ఉండిలో త్రిముఖ పోరు... రఘురామకు ఉన్న ఛాన్స్ ఎంత?
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారంతో ముగిసింది
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈనెల 29 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో అనూహ్య పరిణామాలు తెరపైకి వచ్చాయి. వాటిలో ఒకటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో తెరపైకి రావడం గమనార్హం. ఇప్పుడు ఇక్కడ అనూహ్యంగా బలమైన త్రిముఖ పోరు తెరపైకి వచ్చింది!
అవును... ఏపీ రాజకీయాల్లో నరసాపురం ఎంపీగా వైసీపీ నుంచి గెలిచిన రఘురామ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చాలామందికి పరిచయం అవసరం లేదు. అయితే.. ఈసారి ఆయన కోరుకున్నట్లు చెబుతున్న నరసాపురం లోక్ సభ టిక్కెట్ మాత్రం దక్కకపోయినా... ఉండి అసెంబ్లీ నుంచి ఆయనను బరిలోకి దింపుతున్నారు చంద్రబాబు. ఈ సమయంలో ఆయన ఉండి అసెంబ్లీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
ఇదే క్రమంలో... ఉండి వైసీపీ అభ్యర్థిగా పీవీఎల్ నరసింహ రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ప్రచార కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈసారి కచ్చితంగా జగన్ సంక్షేమ పథకాలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన విధానం తనను గెలిపిస్థాయని ధీమాగా చెబుతున్నారు. ఈ క్రమంలో... కూటమి అభ్యర్థిగా రఘురామ - వైసీపీ అభ్యర్థిగా పీవీఎల్ నరసింహ రాజు మధ్యే పోటీ అని భావిస్తున్న నేపథ్యంలో మరో నామినేషన్ దాఖలైంది!
ఇందులో భాగంగా ఉండి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఉండిలో భారీ త్రిముఖ పోరు తప్పదనే కామెంట్లు తెరపైకి వచ్చాయి. కారణం... శివరామ రాజు 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా 15,568.. 36,231 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే... ఆ ఎన్నికల్లో నాలుగు లక్షల పైచిలుకు ఓట్లు సంపాదించి, 30వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు!
ఇలా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంపై గట్టిపట్టు సంపాదించారు. ఉండిలో ఉన్న టీడీపీ కేడర్ లో ఈయన వ్యక్తిగత అనుచరులు, అభిమానులే ఎక్కువని కూడా అంటుంటారు! ఈ సమయంలో ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడంతో... ప్రభుత్వ వ్యతిరేక ఓటు కచ్చితంగా చీలే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు! కారణం... కలవపూడి శివ అంటే ఉండి టీడీపీలో గట్టి పట్టున్న నేత అని చెబుతుండటమే!
దీంతో... గత ఎన్నికల్లో పోలైన ఓట్లు.. ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లపై ఇప్పుడు చర్చ మొదలైంది. 2019 ఎన్నికల్లో టీడీపీకి 82వేల ఓట్లు వస్తే.. వైసీపీకి 71వేల ఓట్లు వచ్చాయి. సీపీఐ అభ్యర్థికి 24వేల ఓట్లు వచ్చాయి! 2014లోనూ వైసీపీకి ఇక్కడ 65వేల ఓట్లు వచ్చాయి. దీంతో... ప్రత్యర్థులు ఎవరైనప్పటికీ 65 - 70వేల ఓట్లు వైసీపీకి పక్కాగా ఉన్నాయని అంటున్నారు!
ఇక టీడీపీకి 2019లో పోలైన 82వేల ఓట్లలోనూ కలవపూడి శివ ఈ ఎన్నికలో కనీసం 30 - 40 వేల ఓట్లు సంపాదించగలుగుతారని అంటున్నారు. ఆయన నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన జనాలే 20వేల పైచులుకు ఉంటారనే చర్చ స్థానికంగా నడుస్తుంది! ఇదే విషయాన్ని రఘురామ కూడా పరోక్షంగా ప్రస్థావించారు కూడా! దీంతో... శివరామరాజు సాధించేవి టీడీపీ ఓట్లే గనుక.. రఘురామకు గట్టిగా గండిపడే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు!
అయితే... రఘురామ మాత్రం... ఈసారి ఎన్నికలు యాంటీ జగన్ - ప్రో జగన్ తరహాలోనే ఉంటాయని.. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కూటమికే పడుతుందని ధీమాగా చెబుతున్నారు. అయితే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు తాను సరైన అర్హత ఉన్న వ్యక్తిని అని, ఇంతకాలం వైసీపీకి వ్యతిరేకంగా ఉండిలో రాజకీయం చేసింది తానని చెబుతూ శివరామరాజు ఇండిపెండెంట్ గా ముందుకు వస్తున్నారు! మరి ఈ త్రిముఖ పోరులో ఎవరు గట్టెక్కుతారనేది వేచి చూడాలి!