వైఎస్ జగన్ సంస్కరణలకు ప్రధాని అడ్వైజరీ కౌన్సిల్ ఫిదా!
2019 ఎన్నికల్లో గెలిచి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిందే తడవుగా విద్యా రంగాన్ని ప్రభుత్వ ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించారు.
2019 ఎన్నికల్లో గెలిచి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిందే తడవుగా విద్యా రంగాన్ని ప్రభుత్వ ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించారు. ఈ క్రమంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు తెరతీశారు. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో అనేక పథకాలను ప్రవేశపెట్టారు.
ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చడానికి ఉద్దేశించిన నాడు–నేడు: మన బడి, అలాగే విద్యార్ధులకు స్కూల్ యూనిఫామ్, బూట్లు, సాక్సు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిక్షనరీ, బ్యాగు అందించడానికి జగనన్న విద్యా కానుక, ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు శుచి, రుచికరమైన మధ్యాహ్నం భోజనం అందించడానికి జగనన్న గోరుముద్ద, సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ తో ట్యాబులు, క్లాసు రూముల్లో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో డిజిటల్ బోధన, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడానికి జగనన్న ఆణిముత్యాలు, ప్రభుత్వ స్కూళ్లలో ప్రతిభావంతులకు అమెరికా పర్యటన అవకాశం, బాలికలకు స్వేచ్చా శానిటరీ నాప్కిన్స్.... ఇలా ఒకటా రెండా... ఎన్నో పథకాలను వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తోంది.
తన విప్లవాత్మక సంస్కరణలు, పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల అధికారులు ఇప్పటికే ఏపీలో పర్యటించి ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాలపై ప్రశంసల జల్లు కురిపించారు. తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఈ పథకాలను అమలు చేస్తామని చెబుతున్నారు.
కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను జగన్ ప్రభుత్వం తీర్చిదిద్దింది. దీంతో అంతే స్థాయిలో విద్యార్థుల చేరికలు కూడా ఊపందుకున్నాయి. తమ పిల్లను బడికి పంపుతున్న తల్లులకు జగనన్న అమ్మ ఒడి కింద జగన్ ప్రభుత్వం ఏటా రూ.15 వేలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా 43 లక్షల మంది పిల్లలకు లబ్ధి కలుగుతోంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యనభ్యసిస్తున్నవారికి జగనన్న అమ్మ ఒడిని అందిస్తున్నారు.
ఇక ఆర్థిక భారంతో ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను కూడా జగన్ ప్రభుత్వం అందిస్తోంది. జగనన్న విద్యా దీవెన కింద కళాశాలల్లో వివిధ కోర్సులు చదువుకునేవారికి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. అలాగే వసతి దీవెన కింద హాస్టళ్లో ఉండి చదువుకుంటున్నవారికి వారి కోర్సులను బట్టి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఏటా సాయం అందిస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంస్కరణలు చక్కటి ఫలితాలిస్తున్నాయి. తాజాగా ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా’ నివేదిక జగన్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించింది. కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బిబేక్ దేబ్రాయ్ ఈ మేరకు నివేదిక విడుదల చేశారు.
ఫౌండేషన్ ‘విద్య అందుబాటు’ అనే అంశంలో ఆంధ్రప్రదేశ్.. 38.50 స్కోరుతో దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఈ విషయంలో కేరళను ఏపీ మించిపోవడం గమనార్హం. రాష్ట్రంలో అక్షరాస్యత, ఇతర అంశాల్లో దేశంలోనే కేరళ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అందరికీ విద్య అందుబాటులో విషయంలో ఆంధ్రప్రదేశ్.. కేరళను దాటిపోయింది. ఏపీ ఈ విషయంలో 38.50 స్కోరు చేయగా కేరళ 36.55 స్కోరు మాత్రమే సాధించింది. ఇదే అంశాన్ని ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ తన నివేదికలో ప్రస్తావించింది. చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ ‘విద్య అందుబాటు’ అంశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలు నేర్చుకోవాలని సూచించింది.
అదేవిధంగా వివిధ అంశాల్లో కేంద్రం నిర్దేశించిన ఐదు అంశాల్లో జాతీయ సగటు స్కోరు 28.05గా ఉంటే సగానికి పైగా రాష్ట్రాలు అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది. ‘విద్య అందుబాటు’లో రాజస్థాన్ 25.67, గుజరాత్ 22.28, బీహార్ 18.23 స్కోరు మాత్రమే సాధించి ఆంధ్రప్రదేశ్ కంటే అట్టడుగున నిలిచాయి.
ప్రధాని ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ నివేదిక.. పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, పునాది స్థాయి అక్షరాస్యత అంశాలను విశ్లేషించింది. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో అక్షర, సంఖ్యా జ్ఞానాలకు సంబంధించి చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలెలా ఉన్నాయో పరిశీలించింది. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అంశాల వారీగా స్కోరును కేటాయించింది. ఫౌండేషన్ విద్య పటిష్టంగా లేకుంటే పై తరగతుల్లో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినే ప్రమాదమున్నందున ఈ నివేదికలో వాటిని వివరిస్తూనే ఇతర సూచనలు చేసింది.
ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. వైఎస్ జగన్ విజన్, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలతోనే రాష్ట్రం ముందడుగు వేస్తోందని తెలిపారు. విద్యా రంగంలో రాష్ట్రం సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనమన్నారు.