అంబటి రాంబాబు అక్కసు.. ఓటర్లపై తీవ్ర విమర్శలు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన ఆయనకు ఇంటి అల్లుడే సెగ పెట్టాడు.
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. సంబరాల అంబటి రాంబాబు.. ఓటర్లపై అక్కసు ప్రదర్శించారు. ఓటర్లను తిట్టి పోశారు. ``సత్తెనపల్లి ఓటర్లు కంటే సుకన్య నే బెటర్`` అంటూ వ్యాఖ్యానించారు. ఇచ్చిన డబ్బులకు సంజన న్యాయం చేసిందని.. డబ్బులు తీసుకుని సత్తెనపల్లి ఓటర్లు ఓటేయలేదని వ్యాఖ్యానించారు. నిజానికి ఎన్నికల్లో ఓడిపోయినా.. ప్రజా తీర్పును ఎవరైనా గౌరవిస్తారు. గెలిస్తే.. ఒకలా.. ఓడితే మరోలా ఏ నాయకుడు కూడా వ్యాఖ్యానించరు. కానీ, రాంబాబు ఆ హద్దును కూడా దాటేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన ఆయనకు ఇంటి అల్లుడే సెగ పెట్టాడు.
తన మామ రాంబాబు దుర్మార్గుడని.. ఆయనను ఓడించాలని సత్తెనపల్లి ప్రజలకు పిలుపునిచ్చారు. ఏదేమైనా.. ప్రభుత్వ వ్యతిరేకతలో రాంబాబు కొట్టుకుపోయారు. ఈ ఓటమిని గౌరవంగా ఆహ్వానించి.. ప్రజలకు చేరువ కావాల్సిన రాంబాబు.. నోరు చేసుకున్నారు. ఓటర్లు తన నుంచి డబ్బులు తీసుకుని కూడా న్యాయం చేయలేదంటూ.. నిప్పులు చెరిగారు. దీనికన్నా సంజనే నయం అంటూ మరో వివాదాస్పద వ్యాఖ్య కూడా కుమ్మరించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రాంబాబు.. గత 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన మీరు.. ఈ ఓటమిని ఎలా చూస్తారని అడగ్గా.. ``సత్తెనపల్లి జనం కంటే. సుకన్యనే బెటర్. తీసుకున్న డబ్బులకు న్యాయం చేసింది. ఓటర్లు డబ్బులు తీసుకుని కూడా ఓటేయలేదు`` అన్నారు.
ఇక, వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాట్లాడుతూ.. గతంలో టీడీపీ కార్యాలయాలు కూడా.. తాము కూల్చే సి ఉంటే బాగుండే దేమో.. కానీ, మా ముఖ్యమంత్రి(జగన్) అలాంటి పనులు చేయొద్దని తమను నిలువరించారని, మనసు చాటుకున్నారని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లో కక్షపూరిత కాలం నడుస్తోందన్నారు. ఏడాదిలోపే వైసీపీ విలువ, జగన్ విలువ ప్రజలకు తెలుస్తాయని.. అప్పుడు వారే తమ తప్పు తాము తెలుసుకుంటారని వ్యాఖ్యానించారు. అయితే.. ఓటర్లను తిట్టిపోసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి విస్మయం వ్యక్తం చేస్తూ.. అంబటిని నిలువరించే ప్రయత్నం చేశారు. మరోసారి మీడియాతో మాట్లాడతాం లే! అంటూ.. అక్కడ నుంచి అంబటిని తీసుకువెళ్లిపోయారు.