గార్డియన్ పత్రిక స్టోరీకి రాజ్ నాథ్ షాకింగ్ రిప్లై

బ్రిటన్ కు చెందిన గార్డియన్ మీడియా సంస్థ చేసిన ఆరోపణలపై ఊహించని రీతిలో రియాక్టు అయిన రాజ్ నాథ్.. ఈ కథనాన్ని అసరాగా చేసుకొని దాయాది పాకిస్థాన్ కు సూటి వార్నింగ్ ఇచ్చేశారు.

Update: 2024-04-06 04:35 GMT

వ్యూహాత్మకంగా.. పక్కా ప్లానింగ్ తో కొన్ని కథనాలు ప్రముఖ మీడియా సంస్థల్లో ప్లాంట్ అవుతుంటాయి. అంతర్జాతీయంగా అయితే ఈ ధోరణి మరింత ఎక్కువ. కీలక సమయాల్లో తాము టార్గెట్ చేసిన వారికి నష్టం కలిగించేలా.. కొన్నిసార్లు మేలు కలిగించేలా ఇలాంటి ప్లాంటెడ్ స్టోరీల్ని పబ్లిష్ చేయటం అలవాటే. అయితే.. ఇలాంటి టార్గెటెడ్ స్టోరీలకు ధీటుగా స్పందించటం అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. అంతర్జాతీయంగా భారత ఇమేజ్ ను డ్యామేజ్ చేయటానికి జరిగే కుట్రలో భాగంగానే గార్డియన్ పత్రిక తాజాగా పబ్లిష్ చేసిన కథనం కూడా ఉంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళలో.. మోడీ సర్కారు ఇమేజ్ ను దెబ్బ తీసేలా.. ఆధారాల్లేకుండా.. కేవలం విశ్వసనీయ సమాచారం పేరుతో వండిన ఈ కథనంతో మోడీ సర్కారును ఇరుకున పెట్టే లక్ష్యంగా దీన్ని ప్లాంట్ చేశారంటున్నారు.అయితే.. ఈ కథనానికి ఊహించని రీతిలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నుంచి స్పందన రావటం గమనార్హం. బ్రిటన్ కు చెందిన గార్డియన్ మీడియా సంస్థ చేసిన ఆరోపణలపై ఊహించని రీతిలో రియాక్టు అయిన రాజ్ నాథ్.. ఈ కథనాన్ని అసరాగా చేసుకొని దాయాది పాకిస్థాన్ కు సూటి వార్నింగ్ ఇచ్చేశారు.

ఇంతకూ గార్డియన్ కథనంలోని అంశాల్ని చూస్తే.. పాకిస్థాన్ లో వరుసగా ఉగ్రనేతలు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారని.. వాళ్లంతా గుర్తు తెలియని దాడుల్లో చనిపోవటాన్ని ప్రస్తావించింది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుందని.. ఈ హత్యలన్ని కూడా విదేశాల్లోని ఉగ్రవాదులు ఏరివేత ఆపరేషన్ లో భాగంగానే భారత్ కు చెందిన నిగా ఏజెన్సీ హత్యలు చేస్తుందన్న ఆరోపణలు చేశారు. మోడీ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో.. ముఖ్యంగా పాక్ లో భారత వ్యతిరేకలుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైనట్లుగా ఆరోపించింది.

2020 నుంచి 2023 వరకు దాదాపు 20 మందికి పైగా ఈ రీతిలో ప్రాణాలు కోల్పోయారని.. ఈ హత్యలన్నీ భారత గూఢాచార సంస్థ అయిన ‘రా’ పర్యవేక్షణలో జరిగినట్లుగా పేర్కొంది. తమ ప్రతినిధి భారత్.. పాకిస్థాన్ నిఘా గూఢాచార సంస్థల అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లుగా పేర్కొంటూ భారీ కథనాన్ని ప్రచురించింది. ఎన్నికల వేళ మోడీ సర్కారును ఆత్మరక్షణలో పడేసేలా ఈ కథనం ఉంది. ఈ కథనం చివర్లో ఈ హత్యలో తమ ప్రమేయం లేదని భారత వ్యతిరక ప్రచారంగా భారత విదేశాంగ శాఖ పేర్కొన్నట్లుగా వివరణ కూడా అచ్చేసింది. ఈ కథనంపై స్పందించిన రాజ్ నాథ్ అనూహ్య రీతిలో రియాక్టు అయ్యారు.

తనకు లభించిన అవకాశాన్ని శత్రువులకు వణికేలా వార్నింగ్ ఇచ్చేయటం గమనార్హం. పొరుగు దేశాలతో భారత్ స్నేహ సంబంధాల్ని నెరపాలని భావిస్తుందని.. కానీ ఉగ్రవాదుల చర్యల్ని తాము ఉపేక్షించమని స్పష్టం చేశారు. భారత్ లోకి చొరబడి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం తమ దేశ ఆగ్రహం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుందని స్పష్టం చేవారు. ఒకవేళ ఉగ్రవాదులు భారత్ లో దాడులకు పాల్పడి.. పాక్ కు పారిపోతే వారిని వెంటాడుతామని.. పాక్ భూభాగంలోకివెళ్లి మరీ మట్టుబెడతామని పేర్కొన్నారు. భారత సైన్యానికి ఆ సామర్థ్యం ఉందన్న రాజ్ నాథ్.. ఆ సంగతిని పొరుగు దేశం కూడా గుర్తిస్తే మంచిదని స్పష్టం చేయటం గమనార్హం. ఏమైనా గార్డియన్ పత్రిక కథనానికి సరైన రీతిలో రాజ్ నాథ్ రియాక్టు కావటమే కాదు.. కీలకమైన ఎన్నికల వేళ ఉగ్రవాదుల విషయంలోనూ.. పాక్ విషయంలోనూ తామెంత క్లారిటీతో ఉన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

Tags:    

Similar News