మా అన్నకు సీటు ఇవ్వొద్దు.. వైసీపీ ఎమ్మెల్యేపై తమ్ముడి నజర్!
వైసీపీ టికెట్ తన అన్నకు ఇవ్వొద్దని, ఆయనను మార్చేసి కొత్త అభ్యర్థికి ఇవ్వాలని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తమ్ముడు రాజేంద్రరెడ్డి బాంబుపేల్చారు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగు విడతల్లో ప్రకటించిన జాబితాల్లో చాలా మంది సిట్టింగులకు సీట్లు గల్లంతయ్యాయి. మరికొందరిని వేరే నియోజకవర్గాలకు మార్చారు. సీట్లు దక్కనివారు వేరే పార్టీల్లో చేరికకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇదే పెద్ద తలపోటు అని వైసీపీ భావిస్తుంటే శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఆయన సొంత తమ్ముడే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ మేరకు ఆయన ఆడియో సందేశం వైరల్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో కోవూరులో వైసీపీ టికెట్ తన అన్నకు ఇవ్వొద్దని, ఆయనను మార్చేసి కొత్త అభ్యర్థికి ఇవ్వాలని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తమ్ముడు రాజేంద్రరెడ్డి బాంబుపేల్చారు.
ఈ మేరకు తన తన్నకు కోవూరు సీటు ఇవ్వవద్దని నల్లపురెడ్డి రాజేంద్రరెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు విజ్ఞప్తి చేస్తూ ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆడియో సందేశంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గంలో చేసిన తప్పులు, ప్రజల్లో ఆయన పట్ల ఉన్న వ్యతిరేకతను వెల్లడించారు.
తన అన్న ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఒక్కో మండలాన్ని ఒక్కో నాయకుడికి అప్పగించేశారని రాజేంద్రరెడ్డి మండిపడ్డారు. ఆ మండలాల్లో ఎమ్మెల్యే అంటే ప్రసన్న కాదు, ఆ నాయకులేనని ఎద్దేవా చేశారు. ఆ నాయకులు ప్రసన్న అండ చూసుకుని చెలరేగిపోతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కార్యకర్తలు, జనం నేరుగా ప్రసన్నకుమార్ రెడ్డిని కలిసి వారి సమస్యలు చెప్పుకోవాలనుకున్నా వారికి ఆ నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఆ నాయకులకు తెలియకుండా కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలు చెప్పుకొందామని తన అన్న ఇంటికివస్తే కనీసం వారిని పలకరించకుండా మరోసారి కలుద్దాం అని పనివారితో చెప్పించి అవమానించి ప్రసన్నకుమార్ రెడ్డి పంపేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
2019లో తనను గెలిపించిన నాయకులు, కార్యకర్తలను ప్రసన్న దూరం పెట్టారని రాజేంద్రరెడ్డి ఆరోపించారు. ఎవరికీ చెప్పుకోలేక, పార్టీని వీడలేక వారంతా కుమిలిపోతున్న విషయాన్ని గడప గడపకు' కార్యక్రమంలో తాను ప్రత్యక్షంగా చూశానని వివరించారు.
ప్రసన్నకుమార్ రెడ్డిలో మళ్లీ గెలుస్తా అనే అహం ఆయనలో జీర్ణించుకుపోవడం వల్లే ఆ నాయకులందరినీ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఆ అహమే 2004, 2014లో ఆయన్ను దెబ్బతీసిందన్నారు. అయినా గతాన్ని మర్చిపోయి ఇప్పుడూ అదే అహంతో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలకు సంబంధం లేని వెంకట రమణయ్యను తీసుకువచ్చి తన తమ్ముడు అని అధికారులకు కూడా పరిచయం చేసే పరిస్థితికి ప్రసన్న వచ్చారని ఆరోపించారు.
కోవూరు నియోజకవర్గంలో 90 శాతం నాయకులు, కార్యకర్తలు ప్రసన్న పట్ల సంతోషంగా లేరన్నారు. 30 ఏళ్లుగా చూస్తున్న మొహమే కదా.. ఈ సారి మార్చి చూద్దాం అనే అభిప్రాయానికి నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చారని రాజేంద్రరెడ్డి తెలిపారు. ప్రసన్నకు వ్యతిరేక గాలి వీస్తోందని వెల్లడించారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డికి సీటు ఇవ్వొద్దని ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నానన్నారు.
ఎనిమిది నెలల క్రితం ఓ ప్రెస్ మీట్‌లో తన తమ్ముళ్లు, అక్కల కంటే కోవూరు నియోజకవర్గ ప్రజలే తనకు ముఖ్యం అని చెప్పడం ద్వారా తమను ప్రసన్నకుమార్ రెడ్డి అవమానించారని రాజేంద్రరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు తోడబుట్టిన తమపై అంత విషం ఎందుకని ప్రశ్నించారు. అంత పాపం తామేం చేశామో అర్థం కావడం లేదని వాపోయారు.
కాగా రాజేంద్రరెడ్డి మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి రెండో కుమారుడు. 1999లో వెంకటగిరి నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీలోకి వచ్చినప్పటి నుంచి ఆయనతోపాటే వైసీపీలో ఉంటూ కోవూరులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.