బిగ్‌ బ్రేకింగ్‌.. జమిలి ఎన్నికలపై కమిటీ కీలక సూచనలు ఇవే!

తాజాగా ఈ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన నివేదికను సమర్పించింది. మొత్తం 18,629 పేజీలు ఉన్న నివేదికను ఆమెకు రాష్ట్రపతి భవన్‌ లో రామనాథ్‌ కోవింద్‌ అందజేశారు.

Update: 2024-03-14 09:50 GMT

దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన ఇవాళ్టిది కాదు. ఈ భావన ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరిట అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌ లో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మాజీ రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఏర్పాటైన ఈ కమిటీలో కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్‌ షా, లోక్‌ సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ౖచైర్మన్‌ ఎన్కే సింగ్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

తాజాగా ఈ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన నివేదికను సమర్పించింది. మొత్తం 18,629 పేజీలు ఉన్న నివేదికను ఆమెకు రాష్ట్రపతి భవన్‌ లో రామనాథ్‌ కోవింద్‌ అందజేశారు. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికే కమిటీ మొగ్గుచూపింది. ఈ మేరకు ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించింది.

జమిలి ఎన్నికలకు కోవింద్‌ కమిటీ రెండంచెల విధానాన్ని సూచించింది. ముందుగా లోక్‌ సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్‌ నిర్వహించాలని సూచించింది. ఆ తర్వాత 100 రోజులకు దేశంలో అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదించింది. ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం ఐదు నిబంధనలను సవరించాలని పేర్కొంది. ఈ మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని సూచించింది.

దాదాపు 190 రోజుల పాటు జమిలి ఎన్నికలపై రామనాథ్‌ కోవింద్‌ కమిటీ అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు జరిపింది. ఈ క్రమంలో జమిలి ఎన్నికలపై 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను కమిటీకి తెలిపాయి. వీటిలో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు తమ మద్దతును తెలియజేశాయి.

కేవలం పార్టీల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా రామనాథ్‌ కోవింద్‌ కమిటీ సలహాలు, సూచనలు కోరింది. ఈ క్రమంలో 21,558 మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు. వీరిలో 80 శాతం మంది జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఆమోదం తెలిపారు. ఇలా అన్ని పార్టీలు, ప్రజల అభిప్రాయాలతో కమిటీ నివేదిక రూపొందించింది.

మరోవైపు జమిలి ఎన్నికలపై లా కమిషన్‌ కూడా తన నివేదికను దాదాపు సిద్ధం చేసినట్టు సమాచారం. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని చేర్చాలని లా కమిషన్‌ సూచించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2029 నాటికి జమిలి ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్‌ ప్రభుత్వానికి సిఫారసు చేయనుందని సమాచారం.

Tags:    

Similar News