వయనాడ్ నుంచి ప్రియాంక...కాంగ్రెస్ లో కొత్త లెక్కలు
కాంగ్రెస్ పార్టీలో గాంధీ ఫ్యామిలీకి సంబంధించిన ఐదవ తరం ఇపుడు కొనసాగుతోంది.
కాంగ్రెస్ పార్టీలో గాంధీ ఫ్యామిలీకి సంబంధించిన ఐదవ తరం ఇపుడు కొనసాగుతోంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్ర నేతగా ఉన్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక చెల్లెలు ప్రియాంక కూడా రంగంలోకి దిగి గత దశాబ్దన్నర కాలంగా పార్టీ కోసం కష్టపడుతోంది.
ఆమె అన్నకు తోడుగా పార్టీకి నీడగా మారారు. ఆమె అనేక సభలలో ప్రసంగించి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ కి కొత్త జోష్ తెచ్చారు. ప్రియాంక తన నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలతో ఉంటారని అంటారు. ఆ ఇమేజ్ తో ఆమె ఏదో నాటికి అందలం అందుకుంటుంది అన్న మాట కూడా ఉంది.
మరో వైపు చూస్తే ప్రియాంకా గాంధీ ఇప్పటిదాకా చట్ట సభలలో అడుగు పెట్టలేదు. ఆమె తన తల్లి వదిలేసిన రాయబరేలీ నుంచి పోటీ చేస్తారు అని అనుకున్నారు. కానీ అక్కడ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. ఇక రాహుల్ వదిలేసిన అమేధీ నుంచి ప్రియాంక పోటీ పడుతుంది అనుకుంటే శర్మ అనే కాంగ్రెస్ విధేయుడికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు.
ఈ నేపథ్యంలో రాహుల్ 2019, 2024లో వరసగా రెండు సార్లు గెలిచిన వయనాడ్ ఎంపీ సీటు ఖాళీ అయింది. రాహుల్ గాంధీ రాయబరేలీ ఉంచుకుని వయనాడ్ త్యాగం చేశారు. అదిపుడు చెల్లెమ్మకు అంకితం అవుతోంది.
పైగా ఉత్తాదిన అన్న దక్షిణాదిన చెల్లెమ్మ అన్న లెక్కలు కూడా సరిపోతాయని అంటున్నారు. కేరళలోని వయనాడు కాంగ్రెస్ కి కీలక ప్రాంతం. ఈసారి జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ని పక్కన పెట్టి మరీ కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ మెజారిటీ సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికలు వస్తే కనుక కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి.
ఇక దేశంలో కూడా ఇండియా కూటమి హవా బాగానే ఉంది. దాంతో భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ప్రియాంకా గాంధీ ఎన్నికలలో పోటీకి సిద్ధపడుతున్నారు అని అంటున్నారు. డ్యాం ష్యూర్ గా ప్రియాంకా గాంధీ ఈ ఉప ఎన్నికల్లో గెలవడం ఖాయమని అంటున్నారు
గెలిచిన ప్రియాంక పార్లమెంట్ లో అన్న రాహుల్ పక్కన చేరి మోడీకి మరో సవాల్ గా మారుతారా అన్న చర్చ కూడా ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ బలం పుంజుకుంటోంది. రాహుల్ హ్యాండ్స్ ని బలోపేతం చేసేందుకు చెల్లెలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రాహుల్ పార్లమెంట్ లో తనదైన శైలిలో అధికార ఎన్డీయే కూటమి మీద అస్త్ర శస్త్రాలు ప్రయోగిస్తున్నారు.
ఇపుడు చెల్లెమ్మ ప్రియాంక కూడా తోడు అయితే అధికార కూటమికి ఇబ్బందులేనా అన్న చర్చ వస్తోంది. అదే విధంగా కాంగ్రెస్ లో కూడా లెక్కలు మారుతాయని అంటున్నారు. ఇక నవంబర్ 13న వయనాడ్ లో ఉప ఎన్నిక జరుగుతుంది. 23న ఫలితాలు వస్తాయి. సో ఈ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీకి గాంధీల ఆడపడుచు ఏ రకమైన జోష్ ని తెస్తారో వేచి చూడాల్సిందే.