విదేశాలకు వెళ్లి దేశాన్ని తక్కువ చేసి.. ఇతరుల్ని పొగడటమేంది రాహుల్?
వయసు మీదకు వచ్చిన తర్వాత కూడా మెజార్టీ భారతీయులు ఏం కోరుకుంటున్నారు? వారి వేదన..
వయసు మీదకు వచ్చిన తర్వాత కూడా మెజార్టీ భారతీయులు ఏం కోరుకుంటున్నారు? వారి వేదన.. ఆవేదన ఏమిటి? వారి ఆశల్ని వినాలన్న ఆలోచన కాంగ్రెస్ ముఖ్యనాయకుడు రాహుల్ గాంధీకి రాదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంట్లో పంచాయితీ ఉంటే ఇంట్లో కూర్చొని తేల్చుకోవాలి. లేదంటే.. ఇంటి బంధువుల్ని ఇంటికి పిలిపించి మాట్లాడాలి సెటిల్ చేయాలి. అంతేకాదు.. ఊళ్లోకి వెళ్లి ఇంటిని నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ప్రయోజనం ఉంటుందా? దాని కారణంగా లాభం సంగతేమో కానీ నష్టమే ఎక్కువన్న విషయం చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుంది. మరి.. ఈ విషయం రాహుల్ కు ఎందుకు అర్థం కానట్లు? అన్నది ప్రశ్న.
తాజాగా అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. ఎప్పటిలానే మోడీ సర్కారుపై విమర్శలు సంధించారు. అదే సమయంలో అమెరికా.. చైనా అంటూ చాలానే మాటలు చెప్పారు. తెలుగును ప్రస్తావిస్తూ.. ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఆయన తీరులోనే ఆలోచిస్తే.. మన దేశానికి వచ్చే అమెరికా అధ్యక్షుడు కానీ.. చైనా అధినేత కానీ ఎప్పుడైనా తమ దేశంలోని రాజకీయాలను.. అక్కడి పొలిటికల్ పంచాయితీలను భారత్ లో పర్యటించే వేళలో ప్రస్తావిస్తారా? అన్నది చూస్తే.. సమాధానం ఇట్టే వచ్చేస్తుంది. నిద్ర లేచింది మొదలు వారే స్ఫూర్తిదాతలు అని చెప్పే రాహుల్.. మరి.. వారి తీరును ఎందుకు ఫాలో కారు? అన్నది సందేహంగా మారింది.
తన అమెరికా పర్యటనలో ఎన్ ఆర్ ఐలతో భేటీ అయిన ఆయన ప్రసంగించారు. ఇందులో కొన్ని కీలక వ్యాఖ్యల్ని చూస్తే..
- భారత రాజకీయాల్లో ప్రేమ.. గౌరవ మర్యాదలు.. మానవత్వం లోపించాయి
- మేం మాత్రం కుల, మత, సంస్క్రతి, చరిత్ర అనే తేడాల్లేకుండా ప్రతి ఒక్కరికి సమానావకాశాలు కల్పించేలా ప్రయత్నిస్తున్నాం.
- ఆర్ఎస్ఎస్ భారత్ ను ఒక భావజాలంగా భావిస్తుంది. మహిళల్ని ఇంటికే పరిమితం కావాలనే ధోరణి ఉంటుంది.
- అమెరికా మాదిరి మేం కూడా ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం కల్పించాలని కోరుకుంటాం.
- భారత ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది క్షణాల్లోనే ప్రజలు బీజేపీకి.. మోడీకి భయపడటం మానేశారు
- ఇది రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్న ప్రజలు సాధించిన భారీ విజయం
- అన్ని ప్రాంతాల భాషలను.. సంస్క్రతులను గౌరవించాలి. అన్ని కులాలను గౌరవించాలి
- ఏకలవ్యుడి ఉదంతాన్ని ఉటంకిస్తూ.. నైపుణ్యత ఉన్న వారిని పాలకులు గౌరవించటం లేదు.
- భారత్.. అమెరికా మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలు ఉండదలన్నదే ఆకాంక్ష
- చైనాతో పోలిస్తే భారత్ లో నిరుద్యోగం ఎక్కువ
- భారత్ సహా ప్రాశ్చాత్య దేశాలు తమ ఉత్పత్తిని మానేసి.. ఆ పని చైనాకు అప్పజెప్పాయి.
- భారత జాతీయ గీతం అన్ని రాష్ట్రాలను ప్రతిబింబిస్తుంది. అన్ని రాష్ట్రాల్ని సమానంగాచూపిస్తుంది.
- ఏ రాష్ట్రం ఎక్కువా కాదు.. తక్కువా కాదు.
- తెలుగు కేవలం భాషగా మాత్రమే కాకుండా చరిత్ర.. సంప్రదాయం.. సంస్క్రతిగా చూస్తాం.
- హిందీతో పోలిస్తే తెలుగు భాష అంత ముఖ్యం కాదని ఒక వేళ ఆ రాష్ట్ర ప్రజలకుచెబితే అది వారిని అవమానించినట్లే.
- ఈ చిన్న తేడాను కొందరు అర్థం చేసుకోవటం లేదు.
రాహుల్ వ్యాఖ్యలనే తీసుకొని కొన్ని ప్రశ్నలు సంధిస్తే.. ఆయన మాటల్లోని డొల్లతనం ఇట్టే అర్థమవుతంది.
1. రాష్ట్రాలను సమంగా చూస్తామన్న చిలకపలుకులు పలికే రాహుల్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ చేసిందేంటి?
2. అందరిని సమంగా చూస్తామని చెప్పే ఆయన.. విభజన వేళలో ఇరు ప్రాంతాల వారికి సమంగా న్యాయం చేయలేదేం?
3. చైనాకు ఉత్పత్తి అవకాశం ఇచ్చామని చెబుతున్నారు. పదేళ్లుగా మోడీ ప్రభుత్వం కొలువు తీరి ఉంది. అంతకు ముందంతా కాంగ్రెస్సే ఏలింది కదా? అప్పుడెందుకు చేయనట్లు?
4. చైనాతో పోలిస్తే భారత్ లో నిరుద్యోగం ఎక్కువన్నదే పాయింట్ అయితే.. 2004-2014 మధ్యలో ఉన్న నిరుద్యోగంతో పోలిస్తే గడిచిన పదేళ్లలో పెరిగిందా?
5. భారత రాజకీయాల్లో ప్రేమ.. అభిమానాలు తగ్గాయంటున్నారు. ఇప్పుడు మీరున్న అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు చేసుకుంటున్న విమర్శలు.. వ్యాఖ్యలు వినట్లేదా?
6. అందరిని సమానంగా చూస్తే.. కాంగ్రెస్ మైనార్టీల పక్షపాతి అన్న ముద్ర ఎందుకు పడిందంటారు?