ఆ నియోజకవర్గం నుంచే బరిలో దిగనున్న రాహుల్ గాంధీ?

కేరళలోని వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి వరసగా రెండో సారి పోటీ చేసేందుకు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు

Update: 2024-04-03 13:30 GMT

దేశంలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. కేరళలోని 20 నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఈ మేరకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. దీంతో ఆశావహులు నామినేషన్లు వేస్తున్నారు. విజయమే లక్ష్యంగా బరిలో నిలుస్తున్నారు.

కేరళలోని వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి వరసగా రెండో సారి పోటీ చేసేందుకు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు. 2019 నాటి ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడ నుంచి నామినేషన్ వేసి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి పీపీ సునీర్ ను నాలుగు లక్షల ఓట్ల తేడాతో ఓడించి రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు కూడా అక్కడ నుంచి బరిలో నిలిచారు.

వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో తన చెల్లెలు ప్రియాంక గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తో కలిసి భారీ ర్యాలీగా వచ్చారు. రెండు రోజులు ఇక్కడే ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక్కడ సీపీఐ అభ్యర్థిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా భార్య పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

దీంతో వాయనాడ్ లో పోటీ ఉంటుందా? ఏకపక్షంగా ఓట్లు పడతాయా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మేరకు బంపర్ మెజార్టీ సాధించి మరోమారు రికార్డులు తిరగరాయాలని ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరి అంచనాలు ఏ మేరకు తీరుతాయో వేచి చూడాల్సిందే. ఎవరి బలం ఎంత అనేది ఫలితాలు వెల్లడయ్యాకే తెలుస్తుంది.

దేశంలో ప్రస్తుతం ఇండియా ఫ్రంట్ గా ఏర్పడిన పార్టీల కూటమి ఎన్డీఏను ఎదుర్కొంటోంది. దేశంలో ప్రధాని మోదీ చరిష్మా పెరుగుతూనే ఉంది. ఈనేపథ్యంలో ఇండియా ఫ్రంట్ కు అధికారం దక్కుతుందా? మోదీని కాదని కాంగ్రెస్ కు ఓటు వేస్తారా? అనేదే సందేహం. ఈ నేపథ్యంలో ఇండియా ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నా వారికి కలిసి వచ్చే వారే కరువయ్యారు.

Tags:    

Similar News