రాహువు వీడిన రాహుల్.. ఎంపీగా కొనసాగొచ్చు.. పోటీ చేయొచ్చు!
భారత్ జోడో యాత్రతో జనంలోకి వెళ్లిన ఆయన ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నానికి సుప్రీం కోర్టు చెక్ పెట్టింది
దేశంలో కాంగ్రెస్ కు నూకలు ఎప్పటికీ ఉంటాయి. 20 ఏళ్లు అధికారానికి దూరమైనా ఆ పార్టీ మళ్లీ గెలుస్తుంది. ఇప్పుడు చూడబోతుంటే పదేళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పట్టిన రాహువు వీడింది. భారత్ జోడో యాత్రతో జనంలోకి వెళ్లిన ఆయన ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నానికి సుప్రీం కోర్టు చెక్ పెట్టింది. కాగా, సుప్రీం కోర్టు తాజా తీర్పుతో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం కొనసాగనుంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకూ అవకాశం చిక్కనుంది.
మోదీ ఇంటి పేరుపై విమర్శలకు గాను గుజరాత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించడంతో.. రాహుల్ ను ఎంపీగా అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, రాహుల్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనకు పడిన రెండేళ్ల శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఈ కేసులో గరిష్ఠ శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎటువంటి కారణం చెప్పలేదు. ఈ క్రమంలో దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపేయాలి. ఈ తరహా వ్యాఖ్యలు మంచివి కావన్న విషయంలో సందేహమే లేదు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అందరూ ఆశిస్తారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, మోదీ ఇంటి పేరుపై రాహుల్ వ్యాఖ్యలు చేసినది 2019లో అయితే.. 2023లో తీర్పు వచ్చింది.
తీర్పు ఆధారంతో వేటు..
గుజరాత్ కోర్టు తీర్పు ఆధారంగా.. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దుచేశారు. రాహుల్ పై గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీంతో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద అనర్హత వేటు పడింది. అలా లోక్ సభ సభ్వత్వాన్ని కోల్పోయారు. ఈ క్రమంలోనే శిక్షపై స్టే విధించాలని కోరుతూ వేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు కొట్టేయగా.. దీన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దానిమీద చారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. రెండేళ్ల శిక్షపై తాజాగా స్టే విధించింది.
కొత్త పార్లమెంటులో సగర్వంగా సభకు..
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. కొత్తగా ప్రారంభించిన భవనం ఇందుకు వేదికైంది. రాహుల్ పై అనర్హత వేటు పడిన తర్వాత జరుగుతున్న సమావేశాలు ఇవే. మోదీలపై వ్యాఖ్యలు విమర్శలు మాత్రమేనని.. తన తప్పేమీ లేదంటూ రాహుల్ వాదిస్తున్నారు. బుధవారం కూడా సుప్రీం కోర్టును తనపై విధించిన నిషేధాన్ని తొలగించాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలకు అనుమతించాలని విన్నవించారు. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో ఆయన సగర్వంగా కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలకు వెళ్లనున్నారు. 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నారు. కాగా, రాహుల్ పై వేటుతో వాయనాడ్ స్థానం ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు. అక్కడ ఉప ఎన్నిక అయితే జరపడం లేదు. మరిప్పుడు ఏం చేస్తారో? మరోవైపు రాహుల్ సభ్యత్వంపై సుప్రీం కోర్టు తీర్పుతో కాంగ్రెస్ నాయకులు లోక్ సభ స్పీకర్ ను కలిశారు. తమ నాయకుడి సభ్యతవ్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు.
మోదీ రానిస్తారా?
పైకి చెప్పకున్నా.. రాహుల్ పై అనర్హత ప్రధాని మోదీ వ్యక్తిగత కక్షతో చేసినట్లుగా కనిపించింది. ఇప్పుడు రాహుల్ సభ్యత్వం పునరుద్ధరణకు నోచడంతో మోదీ ఏం చేస్తారో చూడాలి. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 11 వరకు జరగనున్నాయి. ఇప్పటికే మణిపూర్ ఉదంతంపై ప్రతిపక్షాల పట్టుతో ఉభయ సభలు సజావుగా సాగడం లేదు. ఇంతలో ఢిల్లీ బిల్లు లొల్లి. వీటి మధ్యలో ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇవన్నీ చూస్తే.. రాహుల్ ను మోదీ పార్లమెంటు రానిస్తారా? అంటే చెప్పలేం. ఒకవేళ రాహుల్ పార్లమెంటులో అడుగుపెడితే అది ప్రతిపక్ష ఇండియా కూటమికి నైతికంగా పెద్ద విజయమే. కాబట్టి రాహుల్ సభ్యత్వంపై స్పీకర్ నిర్ణయాన్ని ప్రభుత్వం కొంత ఆలస్యం చేసే అవకాశం ఉంది. అయితే, శీతాకాల సమావేశాలకైనా అనుమతించక తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.