పి.గన్నవరంలో పోటీపై మహాసేన రాజేష్ సంచలన వ్యాఖ్యలు!
వాస్తవానికి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించినప్పుడే చంద్రబాబు.. పి.గన్నవరం నియోజకవర్గానికి మహాసేన రాజేష్ ని అభ్యర్థిగా ప్రకటించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గంపై టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల తొలిజాబితా ప్రకటించినప్పటి నుంచీ ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించినప్పుడే చంద్రబాబు.. పి.గన్నవరం నియోజకవర్గానికి మహాసేన రాజేష్ ని అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి నుంచి స్థానికంగా పెద్ద రచ్చే జరిగింది.
ఇందులో భాగంగా... మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని జనసేన కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. అలా అని ఆ స్థానంలో జనసేన అభ్యర్థి పోటీ కోసం వారు టీడీపీ అభ్యర్థిగా రాజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా.. లేక, రాజేష్ గతంలో జనసేనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అతని అభ్యర్థిత్వాన్ని వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నారా అనే అంశంపై తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో... పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు రాజేష్ ప్రకటించినట్లు వార్తలొచ్చాయి!
ఈ నేపథ్యంలో... పొత్తులో భాగంగా పి.గన్నవరం టిక్కెట్ ను బీజేపీకి కేటాయించి, అమలాపురం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారనే చర్చ కూడా ఒకదశలో తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా బీజేపీ నుంచి అయ్యాజీ వేమ పోటీచేసే అవకాశాలున్నాయని కథనాలొచాయి. స్థానికంగా పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో చర్చ కూడా జరిగింది. దీనికి బలం చేకూరుస్తూ... అమలాపురం టీడీపీ అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావును ప్రకటించారు చంద్రబాబు.
ఈ క్రమంలో పి.గన్నవరం పై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది! ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో జనసేనకు 36,259 ఓట్లు పోలవ్వడంతో... జనసేనకు కేటాయించే అవకాశాలూ లేకపోలేదని అంటున్నారు. ఈ సమయంలో... మహాసేన రాజేష్ సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ దర్శనమిచ్చింది. తనను పి.గన్నవరం పోటీ నుంచి తప్పించారనేది దాని సారాంశం.
అవును... తాజాగా మహాసేన రాజేష్ సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ దర్శనమిచ్చింది. ఇందులో భాగంగా... "నన్ను పి.గన్నవరం పోటీ నుంచి తప్పించారని జోన్ 2 ఇన్ ఛార్జ్ ఫోన్ చేసి చెప్పారు. ఇక నన్ను హేళన చేయడం, అవమానించడం మొదలుపెట్టండి" అని ఒక పోస్ట్ కనిపించింది. దీంతో... ఈ పోస్ట్ తో పాటు ఈ పోస్ట్ కింద కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో... పి.గన్నవరం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది.