బలమైన సామాజిక వర్గం మద్దతు కోసం జగన్ ?
దాంతో ఆయా పార్టీలు మిగిలిన సామాజిక వర్గాలను కూడా ఆకట్టుకుని అన్నింటికీ ఒక గొడుగు కిందకు తెచ్చుకుంటే అధికార పీఠం కైవశం అవుతుంది.
రాజకీయం అంటే సమాజంలోని వివిధ వర్గాల మద్దతు. ఆ విధంగా అందరూ సపోర్ట్ ఉంటేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. అయితే ప్రతీ పార్టీకీ బేస్ ఓటు బ్యాంక్ ఉంటుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ నుంచి మద్దతు ఇచ్చే గట్టి సామాజిక వర్గం ఉంటుంది. దాంతో ఆయా పార్టీలు మిగిలిన సామాజిక వర్గాలను కూడా ఆకట్టుకుని అన్నింటికీ ఒక గొడుగు కిందకు తెచ్చుకుంటే అధికార పీఠం కైవశం అవుతుంది.
ఉమ్మడి ఏపీలో చూస్తే కాంగ్రెస్ కి చిరకాలంగా రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఉంటూ వచ్చింది. విభజన తరువాత కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా పదేళ్ల తరువాత తిరిగి తెలంగాణాలో అధికారాన్ని చేపట్టింది. దాని వెనక రెడ్డి సామాజిక వర్గం సంపూర్ణ మద్దతు ఉంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఇక ఏపీలో చూస్తే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి 2011లో జగన్ పార్టీ పెట్టినపుడు బలమైన రెడ్డి సామాజిక వర్గం ఆయన వెంట నిలిచింది. ఆ మద్దతు పూర్తి స్థాయిలో కొనసాగడంతో వైసీపీ అద్భుతాలను రాజకీయంగా క్రియేట్ చేయగలిగింది. అప్పటికి దశాబ్దాల కాలంగా జనంలో ఉంటూ బలమైన పార్టీగా ఉన్న టీడీపీని ఢీ కొట్టి వైసీపీ అధికారం దక్కించుకుంది అంటే వెనక దన్ను కూడా కారణం.
అయితే 2019 నుంచి 2024 మధ్య సాగిన వైసీపీ అయిదేళ్ల పాలనలో రెడ్లు చాలా ఇబ్బంది పడ్డారు అని చెబుతారు. వారు ఆశించిన విధంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఇతరత్రా ఏ విధమైన ప్రయోజనాలూ వైసీపీ ప్రభుత్వం నుంచి దక్కలేదు. పైగా వైసీపీ రూపొందించిన కొన్ని పాలసీల వల్ల రెడ్లు ఆర్ధికంగా దెబ్బతిన్నారు అని కూడా చెప్పుకున్నారు.
ముఖ్యంగా విద్యారంగం రియల్ ఎస్టేట్ రంగం, కాంట్రాక్టింగ్ రంగంలో రెడ్లు పూర్తిగా దెబ్బ తిన్నారు అని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలకు తోడు వైసీపీ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ పుణ్యమాని రాజకీయంగా రెడ్లు పూర్తిగా నష్టపోయారు అని అంటున్నారు. రెడ్లు వైసీపీని అధికారంలోకి తేవడానికి కారణమైన సంగతి వైసీపీ హై కమాండ్ విస్మరించి తన సొంత ఓటు బ్యాంక్ నిర్మాణం కోసం చేసిన ప్రయత్నాలూ బూమరాంగ్ అయ్యాయి.
ఇలా రెండింటికీ వైసీపీ చెడిపోవడంతోనే 2024 ఎన్నికల వేళ వైసీపీ దారుణమైన ఓటమిని మూటకట్టుకుందని అంటున్నారు. అదే సమయంలో టీడీపీకి ఒక బలమైన సామాజిక వర్గం వెంట ఉండి పూర్తిగా సహకరించడం వల్లనే అధికారం దక్కింది అని కూడా చెబుతున్నారు. ఈ మొత్తం అన్ని అంశాలను పూర్తిగా సమీక్షించుకున్న మీదటనే వైసీపీ హై కమాండ్ వచ్చే ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకుంది.
ఆది నుంచి వైసీపీకి అండగా నిలిచిన బలమైన రెడ్డి సామాజిక వర్గం అండను కూడా ఆ పార్టీ మరోసారి కోరుకుంటోంది. దానికి ఏమి చేయాలన్న దాని మీద కూడా ఫోకస్ పెడుతోంది అని ప్రచారం సాగుతోంది. వైసీపీకి హార్డ్ కోర్ లాంటి రాయలసీమ జిల్లాలు అలాగే రెడ్ల ప్రాబల్యం అధికంగా ఉండే నెల్లూరు జిల్లా 2024 ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చేశాయి.
దాంతో రెడ్లను తమ వైపు తెచ్చుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. మరి వైసీపీ దగ్గరకు తీస్తామంటే రెడ్లు కూడా ఆలోచిస్తారు కదా. తమ ప్రయోజనాలకు ఏ మేరకు వైసీపీ కాపాడుతుందో ఆ పార్టీ అజెండా ఏమిటి ఏ విధంగా గుర్తింపు ఇస్తుంది అన్నది బేరీజు వేసుకుంటారు కదా అన్న చర్చ కూడా ఉంది.
వచ్చే ఎన్నికలు వైసీపీకి చాలా కీలకం. గట్టిగా చెప్పాలంటే చివరి చాన్స్ అని కూడా అంటున్నారు. అన్ని శక్తులూ కూడదీసుకుని వైసీపీని గెలిపించుకోవాల్సి ఉంది అని అంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమి మీద వ్యతిరేకత వస్తే గెలుస్తామని అనుకోవడం కూడా భ్రమ అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీ బలమైన రెడ్డి సామాజిక వర్గం మీద ఫోకస్ పెడుతోంది అని ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.