అబ్బాయిని ఓడించడం అసాధ్యమా...?
ఎంతలా అంటే ఆయన మీద వైసీపీ ఎవరిని నిలబెట్టినా ఓడించేటంత. ఆయనే కింజరాపు రామ్మోహన్ నాయుడు.
అబ్బాయి గట్టివారు. ఘటనాఘటన సమర్ధుడు. రాజకీయంగా జూనియర్ అని భావించనక్కరలేదు. వయసు తక్కువ అని లైట్ తీసుకోవాల్సిందిలేదు. ఆయన రెండు సార్లు ఎంపీగా నెగ్గిన శ్రీకాకుళం లోక్ సభ సీటుని కంచుకోటగా మార్చుకున్నారు. ఎంతలా అంటే ఆయన మీద వైసీపీ ఎవరిని నిలబెట్టినా ఓడించేటంత. ఆయనే కింజరాపు రామ్మోహన్ నాయుడు.
తండ్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు 1996లో మొదలుపెట్టి శ్రీకాకుళం ఎంపీగా నాలుగు సార్లు వరసబెట్టి గెలిచారు. మొత్తం 13 ఏళ్ల పాటు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు. ఇపుడు ఆయన తనయుడిగా రామ్మోహన్ తండ్రి రికార్డుని అధిగమించేటట్లుగా ఉన్నారు. 2024లో ఆయన ఎంపీగా పదేళ్ళు పూర్తి చేస్తారు. 2024లో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ దఫా అయితే హ్యాట్రిక్ ఎంపీగా ఉంటూనే 15 ఏళ్ళు పూర్తి చేస్తారు.
అలా ఎంపీగా తనకు సరిసాటి ఎవరూ లేరని, ఓడించలేరని రామ్మోహన్ సవాల్ చేసే స్థాయిలో ఉంటే ఆయన మీద ఎవరిని పెట్టాలని వైసీపీ అనేక రకాలైన ప్రయోగాలు చేస్తోంది. 2014లో బలమైన తూర్పు కాపు సామాజికవర్గం నుంచి రెడ్డి శాంతిని దించినా ఫలితం లేకపోయింది. ఇక 2019 ఎన్నికల్లో మరో బలమైన సామాజికవర్గం అయిన కాళింగుల నుంచి దువ్వాడ శ్రీనివాస్ ని దించితే ఆయన కూడా ఓటమి పాలు అయ్యారు.
ఇక 2024 ఎన్నికలు ముందు ఉన్నాయి. ఈసారి ఎవరిని దింపాలి అన్నది వైసీపీకి అతి పెద్ద టెస్టింగ్ గా మారింది. శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపులు, కాళింగులులతో పాటు మరో బలమైన సామాజికవర్గంగా వెలమలు ఉన్నారు. ఆ మాటకు వస్తే ఒక్క 2009 తప్ప గత మూడు దశాబ్దాలుగా శ్రీకాకుళం ఎంపీ సీటు వెలమలదే అవుతోంది.
దాంతో ఆ కాస్ట్ సెంటిమెంట్ ని ఈసారి ప్రయోగించడానికి వైసీపీ చూస్తోంది. వెలమ నాయకులలో వైసీపీ నుంచి దిట్టమైన వారే ఉన్నారు. ధర్మాన ఫ్యామిలీ ముందు వరసలో ఉంటుంది. ఒకరు మంత్రిగా ఉన్నారు. మరొకరు నిన్నటి దాకా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు.
మర్రి వైసీపీ వీరి నుంచి ఎవరిని పోటీకి దించుతుందో చూడాలని అంటున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే ఎంపీగా పోటీకి విముఖత చూపిస్తున్నారు అని అంటున్నారు. ఇక ధర్మాన క్రిష్ణదాస్ ఎంపీగా పోటీకి సై అని అంటున్నా తాను వదిలేసిన నరసన్నపేట ఎమ్మెల్యే సీటుని తన కుమారుడు క్రిష్ణ చైతన్యకు ఇవ్వాలని కండిషన్ పెడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
అది కూడా కాకపోతే ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడుని పోటీకి దించుతారని అంటున్నారు. ఇదిలా ఉంటే పార్టీలు వేరు అయినా రాజకీయంగా ప్రత్యర్ధులు అయినా ధర్మాన కింజరాపు ఫ్యామిలీల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది అని అంటున్నారు. పైగా ఒకరి కోసం ఒకరు లోపాయికారి సాయం చేసుకుంటారు అని అంటారు.
అందువల్ల డైరెక్ట్ గా కింజరాపు వర్సెస్ ధర్మాన ఫ్యామిలీస్ తలపడతాయా అంటే అసలు కుదరదు అంటున్నారు. ఒకవేళ వైసీపీ అధినాయకత్వం వత్తిడి తెస్తే మాత్రం పోటీ అనివార్యం అవుతుంది. అలా జరిగితే ఎవరిది గెలుపు అంటే అపుడు కూడా రామ్మోహన్ దే అని అంటున్నారు. అంత స్ట్రాంగ్ గా ఎంపీ సీటుని ఆయన చేసుకున్నారు అని అంటున్నారు. మరి ఇవన్నీ చూస్తూంటే శ్రీకాకుళం ఎంపీ సీట్లో అబ్బాయిని ఓడించడం అసాధ్యమా అంటే అంతే అని అంటున్నారు. అయితే 2024 ఎన్నికల్లో జనాలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో కూడా చూడాలంటే వైసీపీ పూర్తి నిబద్ధతతో నిజాయతీతో పనిచేయాలని అంటున్నారు.