టీడీపీ, జనసేన సీట్ల ప్రకటనపై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి విడత జాబితాను టీడీపీ, జనసేన పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి విడత జాబితాను టీడీపీ, జనసేన పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. 175 సీట్లకు గానూ మరో 57 సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీతో పొత్తు ఖరారయ్యాక 57 అసెంబ్లీ సీట్లతోపాటు 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో తమ వ్యూహం తమకుందని తెలిపారు. బూత్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. పొత్తులకు సంబంధించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కేంద్రం పెద్దల ఆదేశాల మేరకే తాము పోటీ చేసే స్థానాలు ఖరారు అవుతాయని వివరించారు.
టీడీపీ, జనసేన ఇంకా అన్ని సీట్లను ప్రకటించలేదని గుర్తు చేశారు. బీజేపీ అధిష్టానం పొత్తు ఖరారు చేశాక పోటీ చేసే సీట్లపై ఆలోచన చేస్తామన్నారు. పొత్తు ఖరారయ్యే వరకు బీజేపీ 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లలో పోటీ చేసేలా పనిచేస్తామని పురందేశ్వరి తెలిపారు.
ఓటరును బూత్ వరకూ తీసుకురావడానికి చేయాల్సిన పనులపై పార్టీ నేతలకు శిక్షణ ఇచ్చి బాధ్యతలు అప్పగిస్తామని పురందేశ్వరి తెలిపారు. దొంగ ఓట్ల అంశంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలను కొందరు ఉల్లంఘిస్తారని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా ఉండాలని ధర్మాన చెప్పడం ఈసీ ఆదేశాలకు విరుద్దంగా ప్రవర్తించడమేనని పురందేశ్వరి మండిపడ్డారు. వాలంటీర్లు ఫ్యాన్ గుర్తుపై ఓటేసేలా చేయాలని జగన్ సభలో చెప్పడం ఈసీ నిబంధనలు ఉల్లంఘనేనని ఆమె ధ్వజమెత్తారు
ఇవన్నీ పొందుపరుస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి తాను లెటర్ రాశానని పురందేశ్వరి తెలిపారు. ప్రజాపోరు యాత్రలో బీజేపీ మన రాష్ట్రానికి ఏం చేసిందో చెబుతున్నామన్నారు. బీజేపీని రాష్ట్రంలో ఆశీర్వదించడానికి ప్రజలు ముందుకొస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుపై తమ అధినాయకత్వం నిర్ణయమే శిరోధార్యమన్నారు. టీడీపీ–జనసేనలో పొత్తులో ఉండి సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నాయని తెలిపారు.
కాగా టీడీపీ, జనసేన పార్టీల వ్యవహారం, పురందేశ్వరి తాజా వ్యాఖ్యలను పరిశీలిస్తుంటే పొత్తు ఉండకపోవచ్చని టాక్ నడుస్తోంది. బీజేపీకి నాలుగు అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు సీట్లు మించి కేటాయించకపోవచ్చని చెబుతున్నారు. అయితే తమకు అంతకంటే ఎక్కువ సీట్లు కావాలని బీజేపీ కోరుతుండటం పట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విముఖతతో ఉన్నారని అంటున్నారు.
ఫిబ్రవరి 27న ఏలూరులో బీజేపీ సభను నిర్వహించనుంది. ఈ సభకు కేంద్ర రక్షణ శాఖ రాజనాథ్ సింగ్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన పొత్తులపై స్పష్టత ఇస్తారని అంటున్నారు. పొత్తుపై బీజేపీ కేంద్ర నాయకత్వం స్పష్టత ఇవ్వకపోతే మిగిలిన 57 సీట్లకు టీడీపీ, జనసేన సీట్లను ప్రకటిస్తాయని చెబుతున్నారు.