రాయబరేలీతో రాహుల్ కి రాజయోగం !
రాయబరేలీకి గాంధీ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. 1952 నుంచి ఈ సీటులో గాంధీ ఫ్యామిలీ గెలుస్తూ వస్తోంది
రాయబరేలీకి గాంధీ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. 1952 నుంచి ఈ సీటులో గాంధీ ఫ్యామిలీ గెలుస్తూ వస్తోంది. తొలి ఎన్నికల్లో రాహుల్ తాత ఫిరోజ్ గాంధీ ఎంపీ అయ్యారు. ఆయన 1957 రెండోసారి కూడా గెలిచారు. ఆయన మరణం తరువాత 1967, 1971, 1980లలో ఇందిరా గాంధీ రాయబరేలీ సీటు నుంచి పోటీ చేసి గెలిచారు. ఆమె ప్రధానిగా కూడా ఉన్నారు.
ఇక 2004 నుంచి 2024 వరకూ నాలుగు పర్యాయాలు సోనియా గాంధీ ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. ఇపుడు రాహుల్ గాంధీ రాయబరేలీని ఎంచుకున్నారు. మొత్తం మీద చూస్తే గాంధీ కుటుంబం సభ్యులు అంతా కలిపి నాలుగు దశాబ్దాల పాటు ఈ సీటు నుంచి ఎంపీలుగా అయ్యారు. ఇపుడు రాహుల్ గాంధీ వంతు వచ్చింది.
ఆయన 2024 ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ లోక్ సభ నుంచి పోటీ చేశారు. తొలి విడతలోనే అక్కడ పోలింగ్ జరిగిపోయింది. ఇక రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని సోనియా గాంధీ ప్రారంభించి భావోద్వేగంతో ప్రసంగించారు. తనను రాయబరేలీ ఎలా ఆదరించారో కుమారుడు రాహుల్ గాంధీని కూడా అలాగే ఆదరించాలని కోరారు రాహుల్ రాయబరేలీ ప్రజలను నిరాశపరచడని ఆమె హామీ ఇచ్చారు. తన కుమారుడిని ప్రజలకు అప్పగిస్తున్నాను అని సోనియా గాంధీ చెప్పడం విశేషం.
అందరినీ గౌరవించడం, బలహీనులను రక్షించడం, ప్రజల హక్కులు కాపాడటం, అన్యాయంపై పోరాడటం తనకు ఇందిరాగాంధీ, రాయ్‌బరేలీ ప్రజలు నేర్పించారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకలు కూడా వీటిని అలవరుచు కున్నారన్నారు. అంతే కాదు 2004 నుంచి తనను వరుసగా గెలిపిస్తూ వచ్చిన రాయ్‌బరేలీ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఏకంగా ఇరవై ఏళ్ల పాటు మీకు సేవ చేసే అవకాశం కల్పించారని పేర్కొన్నారు.
రాహుల్ కూడా ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. రాయ్‌బరేలీ నా కుటుంబం అన్నారు. అదే విధంగా అమేథీ కూడా తన ఇల్లుగా అభివర్ణించారు. ఈ ప్రదేశంతో నా జీవితంలోని సున్నితమైన జ్ఞాపకాలు మాత్రమే కాదు, మా కుటుంబం యొక్క మూలాలు కూడా గత వందేళ్ళ అనుభవాలు కూడా కలగలిపి ఉన్నాయని రాహుల్ అన్నారు.
రాయబరేలీ కాంగ్రెస్ కి కంచుకోట. ఆ పార్టీ 1952 నుంచి ఇప్పటికి కేవలం మూడు ఎన్నికలు తప్ప మిగిలిన అన్నింటిలోనూ గెలిచింది. 1999 నుంచి చూస్తే పాతికేళ్ళుగా కాంగ్రెస్ గెలుస్తూనే ఉంది. దాంతో రాహుల్ సరైన నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. రాహుల్ వయనాడ్ లోక్ సభ సీటుతో పాటు రాయబరేలీ గెలిచినా వయనాడ్ ని వదులుకుంటారు అని అంటున్నారు. ఆ స్థానం నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
మొత్తం మీద రాహుల్ గాంధీ ఈసారి ఉత్తరాది నుంచి అందునా యూపీ నుంచి ఎంపీగా ఆ గెలిచి సభలోకి అడుగు పెట్టాలని చూస్తున్నారు. అంతే కాదు ఇండియా కూటమి ఉత్తరాదిన బలపడుతున్న నేపధ్యంలో రాహుల్ కూడా కీలకమైన పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. రాయబరేలీలో పోటీ చేసి గెలిచిన ఇందిరా గాంధీ ప్రధానిగా మూడు పర్యాయలు పనిచేశారు. ఆ సెంటిమెంట్ మనవడు రాహుల్ కి కూడా కలిసి వస్తుందని అంటున్నారు. అందుకే చేతిలో అమేధీ సీటు ఉన్నా రాయబరేలీ నుంచి రాజయోగం కోసమే రాహుల్ ఈ వైపు షిఫ్ట్ అయ్యారు అని అంటున్నారు.