ఔను.. ఆయన్ని వాడుకుని వదిలేశారు.. బీజేపీపై తీవ్ర విమర్శలు!
పైగా.. బీజేపీలో సిద్ధాంతాలు పోయి.. వ్యక్తి పూజలు చోటు చేసుకోవడాన్ని ఆయన ద్వేషిస్తున్నారు. ఈ క్రమంలో తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఫర్వాలేదనే ధీమాతో ఇంటికే పరిమితమయ్యారు.
కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ``ఔను.. ఆయనను వాడుకుని వదిలేశారు`` అని జాతీయ, రాష్ట్ర స్థాయి విశ్లేషకులు.. రాజకీయ నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కష్టపడేవారికిబీజేపీ గుర్తింపు ఇస్తుందని.. కష్ట పడితే.. పలితం ఖచ్చితంగా దక్కుతుందని కేంద్రంలోని పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు సైతం.. పదే పదే చెబుతుంటారు. అయితే.. తాజాగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఎంపికలో మాత్రం రాజకీయం చూసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఛత్తీస్‌గడ్‌లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రెండు దఫాలుగా నవంబరు 9,. 17న జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 90 అసెంబ్లీ స్తానాలకు గాను.. బీజేపీ ఏకంగా 54స్థానాలు దక్కించుకుని రికార్డు సృష్టించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఈ రేంజ్‌లో ఆధిక్యత రావడం ఇదే తొలిసారి. అయితే.. ఇంతగా ఛత్తీస్‌గఢ్ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం.. మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్. ఈయన లేకపోతే.. బీజేపీ గెలిచి ఉండేదే కాదనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు. మాజీ సీఎం రమణ్‌సింగ్.. నిజానికి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
పైగా.. బీజేపీలో సిద్ధాంతాలు పోయి.. వ్యక్తి పూజలు చోటు చేసుకోవడాన్ని ఆయన ద్వేషిస్తున్నారు. ఈ క్రమంలో తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఫర్వాలేదనే ధీమాతో ఇంటికే పరిమితమయ్యారు. మరోవైపు.. రమణ్‌సింగ్ గతంలో 3సార్లు ముఖ్యమంత్రి గా పనిచేయడం.. ఎలాంటి ఆరోపణలు లేకపోవడం.. ప్రజానేతగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఈ క్రమంలో ఈ ఏడాది ఎన్నికలకు ముందు.. ఎవరికి బాధ్యతలు అప్పగిద్దామా? అని ఎదురు చూసిన కమల నాథులకు ఎవరూ తారసపడలేదు. పడినా.. రమణసింగ్ అంతటి చరిష్మా ఉన్ననాయకులు లేనే లేరని నిర్ణయానికి వచ్చారు
ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసి.. మరో 23 రోజుల్లో తొలి విడత పోలింగ్ ప్రారంభమవుతుందని అనగా.. అప్పుడు తీరిగ్గా.. ఛత్తీస్ గఢ్ ఎన్నికల్లో గెలిపించే భారాన్ని ఆయనపై మోపారు. దీంతో సదరు బాధ్యతలను భుజాలపై వేసుకున్న రమణ్‌సింగ్.. ఊరూ వాడా కలియదిరిగారు. ప్రజలను మెప్పించారు. ఈ క్రమంలో ప్రజలు తదుపరి ముఖ్యమంత్రి రమణ్‌సింగేనని అనుకున్నారు. దీంతో ఏకపక్షంగా ఇక్కడ బీజేపీ గెలిచేసింది. కానీ, ఇప్పుడు సీఎం ఎంపిక విషయానికి వచ్చేసరికి.. వచ్చే 2024 పార్లమెంటు ఎన్నికల వ్యూహాన్ని మోడీ సహా అమిత్‌షాలు అమలు చేసేశారు
ఆదివాసీ గిరిజన తెగకు చెందిన కేంద్ర మాజీ మంత్రి.. విష్ణుదేవ్ సాయ్‌ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి.. పీఠం ఎక్కించేస్తున్నారు. అయితే.. ఈయనకు ప్రత్యక్షంగా ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ప్రమేయం లేదు. అయినప్పటికీ.. ఆదివాసీ తెగకు చెందిన నమ్మకస్తుడైన నాయకుడిగా మాత్రమే ఆయనకు సర్టిఫికెట్ ఉండడంతో కేంద్ర నాయకత్వం.. ఆయనను సీఎంగా ఎన్నుకుంది. ఇక, చమటోడ్చి.. ఊరూ వాడా తిరిగిన 70 ఏళ్ల రమణ్‌సింగ్‌కు మాత్రం స్పీకర్ పదవిని ఇచ్చి సరిపుచ్చింది.