రాహు కాలం పోయింది రాహుల్ జీ
కాంగ్రెస్ పార్టీకి పట్టిన పీడలు చీడలు నీడలు తొలగిపోనున్నాయా అంటే జవాబు అవును అనే వస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి పట్టిన పీడలు చీడలు నీడలు తొలగిపోనున్నాయా అంటే జవాబు అవును అనే వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కచ్చితంగా వస్తుంది అని వాదించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాంగ్రెస్ కి దశాబ్ద కాలంగా ఆవరించిన చీకటి తొలగిపోతోంది. మబ్బుల చాటు నుంచి బయటకు వచ్చి ప్రకాశించే మధ్యాహ్న మార్తాండుడు మాదిరిగా కాంగ్రెస్ తన సత్తా చాటుకునే రోజులు వస్తున్నాయ అత్యధికులు నమ్ముతున్నారు.
దేశంలో బీజేపీ ఎంత తగ్గితే కాంగ్రెస్ అంత పెరుగుతుంది. ఇది సింపుల్ థియరీ. ఎందుకంటే మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే అందులో పది నుంచి పన్నెండు దాకా కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ముఖా ముఖీ పోరు ఉంది. ఈ రాష్ట్రాలలో బీజేపీ బలం ఊడ్చేస్తే కాంగ్రెస్ కి ఈజీగా 200 ఎంపీ సీట్లు దక్కుతాయి.
అపుడు 2004, 2009 మాదిరిగా మిత్రుల ఆసరాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కి హెచ్చు అవకాశాలు ఉంటాయి. ఇక యూపీఏకు బదులుగా ఇండియా కూటమి పేరుతో కొత్త ఫ్రంట్ కట్టిన కాంగ్రెస్ కి అన్నీ మంచి శకునములే అన్నట్లుగా వాతావరణం ఉంది. ఇండియా కూటమిని ఏ ముహూర్తాన పెట్టారో కానీ విజయాలు దక్కుతున్నాయి.
లోక్ సభ ఎన్నికల్లో కలసికట్టుగా అంతా పనిచేస్తే 230 దాకా సీట్లు దక్కాయి. మరో వైపు చూస్తే ఇండియా కూటమిలో ఉన్న మిత్రులు కూడా బలమైన వారు. పెద్ద పార్టీలు, తమిళనాడులో డీఎంకే అయినా పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అయినా లేక బీహార్ లో లాలూ ఆర్జేడీ అయినా, యూపీలో ఎస్పీ అయినా, ఢిల్లీ పంజాబ్ లలో అధికారంలో ఉన్న ఆప్ అయినా కాంగ్రెస్ కి గట్టి నేస్తాలుగానే ఉన్నారు
ఇక మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్సీపీ, అలాగే శివసేన, జార్ఖండ్ లో జేఎంఎం పార్టీలు కాంగ్రెస్ కి అన్ని రకాలైన శక్తియుక్తులు ఇస్తున్నాయి. కాంగ్రెస్ కూటమిలో ఉంటే మిత్ర పక్షాలకు సేఫ్. వారికి అపరిమితమైన అధికారాలు ఉంటాయి.
కాంగ్రెస్ తో ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. పదవుల విషయంలోనూ అవకాశాలను బట్టి దక్కించుకోవచ్చు. నియంత పోకడలు ఉండవు. అందుకే ఇండియా కూటమి వైపు మిత్రులు మొగ్గు చూపుతున్నారు. తాజాగా కాశ్మీర్, హర్యానా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి ప్రతికూల వాతావరణం ఉందని చెప్పేశాయి. దాంతో ఇండియా కూటమిలో జోష్ కనిపిస్తోంది.
ఈ ఫలితాలు అధికారికంగా వెలువడితే అపుడు దేశంలోని రాజకీయం కూడా మారుతుందని అంటున్నారు. మరో వైపు చూస్తే ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలు కూడా వచ్చి చేరుతాయని అంటున్నారు. అదే విధంగా ప్రస్తుతం ఎండీయేలో ఉన్న పార్టీలలో కొన్ని వెనక్కి వచ్చి ఇండియా కూటమిలో చేరినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.
ఇక తటస్థ పార్టీలుగా ఉన్నవి కూడా ఈ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమిలోకి రావచ్చు అన్న మాట కూడా ఉంది. దాంతో పాటు ఈ టెర్మ్ లోనే ఇండియా కూటమి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు అయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని అంటున్నారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉందని విపక్షాలు తేల్చేస్తున్నాయి. వరసబెట్టి దేశంలో జరిగే ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇండియా కూటమి దాని మిత్రులు గెలుచుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వంలో రాజకీయ ప్రకంపనలు మొదలై ఏమి జరిగినా షాక్ తినాల్సింది అయితే లేదు అని అంటున్నారు మొత్తానికి కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. కొత్త హుషార్ కూడా కనిపిస్తోంది. రాబోయే రోజులలో మనదే అధికారం అన్న ధీమా అయితే కాంగ్రెస్ నాయకులలో బాగా ఉంది. రేపు ఎంతో మంచిది తీయనిది అన్నది ఖద్దరు పార్టీలో ప్రస్తుతం వినిపిస్తున్న పాట.