ఆ రెడ్లను అవమానించకుండా ఉంటే.. జగన్ ఆలోచనలో పడ్డారా?
వైసీపీకి, ముఖ్యంగా మాజీ సీఎం జగన్‌కు కీలకమైన రెడ్డి సామాజిక వర్గంలో అసంతృప్తి పెల్లుబుకుతున్నట్టు స్పష్టంగా కని పిస్తోంది.
వైసీపీకి, ముఖ్యంగా మాజీ సీఎం జగన్‌కు కీలకమైన రెడ్డి సామాజిక వర్గంలో అసంతృప్తి పెల్లుబుకుతున్నట్టు స్పష్టంగా కని పిస్తోంది. ఒకప్పుడు జగన్ కావాలి.. జగన్ రావాలి.. అని పదే పదే పరితపించిన రెడ్డి సామాజిక వర్గం.. ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో కీలకమైన పెద్దారెడ్లుగా పేరు తెచ్చుకున్నవారిని గతంలో జగన్ అవమానించారన్న వాదన ఈ వర్గంలో బలంగా వినిపించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు జగన్‌ను వెనుకేసుకువచ్చి.. జగన్ సీఎం అయితే తప్పేంటన్న మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి వారికి జగన్ వీసమెత్తు ప్రాధాన్యం ఇవ్వలేదు.
అంతేకాదు.. నెల్లూరుకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రకాశానికి చెందిన మాగుంట కుటుంబాన్ని అవమానించడంతో రెడ్డి వర్గం వైసీపీకి దూరమైందనే విశ్లేషణలు ఎన్నికల తర్వాత వచ్చాయి. నిజానికి నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు వైసీపీకి రెడ్ కార్పెట్ వేసిన రెడ్లు.. టీడీపీకి దూరమయ్యారు. తమ వాడు.. తమ మనసెరిగిన వారు జగన్ వస్తే.. తమ బిజినెస్లు పుంజుకుంటాయని భావించారు. కానీ, జగన్.. ``నా ఎస్సీ, నా బీసీ`` అంటూ.. రెడ్డి వర్గాన్ని దూరం పెట్టారు. ఫలితంగా రెడ్డి వర్గం బలంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ కంచుకోటలు కూలిపోయాయి.
ఆనం రామనారాయణరెడ్డి వంటి కీలక రెడ్డిని జగన్ అవమానించారని ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన వైసీపీ హయాంలో రెండేళ్ల తర్వాత గళం వినిపించారు. తమకు ఏమాత్రం వాల్యూలేకుండా పోయిందన్నారు. మీడియా మీటింగులు పెట్టి... పనులు చేసిన వారికి కూడా నిధులు ఇవ్వలేదన్నారు. దీంతో అప్పట్లోనే జగన్ స్పందించి.. ఇలాంటి వారిని బుజ్జగించి ఉంటే.. కొంత వరకు రెడ్లు శాంతించే వారు. ఇదేసమయంలో రెడ్డి వర్గం దూరం పెట్టిన సాయిరెడ్డి వంటివారిని జగన్ నెత్తిన పెట్టుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటివారిని మంత్రిపదవులకు దూరం పెట్టారన్న ఆవేదన.. కూడా రెడ్డి వర్గంలో ముసురుకుంది.
దీనికి కారణం.. జగన్ చుట్టూ ఉన్న కోటరీ `రెడ్లు` వ్యవహరించిన తీరుగా రెడ్లలో ప్రచారం జరిగింది. రెడ్లకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పిన జగన్ అదికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ వర్గాన్ని దూరం పెట్టారని మోదుగుల చెప్పకనే చెప్పారు. ఫలితంగా రెడ్డి సామాజిక వర్గం జగన్‌ను వదిలేసింది. దీంతో ప్రస్తుతం జగన్ గురించి మాట్లాడే రెడ్డి ఒక్కరూ లేరు. ఆ కోటరీ రెడ్లు కూడా.. మాట్లాడడం లేదు. ఇది చిన్న విషయం కాదు పెను శాపంగా మారనుంది. ఇది అంతిమంగా.. జగన్‌కు ఇబ్బంది అయిపోయినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు పరిశీలకులు. సో.. ఇప్పటికైనా.. తన వర్గాన్ని తాను కాపాడుకునేందుకు జగన్ ప్రయత్నిస్తారో లేదో చూడాలి.