పాడు వర్షం హైదరాబాద్ లో 12 మందిని పొట్టనపెట్టుకుంది!
మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా స్థానిక రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది.
ఎండ మంటలు మండే ‘‘మే’’లో కురిసిన అకాల వర్షం హైదరాబాద్ లోని పది మందిని పొట్టన పెట్టుకుంది. భారీగా కురిసిన వర్షం కారణంగా.. గోడ కూలిన ఘటనలో ఏడుగురు మరణించగా.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మరణించారు. హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతమైన బాచుపల్లిలోని భారీ విషాదం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా స్థానిక రేణుక ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ కూలింది.
ఈ ఘటనలో ఒకరు మరణించినట్లుగా.. పలువురు గాయపడినట్లుగా సమాచారం బయటకు వచ్చింది. అయితే.. తమ వాళ్లు పలువురు గల్లంతైనట్లుగా బాధిత కుటుంబాలు చెప్పటంతో నిజాంపేట కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు. జేసీబీల సాయంతో శిధిలాల్ని వెలికి తీశారు. స్థానికంగా ఉన్న ఒక నిర్మాణ సంస్థ నిర్వాకంతో ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు.
మరణించిన ఏడుగురు ఛత్తీస్ గఢ్.. ఒడిశాలకు చెందిన వారిగా చెబుతున్నారు. గోడ కూలిన ఘటనలో గాయపడిన వారిని స్థానికంగా ఉన్న మమతా ఆసుపత్రికి తరలించి.. చికిత్స చేస్తున్నారు. మరణించిన వారిలో తిరుపతిరావు (20), శంకర్ (22), రాజు (25), రామ్ యాదవ్ (34), గీత (32), హిమాన్షు (4).. ఖుషీగా గుర్తించారు. ఇదిలా ఉండగా.. మల్కాజిగిరి పరిధిలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు మరణించారు. మరోవైపు బేగంపేటలోని నాలాలో రెండు డెడ్ బాడీస్ కొట్టుకు వచ్చాయి. వర్షాల కారణంగా ప్రమాదానికి గురై.. వరద ఉధ్రతికి కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. బహుదూర్ పురాలో కరెంట్ షాక్ తో ఒకరు మరణించారు. పాడు వర్షం హైదరాబాద్ లోని పన్నెండు మంది ప్రాణాల్ని పొట్టన పెట్టుకుంది.