రాహుల్‌ విషయంలో మోదీ ఇక ఆ తప్పు చేయరు!

రాహుల్‌ గాంధీ.. ‘యువరాజు’ అని బీజేపీ నేతలు ఆయనపై చేసే విమర్శ.

Update: 2024-07-02 06:17 GMT

రాహుల్‌ గాంధీ.. ‘యువరాజు’ అని బీజేపీ నేతలు ఆయనపై చేసే విమర్శ. అంతేకాదు రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో ఆయన ‘పప్పు’ అని అవహేళన కూడా చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూకు ముని మనుమడు, దివంగత ప్రధాని ఇందిరాగాంధీకి మనుమడు, మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌ గాంధీకి కుమారుడు అనే అర్హతలు తప్ప రాహుల్‌ గాంధీకి ఏ అర్హతలు లేవని బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. దేశ సమస్యలపై ఆయనకు ఏ అవగాహన లేదని హేళన చేశారు. 2019లో అమేథిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌ గాంధీ ఓడిపోయాక ఈ విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి.

అయితే పడిలేచిన కెరటంలా రాహుల్‌ గాంధీ దూసుకొచ్చారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన చేపట్టిన భారత్‌ జోడో యాత్ర, భారత్‌ న్యాయ్‌ యాత్ర కాంగ్రెస్‌ పార్టీకి జీవం పోశాయి. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ ల్లో కాంగ్రెస్‌ కు అధికారం దక్కేలా చేశాయి. అంతేకాకుండా బీజేపీయేతర పార్టీల్లో అత్యధికం కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరేలా రాహుల్‌ గాంధీ చక్రం తిప్పారు. అవసరమైతే ప్రధాని పదవిని మిత్ర పక్షాలకు వదులుకోవడానికి సిద్ధపడ్డారు.

ఈ నేపథ్యంలో ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 2019 ఎన్నికలతో పోలిస్తే 47 స్థానాలను అధికంగా గెలుచుకుంది. మొత్తం 99 ఎంపీ స్థానాలను దక్కించుకుంది. రాహుల్‌ గాంధీ తమ కంచుకోట అయిన రాయ్‌ బరేలి నుంచి, కేరళలోని వయనాడ్‌ నుంచి విజయం సాధించారు.

మరోవైపు లోక్‌ సభలో ప్రతిపక్ష నేతగానూ రాహుల్‌ గాంధీకి గుర్తింపు లభించింది. దీంతో విపక్ష నాయకుడిగా రాహుల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

పార్లమెంటు తొలి సమావేశాల్లోనే ఏకధాటిగా గంటన్నరపాటు మాట్లాడి మోదీ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.

ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఓం బిర్లా స్పీకర్‌ గా ఎన్నికైనప్పుడు తనకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినప్పుడు నిటారుగా నిలబడ్డారని.. కానీ ప్రధాని మోడీ వస్తే మాత్రం వంగి వంగి ఓం బిర్లా నమస్కరించారని తనదైన హావభావాలతో రాహుల్‌ గాంధీ ఎత్తిచూపినప్పుడు విపక్ష సభ్యులు హోరెత్తించారు.

హిందువులంటే కేవలం మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కాదని రాహుల్‌ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అంతేకాకుండా శివుడి చిత్రపటాన్ని తెచ్చి.. ఆయన తన వెనుక ఉన్నారని సభకు చూపారు. హిందువులంటే బీజేపీ ఏమాత్రం కాదన్నారు. దీంతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సైలెంట్‌ గా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.

అలాగే ఎంతో మంది ప్రతిభావంతుల ఆశలను నీరుగార్చిన నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలోనూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ నిప్పులు చెరిగారు. ఎక్కడా తొట్రుపాటు లేకుండా సాధికారికంగా, స్పష్టంగా, వాగ్ధాటితో రాహుల్‌ పార్లమెంటులో మాట్లాడటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి గట్టి ప్రతిపక్షం ఏర్పడటంతో బీజేపీ కూడా ఆత్మరక్షణ లో పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్, సర్వేలన్నీ బీజేపీ సొంతంగా మెజార్టీ సాధిస్తుందని చెప్పాయి. ఇండియా కూటమి కుదేలవుతుందని తేల్చాయి. అయినా నిరాశ కోల్పోకుండా ఇండియా కూటమిని రాహుల్‌ గాంధీ నడిపించారు. ఇండియా కూటమి లోక్‌ సభలో 240 సీట్లు సాధించి ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేసింది. రాహుల్‌ గాంధీ ఈ ఎన్నికల్లోనూ రెండుసార్లు బరిలోకి దిగి రెండు చోట్లా భారీ మెజార్టీలతో విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ అంచనాలను మించి సొంతంగా 99 స్థానాలు సాధించింది.

కేంద్రంలో మరో 32 సీట్లు ఇండియా కూటమికి వచ్చి ఉంటే కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఉండేది. రాహుల్‌ గాంధీ ప్రధాని పదవిని కూడా చేపట్టేవారు. ఈ నేపథ్యంలో ఇక రాహుల్‌ గాంధీ ఎంతమాత్రం పప్పు కాదనే విషయం మోదీ, అమిత్‌ షాలకు అర్థమయ్యే ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News