పురందేశ్వరికి ఉద్వాసన తప్పదా?

ఈ ఏడాది జూలైలో తెలంగాణకు కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ కు బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియమితులయ్యారు.

Update: 2023-10-11 06:50 GMT

మొదటి నుంచి బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్న రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్‌. ఈ రాష్ట్రంలో బలపడాలని భావిస్తున్నప్పటికీ బీజేపీ ఆశలు ఇంతవరకు నెరవేరలేదు. గతంలో బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వెంకయ్య నాయుడు, కంభంపాటి హరిబాబు, తదితరులంతా కూడా బీజేపీని టీడీపీకి బీటీమ్‌ గా నడిపించారనే విమర్శలున్నాయి. ఆ తర్వాత బీజేపీ అధ్యక్ష పదవిని కమ్మ సామాజికవర్గం నుంచి తప్పించి కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించారు. ఆయన కూడా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. దీంతో సోము వీర్రాజుకు అప్పగించారు. అయితే ఈయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో సోమును తప్పించిన బీజేపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించింది.

అయితే ఇప్పుడు దగ్గుబాటి పురందేశ్వరిని కూడా తప్పిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది జూలైలో తెలంగాణకు కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ కు బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియమితులయ్యారు.

తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌తో కిషన్‌ రెడ్డి గట్టిగా పోరాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో పురందేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా నియమితులైనప్పటి నుంచి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉన్న పురందేశ్వరికి ఉన్న బంధుత్వం రీత్యా ఆమె బీజేపీని టీడీపీకి చేరువ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ నడిచేలా పార్టీ అధిష్టానం పెద్దల వద్ద ఒత్తిడి చేస్తున్నారని చెబుతున్నారు. పురందేశ్వరి చేస్తున్న ఈ పని రాష్ట్రంలోని పలువురు బీజేపీ నేతల్లో ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టయ్యాక ఈ మొగ్గు మరింత స్పష్టంగా కనిపించింది.

పురందేశ్వరి.. ఏకపక్షంగా చంద్రబాబు అరెస్టును ఖండించడం పట్ల బీజేపీ నేతల్లోనే విస్మయం వ్యక్తమైంది. పార్టీలో చర్చించకుండా, అధిష్టానం పెద్దల అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్టును ఖండించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో పురందేశ్వరితో సహా ఏపీ బీజేపీలో ఉన్నవారిలో సగం మంది టీడీపీ నేతలేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొద్ది రోజుల క్రితం బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు.

మరోవైపు పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు కాకుండా కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన పురందేశ్వరికి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది నేతలు ఆమె నియామకం పట్ల లోలోన అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన పురందేశ్వరి ఏపీలో మద్యం పాలసీపై సీబీఐతో విచారణ జరిపించాలని వినతిపత్రం ఇచ్చారు. అయితే తన మరిది చంద్రబాబు అరెస్టును అమిత్‌ షాకు తెలియజేశారని.. ఆయనను రక్షించాలని కోరినట్టు గాసిప్స్‌ వచ్చాయి.

ఈ పరిస్థితుల దృష్ట్యా పురందేశ్వరిని ఆమె స్థానం నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది. పార్టీని బలోపేతం చేయకుండా టీడీపీకి చేరువ కావడానికి ప్రయత్నించడం పట్ల బీజేపీ అధిష్టానం ఆమె పట్ల గుర్రుగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెను తొలగించే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది.

Tags:    

Similar News