చంద్రుడికి చందనం...కూల్ అంటే కూలే మరి !
అవును మాట్లాడుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు గురించే. ఆయన మంటెక్కి ఉన్నారు.
చంద్రుడు అంటేనే చల్లనివాడు అని కవులు అంటారు. నిజంగా చంద్రుడు కూల్ కాదు అని ఇటీవల చంద్రుడి మీదకు వెళ్ళిన చంద్రయాన్ త్రీ నిరూపించింది. అక్కడ సగటు ఉష్ణోగ్రతలు యాభైకి మించే ఉంటాయని లెక్క తేలింది. దాంతో చంద్రుడు వేడి వాడే సుమా అని అంతా అనుకునే పరిస్థితి. ఇదిలా ఉంటే చంద్రుడు నుంచి చందనాన్ని అరగతీసి ఆ కూల్ ని ఒంటికి అద్దుకుంటే ఎంత హాయి అని కవులు రచించినవెన్నో ఉన్నాయి.
ఎంత హాయి ఈ రేయి అంటూ చందమామను చూసి పాడుకున్న వైనాలూ ఉన్నాయి. ఇదంతా ఎందుకూ అంటే ఒరిజినల్ చంద్రుడూ చల్లనివాడు కాదు, మన రాజకీయ చంద్రుడు రాజమండ్రి జైలులో ఉన్న చంద్రుడు కూడా చల్లనివాడు కాడని రుజువు అవుతోంది. అవును మాట్లాడుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు గురించే. ఆయన మంటెక్కి ఉన్నారు.
రాజమండ్రి ఎండలకు ఒక్క ఫ్యాన్ తో ఉక్క బోతతో జైలు గోడల మధ్య నీరుకారిపోతున్నారు. ఆ దెబ్బకు బాబుకు చర్మవ్యాధులతో పాటు డీహైడ్రేషన్ సమస్యలు కూడా తలెత్తాయని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు ఆ మీదట ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు సాగించిన పోరాటం ఆందోళనలకు ఫలితం దక్కింది.
ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు మూవ్ చేసిన హౌజ్ మోషన్ పిటిషన్ మీద ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాబు ఉన్న బ్యారెక్స్ లో తక్షణం ఏసీని ఏర్పాటు చేయాలని కోరింది. అలాగే వైద్యుల సూచనల మేరకు వైద్యపరమైన సదుపాయాలు అన్నీ బాబుకు అందేలా చూడాలని కూడా ఆదేశించింది.
దాంతో మన చంద్రన్న జైలు గోడల మధ్య కూల్ అవుతారన్న మట. అంతే కాదు ఆయన నిజంగా చందనం పూసిన చల్లచల్లని చంద్రుడిగా కనిపిస్తారన్న మాట. చంద్రబాబు ఉన్న గదికి ఏసీ లేదు అని డే వన్ నే ఆయన సతీమణి భవనేశ్వరి మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. దాని మీద వైసీపీ నుంచి కౌంటర్లు పడ్డాయి. బాబు వెళ్లింది రెస్ట్ తీసుకోవడానికి కాదు జైలుకు అని కూడా వారు ఎకసెక్కమాడారు.
ఇలా వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిన వార్ లో ఇపుడు బాబు ఆరోగ్యమే అతి ముఖ్యమైన పాయింట్ గా ముందుకు వచ్చింది. అది కాస్తా జైలులో ఉంచితే బాబుకు అసలు రక్షణ లేదు అన్న స్థాయి దాకా వెళ్ళింది. ఇలా వీధి పోరాటాలు విమర్శలు రాజకీయాలు అన్నింటి మధ్యన ఏసీబీ కోర్టు ముందు బాబు తరఫున విన్నపం వెళ్ళింది. దానికి కోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో చంద్రబాబు ఇక ఏసీ బాబు అయ్యారన్న మాట. ఆయనకు ఇంటి నుంచి భోజనం ఇంటి నుంచి మందులు బయట అబేధ్యమైన భద్రత. ఇపుడు ఏసీ సదుపాయం టోటల్ గా బాబుకు బాగానే ఉంది మరి. అయితే ఇది చాలా ఇంకా కావాలా టీడీపీకి అంటే వెయిట్ అండ్ సీ.