ప్రశాంత్ కిశోర్ రాజకీయ పార్టీ రెడీ !
ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే రాజకీయ వ్యూహకర్త అవతార్ నుంచి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడి అవతారానికి సిద్ధమైపోయారు.
ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే రాజకీయ వ్యూహకర్త అవతార్ నుంచి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడి అవతారానికి సిద్ధమైపోయారు. ఆయన కొత్త పార్టీ స్థాపనకు రెడీ అయిపోయారు. మరో రెండు నెలలలో ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ స్థాపన జరగనుంది.
ఈ విషయాన్ని ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. తాను ప్రస్తుతం నడుపుతున్న జన్ సురాజ్ అనే సామాజిక సంస్థ పేరునే కొత్త పార్టీకి మారుస్తూ రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుడుతున్నట్లుగా వెల్లడించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు జన్ సురాజ్ ని రాజకీయ పార్టీగా మారుస్తూ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలిపారు. ఇదిలా ఉంటే రాజకీయ వ్యూహకర్తగా ఐ పాక్ వ్యవస్థాపకుడిగా ప్రశాంత్ కిశోర్ దేశంలో అందరికీ తెలిసిన వారుగా ఉన్నారు.
ఇక ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకుని రావడంలో తనదైన వ్యూహాలను అందించానని పీకే చెప్పుకుంటారు. అలా ఆయన ఏపీకి పరిచయం. ఇటీవల ఎన్నికల్లో పీకే టీడీపీకి కూడా పరోక్షంగా రాజకీయ సలహాలు ఇచ్చారని వ్యూహాలలో సాయం చేశారని ప్రచారం సాగింది.
ఇదిలా ఉంటే బీహార్ లో 2025 నవంబర్ లో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలో అధికార జేడీయూ బీజేపీ కూటమిని ఢీ కొట్టడానికి పీకే జన్ సురాజ్ ని సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాము నితీష్ ని గద్దె నుంచి దించుతామని ఆయన చెబుతున్నారు. మరి విపక్ష కూటమిగా ఇండియా కూటమి ఉంది. పీకే సొంతంగా పోటీ చేస్తారా లేక కూటమితో చేతులు కలుపుతారా అన్నది చూడాలి ఏది ఏమైనా పీకే రాజకీయ అవతారం మాత్రం ఆసక్తిని రేపుతోంది.
వ్యూహాలు రూపొందించడం వేరు, రాజకీయాలను ప్రత్యక్షంగా చేయడం వేరు. జనాలలో ఇమేజ్ ఉండాలి. వారి విశ్వాసం చూరగొనాలి. ఆ విధంగా చూస్తే ఈ బిహారీ బాబు తన సొంత రాష్ట్రం ప్రజల నమ్మకాన్ని ఏ మేరకు పొందుతారు అన్నది రానున్న కాలమే నిర్ణయించబోతుంది అని అంటున్నారు.