హైదరాబాద్ లో దారుణం.. జూనియర్ మెడికోలపై ర్యాగింగ్!
తాజాగా హైదరాబాద్ లో వైద్య విద్యకు మంచి కళాశాలగా పేరు పడ్డ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది
హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ర్యాగింగ్ నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా యాంటీ ర్యాగింగ్ కమిటీలు, సెల్ లు ఉన్నా ఫలితం దక్కడం లేదు. తాజాగా హైదరాబాద్ లో వైద్య విద్యకు మంచి కళాశాలగా పేరు పడ్డ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది.
ఇటీవల కౌన్సెలింగ్ లో సీట్లు పొంది గాంధీ మెడికల్ కాలేజీలో చేరిన ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థులను 10 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఈ 10 మంది సెకండియర్, థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులని తెలుస్తోంది. జూనియర్లను అర్థ రాత్రి పూట హాస్టల్ లో తమ రూములకు పిలిపించుకోవడంతోపాటు డ్యాన్సులు చేయించడం, వారిని తిట్టడం, కొట్టడం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ర్యాగింగ్ కు పాల్పడిన వైద్య విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం వేటు వేసింది. ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ చేశారని తేలడంతో 10 మంది సీనియర్ విద్యార్థులను ఏడాదిపాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాకుండా వారిని హాస్టల్ నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్ రెడ్డి ఒక ప్రకటన జారీ చేశారు.
ఇటీవల కొత్తగా ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులను రెండు, మూడో ఏడాది చదివే కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారణ అయ్యింది. యూజీసీ ఆధ్వర్యంలోని యాంటీ ర్యాగింగ్ సెల్ కు కూడా ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో యూజీసీ నుంచి కూడా ర్యాగింగ్ కు పాల్పడుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. మరోవైపు స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. దీంతో తక్షణమే ర్యాగింగ్ కు పాల్పడిన 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. దీంతో వారు ఏడాదిపాటు ఎంబీబీఎస్ కోర్సుకు దూరం కానున్నారు.
వాస్తవానికి ర్యాగింగ్‌కు పాల్పడొద్దని అన్ని తరగతుల విద్యార్థులను పిలిపించి కళాశాల అధికారులు కౌన్సెలింగ్ చేశారు. చర్యలు తీసుకుంటే భవిష్యత్ పోతుందని కూడా హెచ్చరించారు. అయినా కొందరు సీనియర్లు వీటిని లక్ష్యపెట్టలేదు. కొత్తగా చేరిన ఎంబీబీఎస్ విద్యార్థులను అర్ధరాత్రి రెండు గంటలకు తమ గదులకు పిలిపించి వారిని మానసికంగా వేధించారు. బూతులు తిట్టడంతోపాటు డ్యాన్స్ లు కూడా చేయించారని తెలిసింది. దీంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ సంఘటనపై విచారణ జరిపి ర్యాగింగ్ కు పాల్పడ్డ 10 మంది సీనియర్ విద్యార్థులపై వేటు వేసింది.
సస్పెండ్ కాలం పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది మళ్లీ కాలేజీలో చేరినా, హాస్టల్ వసతి మాత్రం కల్పించబోమని డీఎంఈ రమేశ్ రెడ్డి తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కాలేజీ నుంచి తీసేయాలన్న నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. కానీ తాము విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఏడాదిపాటు సస్పెండ్ మాత్రమే చేశామన్నారు. ఇంకా ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.