బీహార్ లో పీకే పార్టీ...ఎవరికి ఎసరు పెట్టబోతోంది ?
మొత్తం మీద చూస్తే పీకే పార్టీ మీద చర్చ అయితే సాగుతోంది. బీహార్ లో రెండే పార్టీలు ఇద్దరు ముగ్గురు నాయకుల మధ్యనే తిరుగుతున్న రాజకీయాన్ని మారుస్తాను అని పీకే అంటున్నారు.
బీహార్ రాజకీయాలు ఎపుడూ చిత్రంగా ఉంటాయి. అవి కులాల చుట్టూ తిరుగుతాయి. దేశంలో వెనుకబడిన రాష్ట్రాలలో బీహార్ ఒకటిగా ఉంది. బీహార్ ను ఎంతోమంది రాజకీయ నేతలు పాలించినా కూడా అభివృద్ధి అయితే ఆశించిన స్థాయిలో లేదు. మరీ ముఖ్యంగా గత మూడున్నర దశాబ్దాలుగా చూస్తే బీహార్ లో అయితే లాలూ కుటుంబం లేకపోతే నితీష్ కుమార్ అన్నట్లుగానే పాలిటిక్స్ ఉంది. 1990 దశకం నుంచి 2005 దాకా లాలూ ఆయన సతీమణి రబ్రీదేవి బీహార్ ని సీఎంలుగా పాలిస్తే అక్కడ నుంచి నితీష్ కుమార్ అందుకున్నారు. ఆయన సుదీర్ఘ కాలం సీఎం గా ఉన్న ఘనతను సాధించారు.
ఇక లాలూ ప్రసాద్ నాయకత్వంలోని ఆర్జేడీ అలాగే నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూలు రెండూ బలంగా ఉంటే బీజేపీ జేడీయూతో పొత్తు పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి దాకానే వచ్చింది. బీహార్ సీఎం కల అన్నది ఆ పార్టీకి సాకారం కావడం లేదు. 2025 నవంబర్ లో బీహార్ లో శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ 13 నెలల ముందు కొత్త పార్టీ రాబోతోంది.
దానిని స్థాపిస్తున్న వారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఆయన జన్ సురాజ్ పేరిట ప్రారంభించిన సామాజిక సంస్థనే రాజకీయ పార్టీగా మార్పు చేస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ఆయన పార్టీ ప్రారంభం కాబొతోంది.
పీకే ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేశారు. దాంతో బీహార్ లో రాజకీయంగా చర్చ సాగుతోంది. పీకే పార్టీ వల్ల ఎవరికి ముప్పు వాటిల్లుతుందన్న చర్చ సాగుతోంది. ప్రశాంత్ కిశోర్ పార్టీ ప్రకటనతో ఆర్జేడీ విరుచుకుపడుతోంది. ఆయన అగ్ర వర్ణాలకు చెందిన వారు అని చెబుతోంది. ప్రశాంత్ కిశోర్ పాండే అని సంభోదిస్తూ ఆయన వల్ల బీసీలు వెనకబడిన వర్గాలకు ఏమి మేలు జరుగుతుందని ప్రశ్నిస్తోంది.
మరో వైపు కొన్నాళ్ళ పాటు నితీష్ కుమార్ తో జట్టు కట్టి జేడీయూ జాతీయ స్థాయి ఉపాధ్యక్ష పదవిని నిర్వహించిన నేపధ్యం ఉన్నందువల్ల ప్రశాంత్ కిశోర్ పార్టీ పెడితే తమకు దెబ్బ అవుతుందా అన్న చర్చలో అధికార జేడీయూ ఉంది. కొత్త పార్టీ వస్తే అధికార పార్టీకి కూడా ఇబ్బందిగా ఉంటుంది అని అంటారు.
అదే విధంగా అగ్ర వర్ణాల ఓట్లను బీహార్ లో ఇప్పటిదాకా పొందుతూ వస్తున్న బీజేపీ కూడా పీకే పార్టీని గమనిస్తోంది. ఆయన కూడా అగ్రవర్ణాలకు చెందిన వారు కావడంతో తమ ఓటు బ్యాంక్ కి గండి పడుతుందా అన్న చర్చలో ఉంది.
మొత్తం మీద చూస్తే పీకే పార్టీ మీద చర్చ అయితే సాగుతోంది. బీహార్ లో రెండే పార్టీలు ఇద్దరు ముగ్గురు నాయకుల మధ్యనే తిరుగుతున్న రాజకీయాన్ని మారుస్తాను అని పీకే అంటున్నారు. ఆయన రెండేళ్ళ పాటు పాదయాత్ర చేసి తనకంటూ ప్రతీ గ్రామంలో క్యాడర్ ని తయారు చేసుకున్నారు. బీహార్ లో రాజకీయ శూన్యత ఉందని నమ్ముతున్న పీకే తన రాజకీయ వ్యూహాలు తనను బీహార్ సీఎం గా చేస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.