మోడీ టీం కి తెలుగు బిడ్డ అవసరం పడిందా ?

బీజేపీలో చాలా మంది నాయకులు ఉన్నారు. వారు బయట పేరు కోసం తపించరు. సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతారు

Update: 2024-08-23 04:30 GMT

బీజేపీలో చాలా మంది నాయకులు ఉన్నారు. వారు బయట పేరు కోసం తపించరు. సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతారు. అలాంటి వారిలో ముందు వరసలో ఉంటారు వారణాసి రామ్ మాధవ్. ఆయన ఎవరో కాదు అచ్చమైన తెలుగు బిడ్డ. ఆయన బహు భాషా కోవిదుడు. హిందూత్వ సిద్ధాంతాలకు కట్టుబడిన వారు.బీజేపీలో జాతీయ స్థాయిలో కీలక పదవులు ఎన్నో నిర్వహించినా చట్ట సభలో మాత్రం అడుగుపెట్టలేదు.

ఆయనను కేంద్ర మంత్రిగా చేస్తారు అని చాలా సార్లు వినిపించినా అవేమీ జరగలేదు. రామ్ మాధవ్ లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తూ పార్టీ అప్పగించిన బాధ్యతలను నూరు శాతం నెరవేరుస్తారు అని పేరు. ఆయనను 2020లో బీజేపీ జాతీయ కార్యవర్గం మార్పులలో పక్కన పెట్టేశారు.

అయితే ఆయన ఏమీ బాధపడలేదు. తన మాతృ సంస్థ అయిన ఆరెస్సెస్ లో ఉంటూ తన పని తాను చేసుకుంటున్నారు. అలాంటి రామ్ మాధవ్ ని బీజేపీ ఇపుడు పిలిచింది. ఆయన అవసరం పార్టీకి వచ్చింది. ఎందుకు అంటే ముంగిట్లో కాశ్మీర్ ఎన్నికలు ఉన్నాయి.

జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నికలు బీజేపీకి కత్తి మీద సాముగా మారాయి. కాశ్మీర్ కిరీటాన్ని ఒక్కసారి అయినా ధరించాలి అన్నది బీజేపీ కోరిక. అయితే అది ఎంతో కొంత నెరవేర్చింది మాత్రం రామ్ మాధవ్ అని చెప్పక తప్పదు. ఆయనను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఈశాన్య రాష్ట్రాల బాధ్యతలు అప్పగించింది. ఆయన ఆ సమయంలోనే బీజేపీకి ఆయా చోట్ల రాజకీయ ప్రాబల్యం పెంచారు.

అసోం, త్రిపుర, మణిపూర్ వంటి చోట్ల కమలం జెండాను రెపరెపలాడించేలా చూశారు. ఆయనను గతంలో జరిగిన జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్కడకు పంపించింది. ఫలితంగా జమ్మూలో నలభై అసెంబ్లీ సీట్లకు గానూ పాతిక సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఆ తరువాత పీడీఎఫ్ తో పొత్తు పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి పదవితో కొన్నాళ్ళ పాటు కాశ్మీర్ లో రాజ్యం చేయగలిగింది.

దాంతో రామ్ మాధవ్ హస్తవాసి ఆయన వ్యూహాలు జమ్మూ అండ్ కాశ్మీర్ లో బీజేపీకి అవసరం అని భావించి ఆరెస్సెస్ నుంచి తీసుకుని వచ్చి మరీ కీలక బాధ్యతలు అప్పగించింది. దాంతో రామ్ మాధవ్ ఇపుడు కాశ్మీర్ లో బీజేపీని గెలిపించాల్సిన బృహత్తర కార్యం భుజానికి ఎత్తుకున్నారు.

రామ్ మాధవ్ ఈ టాస్క్ ని సాధిస్తారు అని బీజేపీ పెద్దలు నమ్ముతున్నారు. మరో వైపు చూస్తే కాంగ్రెస్ నేషనల్ కాంఫరెన్స్ కలసి పొత్తులు పెట్టుకుని పోటీ చేయాలని చూస్తున్నాయని అంటున్నారు. పీడీఎఫ్ గతం కంటే బాగా వీక్ అయింది. అయినా బీజేపీతో చెలిమికి రెడీ అంటుందా లేదా అన్నది చూడాలి.

రామ్ మాధవ్ కి కాశ్మీర్ రాజకీయాలు కొట్టిన పిండి కాబట్టి ఆయన పొత్తులు ఎత్తులు ఏవైనా వేసి బీజేపీకి పట్టం కట్టేలా చూస్తారు అని అంటున్నారు. మొత్తానికి తెలుగు బిడ్డ రామ్ మాధవ్ కాశ్మీర్ యాపిల్ ని తెచ్చి ఇస్తారని హై కమాండ్ కోటి ఆశలను పెట్టుకుంది. ఆయన అవసరం అయితే పార్టీకి ఉంది అని గుర్తించింది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News