ప్రతిపక్ష నేత అయినా వివక్షేనా?

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఇటీవల ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌ లోని రాయబరేలీ, కేరళలోని వయనాడ్‌ నుంచి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే

Update: 2024-08-15 11:57 GMT

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఇటీవల ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌ లోని రాయబరేలీ, కేరళలోని వయనాడ్‌ నుంచి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 99 సీట్లు వచ్చాయి. మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెంట్‌ ఎంపీ ఒకరు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఆ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ లోక్‌ సభలో ప్రతిపక్ష నేత హోదా దక్కించుకున్నారు.

లోక్‌ సభలో ప్రతిపక్ష నేతకు కేంద్ర కేబినెట్‌ మంత్రి హోదా ఉంటుంది. కేంద్ర కేబినెట్‌ మంత్రికి ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలు లభిస్తాయో అలాంటి ప్రయోజనాలే ప్రతిపక్ష నేతకు సైతం లభిస్తాయి. అయితే తాజాగా రాహుల్‌ గాంధీకి అవమానం ఎదురైంది. ఆయన హోదాకి తగ్గినట్టుగా ప్రొటోకాల్‌ పాటించకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు, ఒలింపిక్‌ పతక విజేతలతోపాటు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు హాజరయ్యారు.

ఈ క్రమంలో రాహుల్‌ గాంధీకి కేంద్ర కేబినెట్‌ మంత్రులతోపాటు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉండగా ఎక్కడో చివరలో ఆయనకు సీటు కేటాయించారు. కేంద్ర కేబినెట్‌ మంత్రుల తర్వాత ఒలింపిక్స్‌ లో పతకాలు సాధించిన క్రీడాకారులు కూర్చోగా వారి వెనుక కాంగ్రెస్‌ ఎంపీలకు సీట్లు కేటాయించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్‌ గాంధీకి సైతం ప్రొటోకాల్‌ ను ఉల్లంఘించి చివరి వరుసలో సీటు కేటాయించారు.

ఒలింపిక్‌ క్రీడాకారుల వెనుక కుర్చీలో కూర్చున్న రాహుల్‌ గాంధీ చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ప్రతిపక్ష నేతకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉండగా ఎక్కడో చివరి వరుసలో సీటు కేటాయించిందని మండిపడింది.

2014 నుంచి 2019 వరకు అంటే పదేళ్లపాటు ప్రతిపక్ష నేత లేరు. ప్రతిపక్ష హోదాకు తగ్గ స్థానాలు కేంద్రంలో ఏ పార్టీ సాధించకపోవడంతో ఎవరికీ ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆ మార్కును అందుకోవడంతో రాహుల్‌ కు ప్రతిపక్ష నేత హోదా దక్కింది. దీంతో ఆయన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. అయితే కేంద్రం ప్రొటోకాల్‌ ను ఉల్లంఘించింది.

ప్రోటోకాల్‌ ప్రకారం లోక్‌ సభ లో ప్రతిపక్ష నేత, క్యాబినెట్‌ మంత్రులకు సమానంగా ముందు వరుసలో సీట్లు కేటాయిస్తారు. కానీ, రాహుల్‌ గాంధీకి చివరి వరుసలో సీటు కేటాయించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఒలింపిక్స్‌ లో పతకాలు సాధించిన విజేతలకు ముందు వరుసలో సీట్లు కేటాయించామని.. కాంగ్రెస్‌ పార్టీలకు వెనుక వరుసలో సీట్లు కేటాయించామని వెల్లడించింది.

Tags:    

Similar News