రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలన్నది పబ్లిక్ డిమాండ్

దేశ అత్యుత్తమ పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని రతన్ టాటాకు ఇవ్వాలని సామాన్యులు గొంతెత్తిన వైనం చరిత్రలో అలా నిలిచిపోతుంది.

Update: 2024-10-10 05:07 GMT

భారత అత్యుత్తమ పురస్కారం భారతరత్న. ఈ పురస్కారాన్ని ఎవరు ఎవరికి రికమెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రతిపాదిస్తే.. ఆయన ఆమోదంతో ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు. గడిచిన మూడేళ్లుగా భారతరత్న పురస్కారాన్ని ఎవరికి ఇవ్వలేదు. దేశంలో మరెవరికీ దక్కని ఒక గౌరవం రతన్ టాటా సొంతంగా చెప్పాలి. దేశ అత్యుత్తమ పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని రతన్ టాటాకు ఇవ్వాలని సామాన్యులు గొంతెత్తిన వైనం చరిత్రలో అలా నిలిచిపోతుంది.

రతన్ టాటాకు ఇప్పటికే దేశ అత్యుత్తమ మూడో పురస్కారం పద్మభూషణ్.. రెండో అత్యుత్తమ పురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారాలు దక్కాయి. అయితే.. పబ్లిక్ డిమాండ్ ఏమంటే.. రతన్ టాటాకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని. అది కూడా అలా ఇలా కాదు. సోషల్ మీడియాలో భారీ చర్చ సాగింది. ఇలాంటి వేళ.. రతన్ టాటా ఈ డిమాండ్ మీద స్వయంగా స్పందించారు.

మూడేళ్ల క్రితం రతన్ టాటాకు భారతరత్న పురస్కారం ఇవ్వాలన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగినప్పుడు.. ఆయన స్వయంగా దీని మీద స్పందిస్తూ.. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని కోరారు. భారతీయుడిగా పుట్టటమే తాను చేసుకున్న అదృష్టంగా భావిస్తానని.. దేశ అభివృద్ధిలో .. సంపద పెరగడంలో తనవంతు సహకారం అందించినందుకు సంతోషంగా ఉందని పేర్కొనటం ఆయన వినయానికి నిదర్శనంగా చెప్పాలి.

తనకు భారతరత్న ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున సాగిన ప్రచారానికి భిన్నంగా ఆయన స్పందిస్తూ.. "నాకు భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ సోషల్ మీడియాల్లో కొన్ని వర్గాలు వెలుబుచ్చుతున్న అభిప్రాయాల్ని గౌరవిస్తున్నాను. అయితే.. దయచేసి అలాంటి ప్రచారాన్ని ఆపేయాలని నేను వాళ్లను కోరుతున్నా" అంటూ ఆయన తన సందేశాన్ని ఎక్స్ లో పోస్టు చేశారు. భారతరత్న ఫర్ రతన్ టాటా హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ కావటంతో ఆయన అందుకు స్పందిస్తూ పోస్టు చేశారు.

గతంలో ఒక నెటిజన్ ట్వీట్ కు స్పందించిన రతన్ టాటా.. "ఏదైనా విజయం సాధించాలంటే యువత తన శక్తిసామర్థ్యాల్ని బలంగా విశ్వసించాలి" అని సూచన చేశారు. ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్న తర్వాత కూడా దేశ అత్యుత్తమ పౌర పురస్కారం పొందాలన్న దాని కంటే.. ప్రజల మనసుల్లో నిలిచిపోవాలన్న ఉండటమే రతన్ టాటా ప్రత్యేకతగా చెప్పాలి.

Tags:    

Similar News