డీపీలు మార్చండి!.. పీఎం పిలుపు: నెటిజన్లు ఏమన్నారంటే
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గంభీరమైన పిలుపునిచ్చారు.
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గంభీరమైన పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 76 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ సహా ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాలకు డీపీలను మార్చుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు. ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇది దోహద పడుతుందనితెలిపారు.
డిస్ ప్లే ఫొటో(డీపీ)గా జాతీయ జెండాను ఉంచాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రతి ఇంటిపైనా తిరంగా ఎగరేయాలని ప్రధాని సూచించారు. అన్ని పోస్టాఫీసుల్లోనూ అత్యంత తక్కువ ధరలకే తిరంగా కొనుగోలు చేయాలని.. తద్వారా దేశబక్తిని చాటు కోవాలని అన్నారు. జెండాలను కొనుగోలు చేయడం ద్వారా వచ్చే సొమ్మును సైనికుల సంక్షేమానికి వినియోగించనున్నట్టు మోడీ తెలిపారు.
ఈ నెల 13వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అయితే.. మోడీ పిలుపుపై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. జెండా ధరిస్తేనో.. ఇంటికి కడితేనో.. సోషల్ మీడియా డీపీలుగా వాడితేనే దేశభక్తి ఉన్నట్టా? అని కొందరు ప్రశ్నించారు. దేశ ప్రజల పిలుపును కూడా మోడీ వినిపించుకోవాలని మరికొందరు చెప్పారు. ఇంకొందరు.. మణిపూర్ ఘటనపై కూడా ఇలానే పిలుపునివ్వచ్చుకదా! అని ప్రశ్నించారు.