రాహుల్‌ గాంధీపై స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై ప్రముఖ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2024-08-12 12:45 GMT

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై ప్రముఖ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని తెలిపారు. రాహుల్‌ ప్రధాని కాలేదనే దుగ్ధ, నిరాశతో దేశ ఆర్థిక పరిస్థితిని అస్థిరపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కంగనా మండిపడ్డారు.

ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ లోని మండి నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్‌ లోక్‌ సభకు ఎన్నికయ్యారు. బీజేపీ తరఫున పోటీ చేసిన కంగన మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ కుమారుడు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అయిన విక్రమాదిత్యపై ఘన విజయం సాధించారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన కంగన రనౌత్‌.. సెబీ చైర్‌ పర్సన్‌ మాధవీ పురి బచ్‌ పై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికను ఆధారంగా చేసుకుని రాహుల్‌ గాంధీ.. మాధవిపై సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కంగన.. రాహుల్‌ పై విరుచుకుపడ్డారు. ఆయనను భారత రాజకీయాల్లో ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ప్రధానిని కాలేకపోయానన్న నిరాశతోనే స్టాక్‌ మార్కెట్‌ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రాహుల్‌ ఎప్పటికీ దేశానికి ప్రధాని కాలేడని.. ఆయనను ఎప్పటికీ ప్రజలు గెలిపించరని కంగన రనౌత్‌ తెలిపారు. ఆయన ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండిపోతారని జోస్యం చెప్పారు.

రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సైతం మండిపడుతున్నారు. బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌.. రాహుల్‌ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. భారత స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలాలని, ఆర్థిక వ్యవస్థ ధ్వంసం కావాలని రాహుల్‌ కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు, భారత పారిశ్రామిక దిగ్గజం అయిన గౌతమ్‌ అదానీపై హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ బాంబుపేల్చిన సంగతి తెలిసిందే. కృత్రిమంగా అదానీ కంపెనీల షేర్లు పెంచుకోవడానికి పలు అవకతవకలకు పాల్పడ్డారని గతేడాది హిండెన్‌ బర్గ్‌ సంచలన విషయం వెల్లడించింది.

తాజాగా సెక్యూరిటీస్‌ ఎక్సేజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) చైర్‌ పర్సన్‌ మాధవి పురీపై హిండెన్‌ బర్గ్‌ పిడుగులా పడింది. ఆమెకు అవాంఛిత లబ్ధి చేకూరిందని, ఆమె కుటుంబ ఆధీనంలోని సంస్థలకు ప్రయోజనం చేకూరిందని ఆరోపించింది.

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ.. హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ ఆధారంగా మాధవిపై ఆరోపణలు చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలతో సెబీ పవిత్రత దెబ్బతిందన్నారు. ఈ క్రమంలో మాధవి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఇది తన ప్రశ్న కాదని దేశవ్యాప్తంతా అంతా ఇదే విషయాన్ని అడుగుతున్నారన్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్‌ పై కంగనా రనౌత్‌ తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఎప్పటికీ అధికారంలోకి రాలేరని.. ప్రతిపక్షంలోనే ఉంటారని విమర్శించారు.

Tags:    

Similar News