రాజ్యసభ ఎంపీలు...ముగ్గురికీ షేర్ చేయాల్సిందేనా ?
ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ సీట్ల ప్రస్తావన వచ్చిందని కూడా ప్రచారం అయితే సాగుతోంది.
ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. అధికారికంగా రాజ్యసభ దీనిని నోటిఫై చేసింది. అయితే వీటికి తొందరలో ఎన్నికలు నిర్వహిస్తారు అని అంటున్నారు. ఈ మూడు సీట్లూ వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడం వల్ల ఏర్పడినవి అన్నది తెలిసిందే.
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య రాజీనామాలతో ఖాళీ అయిన ఈ సీట్లను ఎవరితో భర్తీ చేస్తారు అన్న చర్చలు ఒక వైపు సాగుతున్నాయి. మరో వైపు చూస్తే కూటమిలోని పార్టీలకు ఇందులో షేరింగ్ ఉందా అన్నది కూడా చర్చగా ఉంది.
అయితే ఈ మూడు ఎంపీ సీట్లను మూడు పార్టీలు సమానంగా పంచుకోవాలని తాజగా ప్రతిపాదనలు మిత్రుల నుంచి టీడీపీకి వెళ్తున్నాయని అంటున్నారు. అంటే టీడీపీకి ఒకటి దక్కితే జనసేన బీజేపీ తలొకటి పంచుకుంటాయన్న మాట. అలా కూటమిలో పవర్ షేరింగ్ కచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నారు.
లేటెస్ట్ గా ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉప ముఖ్యమంత్రి పవన్ కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ సీట్ల ప్రస్తావన వచ్చిందని కూడా ప్రచారం అయితే సాగుతోంది. ఏపీలో కూటమిలో ఏ పదవులు అయినా ముగ్గురూ సమానంగా పంచుకోవాలన్నదే విధానంగా ఉండాలని కూడా అనుకుంటున్నారని ప్రచారంగా ఉంది.
అయితే టీడీపీ లో ఈ పదవులకు పెద్ద పోటీయే ఉంది. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు, అలాగే మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మరో మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్, మాజీ లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ తో పాటు నందమూరి సుహాసిని ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో తాజా మాజీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు తన సీటుని తనకే మళ్లీ ఇమ్మని కోరుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మూడు ఎంపీ సీట్లను తీసుకుంటుందని చర్చ అయితే సాగుతోంది.
అయితే దాని మీద జనసేన బీజేపీ కూడా కొంత అభ్యంతరం పెట్టే చాన్స్ ఉందని అంటున్నారు. జనసేనకు దేశంలోని నాలుగు చట్ట సభలలో ఇపుడు మూడింట ప్రాతినిధ్యం ఉంది. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ఉంది.అలాగే శాసనమండలిలో అడుగు పెట్టింది. లోక్ సభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో కూడా అడుగు పెడితే మొత్తం సభలలో జనసేన ఖాతా తెరచినట్లు అవుతుందని భావిస్తున్నారు.
దాంతో పాటు మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందని అంటున్నారు. ఆయన అనకాపల్లి లోక్ సభ సీటుని పొత్తు ధర్మంలో త్యాగం చేశారు. ఆయనకు రాజ్యసభ ఇస్తే ఆయన కేంద్ర మంత్రివర్గంలో కూడా చేరే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. దాంతో జనసేన వాటాగా ఒక ఎంపీ సీటు కేటాయించాల్సిందే అని అంటున్నారు.
ఇక బీజేపీ కూడా తమకు ఒక రాజ్యసభ సీటు ఏపీ కోటా నుంచి కోరుకుంటోంది. తమ ప్రాధాన్యత కూడా ఉండాలని భావిస్తోంది అని అంటున్నారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్ళేందుకు బిగ్ షాట్స్ కొందరు ఆసక్తిని చూపిస్తున్నారు అని అంటున్నారు.
దాంతో మూడు సీట్లూ ముగ్గురూ పంచుకోవాలన్న డిమాండ్ అయితే ఉందని ప్రచారం మాత్రం సాగుతోంది. అదే సమయంలో వైసీపీ నుంచి మరింత మంది రాజీనామాలు చేస్తారని అలా రాజ్యసభ ఎంపీల ఖాళీలు మరిన్ని వస్తాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అపుడు ఆ ఖాళీలలో మిత్రులకు కచ్చితంగా అకామిడేట్ చేస్తామని కూడా అంటున్నట్లుగా ప్రచారం అయితే ఉంది.
కానీ ముందు ఖాళీ అయిన మూడింటినీ ముగ్గురూ తీసుకోవాలన్న దాని మీదనే చర్చ సాగుతోంది అంటున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు కానీ తొందరలో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే పూర్తి విషయం బయటకు వస్తుందని అంటున్నారు. సో అంత వరకూ వెయిట్ చేయాల్సిందే.