జగన్‌ మొగ్గు మేనమామ వైపా.. బామ్మర్ది వైపా?

ప్రస్తుతం రవీంద్రనాథ్‌ రెడ్డి కుమారుడు నరేన్‌ వైఎస్సార్‌ జిల్లా చింతకొమ్మదిన్నె జెడ్పీటీసీ గా ఉన్నారు.

Update: 2023-08-21 06:10 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తమను కాదని.. తమ కుమారులను తెర మీదకు తెస్తున్నారు. తాము రాజకీయాల నుంచి తప్పుకుని తమ కుమారులను ఎన్నికల్లో పోటీ చేయించాలనే తలంపులో ఉన్నారని టాక్‌ నడుస్తోంది.

ఈ కోవలో వైఎస్సార్‌ జిల్లా కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి కూడా ఉన్నారని అంటున్నారు. ఈయన స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కు మేనమామ. స్వయానా జగన్‌ తల్లి విజయమ్మకు తమ్ముడు. గతంలో వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ తరఫున కడప మేయర్‌ గా రవీంద్రనాథ్‌ రెడ్డి పనిచేశారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు.

ప్రస్తుతం రవీంద్రనాథ్‌ రెడ్డి కుమారుడు నరేన్‌ వైఎస్సార్‌ జిల్లా చింతకొమ్మదిన్నె జెడ్పీటీసీ గా ఉన్నారు. మరోవైపు వ్యాపార రంగంలోనూ చురుగ్గా రాణిస్తున్నారు. ఇటీవల ఆయనపై వైఎస్సార్‌ హయాంలో కేటాయించిన కుందు ప్రాజెక్ట్స్‌ భూముల వ్యవహారంలో ఆరోపణలు వచ్చాయి. వీటిని అతి తక్కువ ధరకే నరేన్‌ దక్కించుకోవాలని చూస్తున్నారని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. వీటిని నరేన్, ఆయన తండ్రి రవీంద్రనాథ్‌ రెడ్డి ఖండించారు.

కాగా వచ్చే ఎన్నికల్లో కమలాపురం నుంచి తనకు బదులుగా తన కుమారుడిని పోటీ చేయించాలనే యోచనలో రవీంద్రనాథ్‌ రెడ్డి ఉన్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనప్పుడు కూడా వైసీపీకి ఓటేయాలని, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని, జగన్‌ ను మరోసారి సీఎంను చేయాలని రవీంద్రనాథ్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఎక్కడా తనకు ఓటేయాలని కోరకపోవడం ఇందుకు నిదర్శనమంటున్నారు.

రవీంద్రనాథ్‌ రెడ్డి జాతకాలను, జ్యోతిషాన్ని బాగా నమ్ముతున్నారని టాక్‌. అందువల్ల ఎన్నికల నాటికి తన జాతకం, తన కుమారుడు నరేన్‌ జాతకం చూపించుకుని.. ఎవరిది బాగుంటే వారు పోటీ చేస్తారని అంటున్నారు.

అయితే ఇప్పటికే భూమన కరుణాకర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పేర్ని నాని, విశ్వరూప్, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తదితరులంతా తమ స్థానాల్లో తమ కుమారులకు సీట్లు ఇవ్వాలని జగన్‌ ని కోరుతున్నారు. వీరిలో ఈ మేరకు కొందరికి జగన్‌ అభయ హస్తం కూడా ఇచ్చేశారని టాక్‌ నడుస్తోంది. మరి మేనమామ విషయంలో జగన్‌ ఆయనకే సీటు ఇస్తారా లేక ఆయన కుమారుడికి సీటు ఇస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News