ట్రంప్ వద్దు బైడెన్ ముద్దు.. ఆసక్తికరంగా పుతిన్ వ్యాఖ్యలు
ట్రంప్ తో పోలిస్తే బైడెన్ ను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికార దండాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్న వేళ.. ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు పుతిన్. అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా వారితో కలిసి పని చేస్తామని చెబుతూనే ట్రంప్ కంటే బైడెనే బెటర్ అంటూ వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది.
ట్రంప్ తో పోలిస్తే బైడెన్ ను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. రష్యా అధికారిక టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేవారు. రాబోయే రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా వారితో రష్యా ప్రభుత్వం కలిసి పని చేస్తుందన్నారు. రష్యా ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకొని చూస్తే.. ట్రంప్ కంటే బైడెన్ గెలిస్తేనే మంచిదని వ్యాఖ్యానించటం గమనార్హం.
ఉపాధ్యక్షుడిగా.. అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం బైడెన్ కే ఎక్కువని.. పాతకాలం విధానాలను అవలంభించే నేతగా బైడెన్ ను అభివర్ణించారు. ‘బైడెన్ ను కొంత అంచనా వేయొచ్చు. కానీ.. ట్రంప్ ఆలోచనలు అనూహ్యం’ అంటూ వ్యాఖ్యానించారు. బైడెన్ ఆరోగ్యం సరిగా లేదంటూ వస్తున్న వార్తలపై పుతిన్ ను ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ.. తానేమీ డాక్టర్ ను కాదని.. అయినా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం సరికాదన్నారు.
బైడెన్ ఆరోగ్య సమస్యలు వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపుతాయన్న అంచనాను పుతిన్ వెల్లడించారు. తాను గమనించినంతవరకు బైడెన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఓవైపు బైడెన్ మరోసారి అధ్యక్షుడు అయితే మంచిదంటూ వ్యాఖ్యానించిన పుతిన్.. ఇంకోవైపు బైడెన్ ప్రభుత్వ విధానాలు చాలా తప్పుగా పేర్కొన్నారు. ఈ విషయాల్ని తాను బైడెన్ తోనే స్వయంగా చెప్పినట్లు తెలిపారు.
బైడెన్ కు అధ్యక్షుడిగా కొనసాగే సత్తా లేదని తాను అస్సలు అనుకోనన్న ఆయన.. పేపర్ ను చూసి చదవుతారన్నది వాస్తవమన్న పుతిన్.. ‘‘నేను కూడా కొన్నిసార్లు ప్రసంగ పాఠాన్ని చూసే చదువుతా. అదేమంత పెద్ద విషయం కాదు’’ అంటూ అంటూ తేల్చేశారు. మొత్తంగా పుతిన్ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన కంటే బైడెన్ బెటర్ అనే పుతిన్ వ్యాఖ్యలకు ట్రంప్ ఏ రీతిలో కౌంటర్ ఇస్తారన్నది చూడాలి.