ఎలాన్‌ మస్క్‌ ఒక పొగరుబోతు.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు!

మరోవైపు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ కు, ఎలాన్‌ మస్క్‌ మధ్య చిచ్చు రాజుకుంది.

Update: 2024-04-23 06:41 GMT

టెస్లా, స్పేస్‌ ఎక్స్, టెరాలింక్, ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ ఇప్పుడు భారత్‌ లో టెస్లా యూనిట్‌ ఏర్పాటుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఆయన గుజరాత్, మహారాష్ట్రలపై మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలు ఎలాన్‌ మస్క్‌ ను తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నాయి.

మరోవైపు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ కు, ఎలాన్‌ మస్క్‌ మధ్య చిచ్చు రాజుకుంది. వీరిద్దరూ మాటల యుద్ధానికి తెరతీయడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇంతకూ ఆస్ట్రేలియా ప్రధానికి, ఎలాన్‌ మస్క్‌ కు మధ్య గొడవకు కారణం ఒక చర్చి బిషప్‌ హత్య.

ఇటీవల ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన సిడ్నీలో ఒక చర్చి బిషప్‌ పై కత్తితో దుండగులు దాడి చేశారు. వీటికి సంబంధించిన పోస్టులు సోషల్‌ మీడియా మాధ్యమం ఎక్స్‌ లో వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ పోస్టులను ఎక్స్‌ నుంచి తొలగించాలని ఆస్ట్రేలియా ఫెడరల్‌ కోర్టు ఎలాన్‌ మస్క్‌ ను ఆదేశించింది.

ఈ వ్యవహారం కాస్తా ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఫెడరల్‌ కోర్టు ఆదేశాలతో ఆస్ట్రేలియాలోని యూజర్లకు బిషప్‌ పై దాడికి సంబంధించిన పోస్టులు కనిపించకుండా ఎక్స్‌ ఆపేసింది. అయితే ఆస్ట్రేలియాను మినహాయించి ప్రపంచవ్యాప్తంగా మిగతావారికి ఆ పోస్టులు అలాగే కనిపిస్తున్నాయి.

దీంతో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌ ఆంథోనీ.. ఎలాన్‌ మస్క్‌ పై మండిపడ్డారు. ఆ పోస్టులను తొలగించాలంటే ప్రపంచవ్యాప్తంగా తొలగించాలనేది కోర్టు ఉద్దేశమని.. అంతేకానీ కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే తొలగించడం కాదని ఆల్బనీస్‌ ఆంథోనీ స్పష్టం చేశారు.

మరోవైపు ఆస్ట్రేలియా కోర్టు ఆదేశాలు ఆ దేశం వరకే చెల్లుబాటు అవుతాయి తప్ప ప్రపంచవ్యాప్తంగా కాదని ఎలాన్‌ మస్క్‌ తేల్చిచెప్పారు. భావప్రకటన స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రపు హక్కులను ఎవరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా ఈ–సేఫ్టీ కమిషనర్‌ ను సెన్సార్‌ షిప్‌ కమిషనర్‌ అంటూ అవహేళన చేశారు.

ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌ ఆంథోనీ మండిపడ్డారు. మస్క్‌ ఒక పొగరుబోతు బిలియనీర్‌ అని వ్యాఖ్యానించారు. సోషల్‌ మీడియా సంస్థలకు సామాజిక బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. ఎలాన్‌ మస్క్‌ ఎక్స్‌ లో హింసాత్మక కంటెంట్‌ ను ప్రోత్సహించడం.. దాన్ని అందులోనే ఉంచాలని వితండవాదం చేయడం పట్ల ఆస్ట్రేలియా ప్రధాని విస్మయం వ్యక్తం చేశారు. ఎలాన్‌ మస్క్‌ చట్టాలకు తాను అతీతుడిని అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Tags:    

Similar News