ఇక‌... సాంబ 'శుభం' రావులే...!

రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగిన నాయ‌కులు.. ఇప్పుడు కురువృద్ధులై పోయారు.

Update: 2024-08-10 12:30 GMT

రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగిన నాయ‌కులు.. ఇప్పుడు కురువృద్ధులై పోయారు. ఒక‌ప్పుడు జిల్లాల్లోనే కాదు.. ఢిల్లీలోనూ చ‌క్రాలు తిప్పిన నాయ‌కులు ఇప్పుడు క‌నుమ‌రుగై పోయారు. వారిలో పెద్ద ఎత్తున విని పిస్తున్న రెండు పేర్లు.. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, కావూరి సాంబ‌శివ‌రావు. ఇద్ద‌రూ కూడా కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో చ‌క్రం తిప్పిన వారే. ఇద్ద‌రూ గ‌ల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగిన వారే. అయితే.. ఎంత ఎత్తు ఎదిగారో.. అంతే దిగువ‌కు ప‌డిపోయారు. ఇప్పుడు వారు చెప్పుకొనేందుకు కేరాఫ్ కూడా లేదు.

ఇది.. చిత్ర‌మేమీ కాదు. `నేను చ‌నిపోయాక‌.. నా దేహంపై పార్టీ జెండా క‌ప్పండి!`- అని ఒక‌ప్పుడు చెప్పుకొ న్న నాయ‌కులు ఉన్నారు. కానీ, ఇప్పుడు ఏ పార్టీలో ఎవ‌రు ఉంటారో.. ఎప్పుడు జంప్ చేస్తారో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. అలానే ఇద్ద‌రు సాంబ‌శివ‌రావుల ప‌రిస్థితి కూడా త‌యారైంది. ఇందిర‌మ్మ హ‌యాం నుంచి కాంగ్రెస్‌లో ఉన్న కావూరి, రాయ‌పాటిలు.. కేంద్రంలో బాగానే చ‌క్రాలు తిప్పారు. క్షేత్ర‌స్థాయిలోనూ పార్టీకి బ‌లంగా నిలిచారు. ఇందులో సందేహం లేదు.

కావూరిని తీసుకుంటే.. ఏలూరు నుంచి ఎంపీగా గెలిచిన ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో ఇందిర‌మ్మ మెప్పు కూడా పొందారు. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో కొన్ని విలువ‌లు పాటించినా.. చివ‌ర‌కు ఓ బ్యాంకుకు అప్పులు ప‌డ్డార‌నే అప‌వాదు ఎదుర్కొన్నారు. ఇక‌, ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించి పార్టీకి దూర‌మ య్యారు. ఈయ‌న వార‌సులుగా ఎవ‌రినీ రాజ‌కీయాల్లోకి తీసుకురాలేదు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయ జీవితం ముగిసిపోయింద‌నే చ‌ర్చ‌న‌డుస్తోంది.

ఇక‌, రాయ‌పాటి పేరు అంద‌రికీ తెలిసిందే. 2019లో న‌డ‌వ లేని స్థితిలో కూడా ప‌ట్టుబ‌ట్టి టీడీపీ టికెట్ ద‌క్కించుకునే స్థాయి నాయ‌కుడు, ఇందిర‌మ్మ హ‌యాం నుంచి కూడా ఆయ‌న యాక్టివ్‌గా కాంగ్రెస్‌లో ఉన్నారు. త‌ర్వాత‌..రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించి టీడీపీలో చేరి 2014లో ఎంపీ అయ్యారు. త‌ర్వాత ఆయ‌న వార‌సుడిగా రంగారావు ముందుకు వ‌చ్చినా.. వ్యాపారాల‌కే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చారు. త‌ర్వాత కాలంలో టీడీపీని విభేదించి వైసీపీకి చేరువ‌య్యారు.

తాజా ఎన్నిక‌ల్లో లోకేష్‌ను మంగ‌ళ‌గిరిలో ఓడిస్తాన‌ని కూడా రంగారావు చెప్పారు. కానీ, ఆయ‌న ఏం చేశారో తెలియ‌దు కానీ.. లోకేష్ మాత్రం విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో ఇప్పుడు రాయ‌పాటి చ‌రిత్ర కూడా చ‌రిత్ర‌లో క‌లిసిపోయింది. ఎలా చూసుకున్నా.. ఒక‌ప్పుడు రెండు మూడు ద‌శాబ్దాల పాటు రాష్ట్రంలో కావూరి, రాయ‌పాటి సాంబ‌శివ‌రావుల పేర్లు జోరుగా వినిపించినా.. ఇప్పుడు వారి రాజ‌కీయాల‌కు శుభం కార్డు ప‌డిపోయింద‌నే అంటున్నారు.

Tags:    

Similar News