చంద్ర‌గిరిలో వెయిటింగ్ లిస్టులో పులివ‌ర్తి నాని..!

తాజాగా ఆయ‌న మ‌రోసారి లైమ్ లైట్‌లోకి వ‌చ్చారు. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ సానుకూల ఓట్ల‌ను వైసీపీ నాయ‌కులు ఉద్దేశ పూర్వ‌కంగా తొల‌గిస్తున్న‌ట్టు ఆయ‌న ఆరోపించారు.

Update: 2024-01-11 04:04 GMT

టీడీపీ నాయ‌కుడు, చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ పులివ‌ర్తి నాని దూకుడు పెంచారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్న ఆయ‌న‌.. పార్టీ లైన్ ప్ర‌కారం కార్య‌క్ర‌మాలు అస్స‌లు మిస్ చేయ‌డం లేదు. తాజాగా ఆయ‌న మ‌రోసారి లైమ్ లైట్‌లోకి వ‌చ్చారు. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ సానుకూల ఓట్ల‌ను వైసీపీ నాయ‌కులు ఉద్దేశ పూర్వ‌కంగా తొల‌గిస్తున్న‌ట్టు ఆయ‌న ఆరోపించారు. అంతేకాదు.. క‌లెక్ట‌రేట్ ఎదుట ఆందోళ‌న‌కు దిగి.. దీక్ష కూడా చేప‌ట్టారు.

ఈ ప‌రిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి రెండు ఎన్నిక‌ల్లోనూ గెలుపు గుర్రం ఎక్కారు. ఈ ద‌ఫా ఆయ‌న త‌న కుమారుడికి టికెట్ ఖరారు చేసుకున్నారు. మోహిత్ రెడ్డి కూడా పార్టీ కార్యక్ర‌మాల‌తో బిజీగా ఉన్నారు. అయితే.. ఈ దూకుడు క‌నిపెట్టిన పులివ‌ర్తి.. ఈ ద‌ఫా ఎట్టి ప‌రిస్థితిలోనూ వైసీపీ వ్య‌తిరేక‌త‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

గ‌త 2019లో తొలిసారి టికెట్ ద‌క్కించుకున్న పులివ‌ర్తి.. టీడీపీ టికెట్‌పై పోటీ చేసి.. గ‌ట్టి పోటీనే ఇచ్చారు. అప్ప‌టి త్రిముఖ పోరులోనే ఆయ‌న 86 వేల పైచిలుకు ఓట్లు సంపాయించుకున్నారు ఇక‌, జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేసిన డాక్ట‌ర్ సురేంద్ర 4 వేల పైచిలుకు ఓట్లు ద‌క్కించుకున్నారు. ఈ సారి ఈ రెండు పార్టీలు కూడా క‌లిసి పోటీ చేస్తున్న ద‌రిమిలా.. వైసీపీ వ్య‌తిరేక‌త క‌లిసి వ‌చ్చి.. త‌న గెలుపు త‌ధ్య‌మ‌ని పులివ‌ర్తి ఒక అంచ‌నాతో ఉన్నారు. అయితే.. ఇక్క‌టి టికెట్ వ్య‌వ‌హారం ఆయ‌న‌కు ఇబ్బందిగా మారింది. ప్ర‌స్తుతం ఇంచార్జ్‌గానే ఉన్న‌ప్ప‌టికీ.. చివ‌రి నిముషంలో ఆయ‌న‌ను మార్చే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం కూడా ఉంది.

గుంటూరు ఎంపీగా ఉన్న గ‌ల్లా జ‌య‌దేవ్‌.. త‌న మాతృమూర్తి గ‌తంలో ప్రాతినిధ్యం వ‌హించిన ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తే.. దీనిని చంద్ర‌బాబు బంగారు ప‌ళ్లెంలో పెట్టి మ‌రీ ఆయ‌నకు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అయితే.. ఈ విష‌యంలో గ‌ల్లా ఎటూ తేల్చ‌డం లేదు. పైగా.. ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటాన‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పులివ‌ర్తి ఒకింత డోలాయ‌మానంలో ఉన్నారు. అయినా.. టికెట్ క‌నుక ప్ర‌క‌టిస్తే.. గెలుపు కోసం శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని ఆయ‌న చెబుతుండ‌డం... క్షేత్ర‌స్థాయిలో ఇదే ప‌నితీరు క‌న‌బ‌రుస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News