు కూడా పెరిగాయి. దాని మీద విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. సంపద సృష్తించి ఆ తరువాత వితరణ చేయాలని కూడా అంటున్నాయి. కానీ ఒకరికి దాహం వెస్తే అప్పో సొప్పో చేసి నీరు అందిసారు కానీ నుయ్యి వెంటనే తవ్వరు కదా అని అంటున్నారు. సంపద సృష్టి అన్నది దశాబ్దాల వ్యవహారం. సుదీర్ఘమైన ప్రణాళిక దానికి అవసరం. ఈ రోజున విత్తనాలు నాటితే అవి పెరిగి పెద్ద అయి ఫలితాలు వచ్చే నాటికి దశాబ్దాల కాలం అవుతుందని అంటున్నారు.

అంతవరకూ సంక్షేమం ఆపలేరు కదా అన్న వారూ ఉన్నారు. ఇలా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం అప్పటికే సస్టైన్ అవుతున్న స్టేట్స్ కే కష్టం అయినపుడు విభజన వల్ల పెద్ద ఎత్తున రెవిన్యూ లోటుతో ఉన్న ఏపీకి ఎలా సాధ్యం అన్నది చూడాలి. ఇక్కడే కేంద్ర సాయం కావాలి, రావాలి. అది జరగకపోవడం ఒక ఎత్తు అయితే నాయకులు పోటీ పడి ఇస్తున్న హామీలు మరో ఎత్తు.

ఇక వ్యూహకర్తలు సైతం జనాల మనసుని దోచుకోవడానికి బాధ్యత పక్కన పెట్టి ఉచిత హామీలను కనిపెట్టి మరీ పార్టీల మీదకు వదులుతున్నారు. దాంతోనే ఒక్క ఏపీ మాత్రమే కాదు దేశమంతా అదే రకంగా ఎన్నికల హామీలు పధకాల వితరణ ఉన్నాయి.

ఏది ఏమైనా వ్యూహకర్తగా ఉన్నపుడు భేష్ శభాష్ అంటూ ప్రోత్సహించే పీకే తాను సిఫార్సు చేసిన పధకాల విషయంలోనే ఇపుడు ఇంకోలా మాట్లాడుతున్నరని అంటున్నరు. వ్యూహకర్తలు ఆకాశం నుంచి దిగి రారు. వారు కూడా దేశ పౌరులే. తాము ఒక పార్టీ గెలుపు మార్గాలని అన్వేషించి వ్యూహాలను సూచిస్తున్నపుడు ఆ రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులను కూడా బేరీజు వేసుకుని సూచనలు చేస్తే బాగుంటుంది అన్నదే అందరి మాట. వృద్ధ నారీ పత్రివ్రత అన్నట్లుగా పీకే తాపీగా ఇపుడు చెబుతున్న ఆర్ధిక నీతులు ఏపీ నెత్తిన మండుతున్న అప్పుల కుంపటిని ఆర్పగలవా అన్న మేధావుల ప్రశ్నలకు బహుశా ఈ బీహారీ బాబు వద్ద జవాబు ఉండదేమో అంటున్నారు.

Tags:    

Similar News