ఇంతకూ ఆర్‌ఆర్‌ఆర్ పరిస్థితి ఏంటి?
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఉధృత ప్రచారం నిర్వహిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఉధృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాగా కొన్ని స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను మార్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి ఉండి, అనపర్తి స్థానాలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే చర్చంతా ఉండి చుట్టూనే జరుగుతోంది. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు (ఆర్‌ఆర్‌ఆర్) ఆ తర్వాత కొద్ది కాలానికే ఆ పార్టీకి దూరమయ్యారు.
గత కొంతకాలంగా రఘురామకృష్ణరాజు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేది తానేనని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. నరసాపురం సీటు నుంచి ఏ పార్టీ పోటీ చేసినా ఆ పార్టీ తరఫున తానే ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని రఘురామ చెబుతూ వచ్చారు. అయితే విచిత్రంగా ఆయనకు సీటు దక్కలేదు. నరసాపురం, రాజమండ్రి ఎంపీ సీట్లు బీజేపీకి దక్కినా రఘురామకు సీటు లేకుండా పోయింది.
మరోవైపు టీడీపీ కూడా రఘురామకు న్యాయం చేయలేపోయింది. ఈ వ్యవహారంపై టీడీపీలోనే అసంతృప్తి వ్యక్తం కావడం, వైసీపీ అధినేత జగన్ పై ఒంటరి పోరాటం చేస్తున్న రఘురామకు సీటు ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో ఎవరో ఒక అభ్యర్థిని తప్పించి రఘురామకు సీటు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
నరసాపురం ఎంపీ సీటును బీజేపీకి కేటాయించడం, ఆ పార్టీ తరఫున బలహీనమైన అభ్యర్థి బరిలో ఉన్నారనే విమర్శల నేపథ్యంలో ఆయనను మార్చాలని టీడీపీ నేతలు కోరారు. అయితే బీజేపీ ఇందుకు తిరస్కరించింది. తాము ప్రకటించిన అభ్యర్థులను బీజేపీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగం.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేసిందని అందువల్ల తాము అభ్యర్థులను మార్చేది లేదని, ముందు ప్రకటించినవారే అభ్యర్థులని స్పష్టం చేసింది.
దీంతో రఘురామ పరిస్థితి పొయ్యి నుంచి పెనంలో పడ్డటయ్యింది. ఇక దీంతో మధ్యేమార్గంగా రాజుల సీటు అయిన ఉండిలో ఇప్పటికే ప్రకటించిన టీడీపీ అభ్యర్థి రామరాజును పక్కకు తప్పించి ఆ సీటును రఘురామకు కేటాయిస్తారనే చర్చ ఊపందుకుంది.
అయితే ఇందుకు రామరాజు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికలకూ ఆయనే సీటు దక్కించుకున్నారు. వాస్తవానికి ఉండి సీటును వేటుకూరి వెంకట శివరామరాజు కూడా ఆశించారు. 2014లో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన శివరామరాజును 2019లో నర్సాపురం ఎంపీగా చంద్రబాబు పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. దీంతో ఈ ఎన్నికల్లో ఉండి సీటును వేటుకూరి శివరామరాజు కూడా ఆశించారు. అయితే 2019 ఎన్నికల్లో ఉండి నుంచి గెలిచిన రామరాజుకే సీటు దక్కింది.
దీంతో వెంకట శివరామరాజు రెబల్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇది చాలదన్నట్టు రఘురామకృష్ణరాజు ఉండి సీటును ఇస్తే ఇప్పటికే సీటు దక్కించుకున్న రామరాజు సైతం రెబల్ గా పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో రామరాజును అమలాపురం పిలిపించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో చర్చించారు. రఘురామకృష్ణరాజును అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని.. మీరు తప్పుకోవాలని సూచించినట్టు సమాచారం. దీనిపైనా రామరాజు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉండి నియోజకవర్గమంతా చురుగ్గా పర్యటిస్తున్నానని, ఒక విడత ప్రచారాన్ని కూడా పూర్తి చేశానని చెప్పినట్టు సమాచారం.
రఘురామకు సీటు ఇచ్చినా మీకు అన్యాయం చేయబోనని.. పార్టీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చంద్రబాబు.. రామరాజుకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు మూడు పార్టీల నేతలతో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో చర్చలు జరపనున్నారు. ఇందులో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జితోపాటు జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సమాచారం. ఈ సమావేశంలో ఉండి, అనపర్తి అసెంబ్లీ సీట్లు, నరసాపురం పార్లమెంటు స్థానంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.