పోలింగ్ కి వరుణుడి దెబ్బ ?
ఏమిటో ఎపుడూ చూడని అనుభవాలు ఈసారి ఎన్నికలు చూపిస్తున్నాయి.
ఏమిటో ఎపుడూ చూడని అనుభవాలు ఈసారి ఎన్నికలు చూపిస్తున్నాయి. ఏపీలో మండు వేసవిలో మే నెల మధ్యలో పోలింగ్ డేట్ ఫిక్స్ కావడం అన్నది గతంలో లేదు. ఈసారి నాలుగో విడతలో పోలింగ్ జరుగుతోంది. అయితే మే నెలలో భారీ ఎండలతో పాటు భారీ వానలు కొన్ని సందర్భాలలో తుఫాన్లు కూడా వచ్చిన నేపథ్యం ఉంది.
గతంలో మే నెలలో బీభత్సమైన తుఫానులు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక మే నెల అంటే ఉదయం మండించే ఎండలు మధ్యాహ్నం దాటగానే భారీ వానలు ఇలా చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఉంటూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే మే నెల 13న ఏపీలో పోలింగ్ అంటే రెండు నెలల క్రితం అంతా ఒకింత ఆందోళనకు గురి అయ్యారు.
మండే ఎండలలో పోలింగ్ ఎలా సాగుతుంది అన్నదే ఆ కలవరానికి కారణం. తాము ఎండలలో నిలబడలేమని కూడా భావించే వారు ఉన్నారు. అయితే మే నెల మొదటి వారం నుంచే ఏపీలో వానలు మొదలయ్యాయి. ఇక సరిగ్గా పోలింగ్ వేళకు భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
చాలా చోట్ల పోలింగ్ సిబ్బంది సామగ్రి తీసుకుని వెళ్ళేందుకు వానలు ఇబ్బంది పెడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్నికల సిబ్బందిని తరలించడానికి 48 బస్సులు, 88 జీపులను ఏర్పాటు చేశారు. అయితే మధ్యలో ఒక గంట అతి పెద్ద వర్షం అంతరాయం కలిగించింది. ఇదే తీరున మిగిలిన జిల్లాలలో పరిస్థితి ఉంది. ఏజెన్సీలో ఉన్న విభిన్న వాతావరణం ఒక ఎత్తు అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే వానలు మొదలైపోయాయి. చాలా చోట్ల ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి.
దీంతో పోలింగ్ రోజున భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పోలింగ్ కి వరుణ గండం ఎదురవుతుందా అన్న చర్చ మొదలైంది. నిజానికి మండే ఎండల వల్ల పోలింగ్ కి ఇబ్బంది అని మొదట భావించారు. కానీ సడెన్ గా వరుణుడి ఎంట్రీతో పోలింగ్ కి అతి పెద్ద ప్రతికూలత దీని వల్లనే ఏర్పడుతుందా అన్న చర్చ సాగుతోంది.
మండే ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈసీ పోలింగ్ సమయాన్ని ఒక గంట అదనంగా పెంచింది. కానీ ఇపుడు ఎండలు పోయి వానలు వస్తునాయి. మరి జనాలు ఎలా వీటిని తీసుకుంటారు. భారీ వానలు అయినా పెద్దగా లక్ష్య పెట్టకుండా ఓటేస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా భారీ పోలింగ్ కోసం ఏపీలో ఈసీ అన్ని రకాలైన చర్యలు చేపడుతోంది. కానీ మధ్యలో వరుణ దేవుడు ఎంట్రీతో పోలింగ్ శాతం పైన కూడా చర్చ సాగుతోంది. మరి మే 13 ఎలాంటి వాతావరణం ఉంటుందో పోలింగ్ కి అది అనుకూలిస్తుందో లేదో చూడాల్సి ఉంది.